న్యూఢిల్లీ: రిలయన్స్ బ్రదర్స్ ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య ఒప్పందం ఉంది. కానీ అనిల్ అంబానీ ఇప్పుడు కేవలం అరెస్ట్ కావడమే కాదు మూడు నెలల జైలుశిక్షను అనుభవించాల్సిన దుర్బరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ నెల రోజుల్లోపు స్వీడన్ టెలికం మేజర్ ఎరిక్సన్ సంస్థకు రూ.453 కోట్ల బకాయి నెల రోజుల్లో చెల్లించకుంటే మూడు నెలల జైలుతోపాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. కానీ దివాళా సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న మార్గం ఉన్నది. 

అనిల్ పాత రుణాలకు హామీతోనే ముకేశ్‌కు సమస్య
రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీకి తన సొదరుడు అనిల్ అంబానీని ప్రస్తుతానికి గండం నుంచి గట్టెక్కించడానికి పెద్ద సమస్యేం కాదు. కానీ అనిల్ పాత అప్పులకు హామీ ఉండాల్సి రావడంతోనే వెనుకడుగు వేస్తున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్-కామ్) ఆస్తుల విక్రయంతో వచ్చే డబ్బుతో రుణాల సమస్య నుంచి బయడపడాలని అనిల్ అంబానీ ప్రయత్నించారు.అనిల్ అంబానీ సమస్యను అన్ని విధాల తీర్చేందుకు సుప్రీంకోర్టు కూడా సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది.

జియోకు ‘ఆర్-కామ్’ స్పెక్ట్రం విక్రయాన్ని అనుమతించాలని టెలికం శాఖకు సూచన
ఆర్-కామ్ నుంచి రూ.1400 కోట్ల విలువైన రిలయన్స్ జియో స్పెక్ట్రం కొనుగోలును ఆమోదించాలని టెలికం శాఖకు సూచించింది. కానీ అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ పాత రుణాలకు హామీ ఇవ్వలేమని టెలికంశాఖకు రిలయన్స్ జియో లేఖ ఇవ్వడంతో పీట ముడి పడింది. అక్కడ నుంచి పరిస్థితి అనిల్ అంబానీ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, నెలలోపు బకాయి చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బుధవారం సుప్రీంకోర్టు హెచ్చరికతో కూడిన తీర్పు ఇవ్వాల్సిన తీవ్రతకు చేరింది. 

ఒకనాడు వేగవంతమైన నిర్ణయాలకు మారుపేరు అనిల్ అంబానీ
ఒకనాడు అంటే ధీరూబాయి అంబానీ బతికున్న రోజుల్లో  వ్యాపార వర్గాల్లో అనిల్‌ అంబానీ అంటే.. చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా పేరుంది. నికర సంపద విషయంలో ఢోకా ఉండేది కాదు. కానీ ఇప్పుడు బకాయిలు కడతారా? జైలుకెళతారా అని సుప్రీం కోర్టు హెచ్చరించేలా ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారు. కాలచక్రం తిరిగేసరికి అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. వాటి నుంచి ఇపుడు బయటపడడం అనిల్ అంబానీకి ఎంతో ముఖ్యం.   

2006లో భారత కుబేరుల్లో అనిల్ ఒకరు
2006లో భారత్‌లోని కుబేరుల్లో ఒకరాయన. ఫోర్బ్స్‌ జాబితాలో తొలి 10 మందిలో ఆయన పేరు కచ్చితంగా ఉంది. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారమే.. ఆయన మూడో భారత కుబేరుడు. అప్పట్లో ఆయనకు 14.8 బిలియన్ల డాలర్ల సంపద ఉండేది. అందులో 65 శాతం వాటా రిలయన్స్‌ కమ్యూనికేషన్‌దే. తాజాగా అదే ఆర్‌కామ్‌ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ ఏడాది రెండు నెలలు కూడా గడవలేదు. కానీ ఆయన సంపద 26 శాతం తగ్గి 1.2 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 

రూ.35,575 కోట్ల నుంచి రూ.1604 కోట్లకు ఆర్ కామ్ ఎం క్యాప్
ఇక బుధవారం నాటి సుప్రీం కోర్టు తీర్పుతో ఆర్ కామ్ షేర్లు మరింత డీలా పడ్డాయి. అంటే సంపద మరింత తగ్గే ప్రమాదం ఉందన్నమాట. 2006 నాటి షేరు ఆర్‌కామ్‌ షేరు ధరకూ ఇప్పటికీ పోలికే లేదు. దాదాపు 95 శాతం నష్ట పోయింది. 2006 మార్చి 6వ తేదీన బీఎస్ఈలో నమోదైన ఆర్‌కామ్‌ షేర్ల విలువ రూ.35,575 కోట్ల మార్కెట్‌ విలువ నమోదైంది. బుధవారం నాటి లెక్క తీసుకున్నా కూడా 95.49% తగ్గి రూ.1,604 కోట్లకు మార్కెట్‌ విలువ పరిమితమైంది.    

