SUPR DAILY అందరి మన్నలను పొందిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రధాన నిర్ణయం తీసుకుంది. తన ‘సూపర్ డైలీ’ సర్వీసులను దేశంలోని ఐదు ప్రధాన నగరాలలో మూసివేస్తున్నట్లు  ప్రకటించింది. ఈ సూపర్ డైలీ సేవల కింది స్వీగ్గీ  నిత్యావసర వస్తువులను, పాలను, ఇతర గృహోపకరణ పస్తువులను డెలివరీ చేస్తోంది. సంస్థ సబ్‌స్క్రైబర్‌ లకు ఈ సేవలు అందిస్తోంది.  

ఫుడ్‌ టెక్‌ మేజర్‌ స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది! నిత్యావసర సరుకుల డెలివరీ సేవలు, సూపర్‌ డైలీని (Supr Daily) ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ సహా మెట్రో నగరాల్లో నిలిపివేస్తున్నామని ప్రకటించింది. బిజినెస్‌ ఆపరేషన్స్‌ను రీ అలైన్‌ చేశాక కొన్ని వ్యాపార సేవలను పూర్తిగా బంద్‌ చేస్తారని సమాచారం. సూపర్‌ డైలీ సీఈవో, కో ఫౌండర్‌ ఫణి కిషన్‌ అడపల్లి పంపించిన అంతర్గత ఈ మెయిల్‌ ద్వారా ఈ విషయం తెలిసింది.

మొత్తం 68లో 3 నగరాల్లో స్విగ్గీ జీనీ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని స్విగ్గీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 'క్రికెట్‌, ఫెస్టివ్‌ సీజన్లలో ఫుడ్‌ మార్కెట్‌ ప్లేస్‌, ఇన్‌స్టా మార్ట్‌కు విపరీతంగా డిమాండ్‌ ఉంది. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఆ ఆర్డర్లను త్వరగా డెలివరీ చేయాల్సి ఉంటోంది. స్విగ్గీ జీనీ సేవలు ప్రభావితం చెందిన నగరాల్లో త్వరలోనే సేవలు ఆరంభిస్తాం' అని కంపెనీ ప్రకటించింది.

'రీ స్ట్రక్చర్‌లో భాగంగా సూపర్‌ డైలీ (Supr Daily) సేవలను ఢిల్లీ, ముంబయి, పుణె, హైదరాబాద్‌, చెన్నైలో నిలిపివేస్తున్నాం. మా యూజర్లు, బ్రాండ్‌, వెండార్‌ భాగస్వాములకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా వాటి మూసివేత, ట్రాన్సిషన్‌ ప్లాన్‌ను మేం అమలు చేయబోతున్నాం. బెంగళూరులో మాత్రం సేవలు కొనసాగిస్తాం' అని సూపర్‌ డైలీ సీఈవో ఫణి కిషన్‌ అన్నారు.

'రీ స్ట్రక్చర్‌ చేయడం వల్ల ఈ ఐదు నగరాల్లోని ఉద్యోగులపై ప్రభావం ఉంటుంది. కొందరు కార్పొరేట్‌ ఉద్యోగులపైనా ఉండబోతోంది. ఆర్గనైజేషన్‌ను మేం రైట్‌ సైజ్‌ చేయబోతున్నాం. రీస్ట్రక్చర్‌ చేయబోయే కంపెనీలో ఎక్కువ మంది ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలను మేం గుర్తించాం. స్విగ్గీలో ఉద్యోగులు, మానవ వనరులను ఎంతో గౌరవిస్తాం. పూర్తిగా ట్రాన్సిషన్‌ సపోర్ట్‌ అందిస్తాం. ఉద్యోగుల ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నాతో సహా మేనేజర్లు, ఫంక్షనల్‌ లీడర్లు, హెచ్‌ఆర్ భాగస్వాములు అందుబాటులో ఉంటారు' అని ఫణి తెలిపారు. సూపర్‌ డైలీని 2018లో స్విగ్గీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఆ కంపెనీ ముంబయి శివార్లలో రోజుకు 6000 ఆర్డర్లు సర్వ్‌ చేసేది. స్విగ్గీ కొనుగోలు చేశాక ఫుడ్‌ డెలివరీ, కన్వీనియెన్స్‌, గ్రాసరీకి సేవలు విస్తరించింది. గత నాలుగేళ్లుగా ఆరు నగరాల్లో రోజుకు 2 లక్షల ఆర్డర్లను సర్వ్‌ చేస్తున్నారు. 

సూపర్ డైలీ పేరుతో స్టార్టప్ కంపెనీని ఐఐటీ బొంబై గ్రాడ్యుయేట్స్ శ్రేయాస్ నాగ్దావనే, పునీత్ కుమార్‌లు 2015లో ప్రారంభించారు. ఈ సర్వీసు బాగా క్లిక్ అవడంతో స్విగ్గీ ఈ సంస్థను 2018 సెప్టెంబర్‌లో కొనుగోలు చేసింది. భారీ పెట్టుబడి పెట్టి కొన్న ఈ సంస్థను స్వీగ్గీ సరిగ్గా నడపలేకపోయింది. దీంతో నష్టాల బాట పట్టాల్సి వచ్చింది. దీంతో చివరకు సేవలకు స్వస్తి పలికింది.