మదుపర్ల విశ్వాసం సన్నగిల్లడమే అనిల్ అంబానీ సమస్య
రుణదాతలకు బకాయిలను చెల్లించడంలో కంపెనీ తన ఆస్తులను విక్రయించే విషయంలో విఫలం కావడంతో మదుపర్ల విశ్వాసం సన్నగిల్లడం ఒక కారణం. ఇక ముకేశ్‌ అంబానీ జియో మార్కెట్లోకి అడుగుపెట్టాక.. మిగతా టెలికం కంపెనీల లాగే ఆర్‌కామ్‌ కూడా తీవ్ర టారిఫ్‌ ఒత్తిడిని ఎదుర్కొంది. ఆదాయ మార్జిన్లను కోల్పోయింది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ.341 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 2017 డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలోని రూ.206 కోట్ల నష్టాన్ని పెంచుకుందన్నమాట. ఇక ఆదాయం కూడా రూ.1176 కోట్ల నుంచి రూ.1083 కోట్లకు పరిమితమైంది. 

ఐటీ రిఫండ్స్ చెల్లింపునకు అనుమతించాలని రుణదాతలకు అనిల్ అంబానీ వేడుకోలు
అయిదేళ్ల క్రితం ఒప్పందం ప్రకారం ఆర్‌కామ్‌ నెట్‌వర్క్‌ను ఎరిక్సన్‌ నిర్వహించింది. అయితే రూ.1150 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో గతేడాది మేలో ఎన్‌సీఎల్‌ఏటీ గడప తొక్కింది. చివరకు రూ.550 కోట్లు చెల్లించడానికి సెటిల్‌మెంట్‌ చేసుకున్నారు. కానీ అది కూడా గడువులోగా చెల్లించక సుప్రీం కోర్టు హెచ్చరించే పరిస్థితి తెచ్చుకున్నారు. ఈ గండం నుంచి బయట పడడానికి అనిల్‌ పావులు కదుపుతున్నారు. ఆదాయ పన్ను రిఫండ్‌(రూ.260 కోట్లు)లను నేరుగా ఎరిక్సన్‌కు బదిలీ చేయడానికి రుణదాతలకు విజ్ఞప్తి చేశారు కూడా. నాలుగు వారాల్లో మిగతా నిధులనూ సమీకరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం సఫలమైతే వివాదం కొలిక్కివచ్చినట్లే అనుకోవాలి.    

ఎరిక్సన్ తోపాటు భారీ రుణాలు తీర్చాల్సిన బాధ్యత అనిల్ అంబానీదే
ఎరిక్సన్‌కు బకాయిలు తీర్చేస్తే ఆర్‌కామ్‌ బయటపడినట్లేమీ కాదు. ఆర్‌కామ్‌కున్న భారీ రుణాలను తీర్చాలి. అందుకు ఇప్పటికే ఆస్తుల విక్రయ ప్రణాళికను ఆర్‌కామ్‌ చేపట్టినా అది కూడా కొలిక్కి రాలేదు. అన్న ముకేశ్‌ అంబానీకి చెందిన జియోకు స్పెక్ట్రమ్‌ ఆస్తుల విక్రయం ద్వారా రుణాలను రూ.18,000 కోట్ల మేర తగ్గించుకోవడంలో సఫలం కావాలి. ఆర్‌కామ్‌ పాత అప్పుల హామీలకూ బాధ్యత వహించాల్సి ఉంటుందన్న నిబంధనతో ముకేశ్‌ అంబానీ కంపెనీ వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. ఆర్‌కామ్‌ పాత బకాయిలకు తమకు బాధ్యత లేదన్న అంశంపై ప్రభుత్వం హామీ ఇస్తే ఒప్పందంలో ముందడుగు వేస్తామని జియో తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇక టెలికాం విభాగం తీసుకునే నిర్ణయంపైనే ఆర్‌కామ్‌ భవితవ్యం ఆధారపడి ఉంది.

సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు 24 గంటల్లో రంగంలోకి దిగిన ఆర్ కాం
ఎరిక్సన్‌కు డబ్బులు కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సుప్రీం కోర్టు హెచ్చరించిన 24 గంటల్లోపేలోపే ఆర్‌కామ్‌ రంగంలోకి దిగింది. తన ఖాతాలో ఉన్న రూ.260 కోట్లను నేరుగా స్వీడన్‌ టెలికాం కంపెనీకి బదిలీ చేయడానికి తక్షణం ఆమోదం తెలపాలని రుణదాతలను కోరింది. ఇక మిగతా రూ.200 కోట్లను సైతం సమీకరించగలమని కంపెనీ ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేసింది. ఇందుకోసం ఢిల్లీ, ముంబైలోని స్థిరాస్తి ఆస్తులను ఆర్‌కామ్‌ విక్రయించొచ్చు.

జియోను ఇలా కోరనున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్
ఫైబర్‌, ఎమ్‌సీఎన్‌ ఒప్పందాల చెల్లింపులను వేగవంతం చేయాలని జియోను కోరవచ్చని విశ్వసనీయ వర్గాల కథనం. ఇప్పటికే రూ.118 కోట్లు కోర్టుకు డిపాజిట్‌ చేసిన నేపథ్యంలో మొత్తం రూ.550 కోట్లు(వడ్డీ అదనం) బకాయిలో మిగతా రూ.453 కోట్లను కట్టడానికి సుప్రీం నాలుగు వారాల గడువును మాత్రమే ఇచ్చిన సంగతి తెలిసిందే. లేదంటే మూడు నెలల పాటు అనిల్‌, ఇతరులు జైల్లో కూర్చోవాల్సి ఉంటుందని బుధవారం హెచ్చరించిన విషయం విదితమే. 

రిలయన్స్‌ నిప్పన్‌లో తన వాటాపై ఆఫర్ చేసిన రిలయన్స్‌ కేపిటల్‌ 
రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఆర్‌ఎన్‌ఏఎం)లో తమకున్న వాటాను కొనుగోలు చేయాల్సిందిగా నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు రిలయన్స్‌ కేపిటల్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఆర్‌ఎన్‌ఏఏం సంస్థను రిలయన్స్‌ కేపిటల్‌, నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఇందులో ఇరు సంస్థలకు 42.88 శాతం చొప్పున వాటా ఉంది. ఇప్పుడు రిలయన్స్‌ కేపిటల్‌ తన 42.88 శాతం వాటాను కూడా నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు ఇవ్వాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా తాజా ప్రతిపాదనను నిప్పన్‌ లైఫ్‌ ముందుపెట్టింది.

కేపిటల్ వాటా కొంటే అతిపెద్ద విదేశీ వాటా గల ఎంఎప్ సంస్థగా రిలయన్స్ నిప్పన్
ఇప్పటికే 42.88 శాతం వాటా ఉన్నందున, రిలయన్స్‌ కేపిటల్‌కు ఉన్న 42.88 శాతం వాటాను కూడా కొనుగోలు చేస్తే భారత్‌లో అత్యధిక విదేశీ వాటా ఉన్న  మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థగా రిలయన్స్‌ నిప్పన్‌ అవతరిస్తుంది. ‘రిలయన్స్‌ కేపిటల్‌ తన భాగస్వామి నిప్పన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కు పూర్తి వాటాను అమ్మేందుకు ఆఫర్‌ ఇచ్చింద’ని రిలయన్స్‌ కేపిటల్‌ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సరైన సమయంలో తెలియజేస్తామని పేర్కొంది. 

నిప్పన్ సంస్థలో వాటా విక్రయంతో 40 శాతం రుణ భారం తొలిగినట్లే
రిలయన్స్ నిప్పన్ బీమా సంస్థలో వాటాల విక్రయంతో రిలయన్స్‌ కేపిటల్‌కు ఉన్న రుణ భారంలో 40 శాతం అంటే దాదాపు రూ.18 వేల కోట్ల వరకు తీర్చేసే వీలు ఉంటుందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆస్తుల అమ్మకం ద్వారా కుప్పగా పేరుకుపోయిన రుణ భారాన్ని తగ్గించుకునేందుకు అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూపు కంపెనీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

రుణాల చెల్లింపునకు అనిల్ అంబానీ ప్లాన్ ఇది
రిలయన్స్ అడాగ్ గ్రూపు సంస్థకు గల రూ.45 వేల కోట్ల రుణాల్లో రూ.7000 కోట్ల మేర రుణాలను ఈక్విటీలుగా మార్చి 51 శాతం వాటాలను విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరో రూ.17 వేల కోట్లు తన ఆస్తుల విక్రయంతో తీర్చేయాలని భావిస్తోంది. ఇందులో రిలయన్స్ జియో నుంచి అనుమతి వస్తేనే అడుగు ముందుకు పడుతుంది. ఢిల్లీ, ముంబైలతోపాటు ఎనిమిది పట్టణాల్లో తనకు గల స్థిరాస్తులను విక్రయించడం ద్వారా రూ.10 వేల కోట్ల భారం తగ్గించుకోవాలని అనిల్ అంబానీ ప్లాన్.