Asianet News TeluguAsianet News Telugu

బీఎస్ఎన్ఎల్ కథ కంచికేనా?

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ కన్నా మూసివేతకే కేంద్ర ఆర్థిక శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ సంస్థల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆ రెండు సంస్థల ఉద్యోగులు ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నారు. 
story-prime-ministers-office-active-decision-on-future-of-bsnl-mtnl-soon-
Author
New Delhi, First Published Oct 14, 2019, 12:40 PM IST
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలపై చిన్నచూపు చూస్తున్న నరేంద్రమోదీ సర్కార్ .. భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిఫోన్‌ నిగమ్‌ లిమిటెడ్ ‌(ఎంటీఎన్‌ఎల్‌)లను మూసి వేయడానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వసంస్థలు ప్రజలకు సేవలు అందించే లక్ష్యానికంటే ముఖ్యంగా ఆదాయం సమకూర్చేవిగానే ఉండాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. 

లక్షల మందికి ఉపాధినిస్తూ మరెంతో మందికి సేవలనందిస్తున్న ఈ సంస్థలను ప్రగతిబాటలో పట్టించేలా సంస్కరణలు చేపట్టకుండా.. వాటిని మూసివేసేందుకు కేంద్రం సమాయత్తమవుతున్నది. వాస్తవానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ సేవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టడం కన్నా.. వాటిని సంస్కరించడమే శ్రేయస్కరమని టెలీ కమ్యూనికేషన్స్ శాఖ ప్రతిపాదించింది. 

ఈ సంస్కరణల ప్యాకేజీని అమలు చేస్తే 2024 కల్లా బీఎస్‌ఎన్‌ఎల్‌ వేల కోట్ల రూపాయల లాభాలు ఆర్జించే సంస్థగా అవతరిస్తుందని టెలీ కమ్యూనికేషన్స్ శాఖ అంచనా వేసింది. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఈ రెండు సంస్థలకు మంగళం పాడేందుకే మొగ్గుచూపింది. సర్కార్ సంస్థలను ప్రయివేటీకరించి ఖజానా నింపుకోవాలన్న ఉద్దేశ్యాన్నే కేంద్రం కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. 

అప్పుల్లో కూరుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ వీలుకాదు కాబట్టి.. ఈ రెండు సంస్థలను మూసేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటువైపు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సంస్థలకు తాళం పడితే.. వాటి అప్పులు, ఉద్యోగుల వీఆర్‌ఎస్‌లకు చెల్లించే మొత్తాలను గణించిందనీ, వాటిని కుదించుకునేందుకూ మార్గాలను వెతుకుతున్నట్టు సమాచారం.

నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లను మూసివేయడం కన్నా.. సంస్కరించడమే చౌక. వీటిని సంస్కరించేందుకు రూ. 74వేల కోట్ల బెయిలౌట్‌ ఇవ్వాలని డీఓటీ ప్రతిపాదించింది. అదే ఈ రెండు పీఎస్‌యూలను షట్‌డౌన్‌ చేస్తే.. బీఎస్‌ఎన్‌ఎల్‌లోని ఉద్యోగులకు అంటే సుమారు 1.65 లక్షల మందికి వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీం, సంస్థ రుణాల చెల్లింపులకు దాదాపు రూ. 95వేల కోట్లు అవసరమవుతాయని వివరించింది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయిస్తే ప్రయివేటు టెలికాం సంస్థలతో పోటీ పడుతుందని రివైవల్‌ ప్యాకేజీలో డీఓటీ వివరించింది. ఆర్థిక సంవత్సరం 2021 నుంచి నష్టాలు తగ్గించుకుంటుందనీ, 2024కల్లా లాభాల బాటలో ప్రయాణిస్తుందని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రాబడిలో 77శాతం కేవలం వేతనాలకే వెళ్లాయి. 

పదవీ విరమణ వయసును ప్రస్తుతమున్న 60 ఏండ్ల నుంచి 58 ఏండ్లకు తగ్గించాలని సూచించింది.(మరో ఐదారేండ్లలో సంస్థలో సంస్థలోని సగం మంది ఉద్యోగులు రిటైర్‌ కాబోతున్నట్టు ఒక అంచనా) రూ. 74 వేల కోట్ల రూపాయల ప్యాకేజీలో.. వీఆర్‌ఎస్‌కు రూ. 29,182 కోట్లు, రెండేండ్లు ముందుగానే పదవీ విరమణ చేస్తున్న వారికి రిటైరల్‌ బెనిఫిట్స్‌ కింద రూ. 10,993 కోట్లు, 4జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కింద రూ. 20, 410 కోట్లు, మరో రూ. 13, 202 కోట్లు 4జీ అమలుకు క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌కు అవసరమవుతాయని ప్యాకేజీలో డీఓటీ వివరించింది. 

ఈ ప్యాకేజీని అమలు చేస్తే.. ఆర్థిక సంవత్సరంలో 2019లో రూ. 13,804 కోట్ల నష్టాలను నమోదు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ 2020లో నష్టాలు రూ. 18,231 కోట్లకు పెరగొచ్చు. కానీ, అటు తర్వాత 2021కి నష్టాలు తగ్గిపోయి రూ. 5,432 కోట్లు నమోదు చేసే అవకాశముంటుంది. 2023లో రూ. 396 నష్టాల నుంచి 2024లో రూ. 2,235 కోట్ల లాభాలను ఆర్జించే స్థితికి చేరుతుందని డీఓటీ అంచనా వేసింది.

ప్రభుత్వ సంస్థలను కాపాడి లాభాలను ఆర్జించే నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్రం వాటిని ఏ విధంగా మూసివేయాలా అని వ్యూహాలు రచిస్తున్నది. అందుకే, ఈ సంస్థలు లాభాలు సంపాదించే అవకాశాలున్నా.. వాటి గొంతునులిమేసేందుకే పథకాలు పన్నుతున్నది. ఈ సంస్థలను షట్‌డౌన్‌ చేస్తే.. ఉద్యోగులందరికీ ఆకర్షణీయమైన వీఆర్‌ఎస్‌ ఇవ్వాల్సిన అవసరంలేని మార్గాలను అన్వేషిస్తున్నది. ఈ

 సంస్థల్లో మూడు రకాల సిబ్బంది ఉన్నారు. సంస్థలే స్వయంగా ఎంపిక చేసుకున్నవారు. ఇతర పీఎస్‌యూలు, ప్రభుత్వ శాఖల నుంచి వచ్చి చేరినవారు  ఇండియన్‌ టెలికమ్యూనికేషన్స్‌ సర్వీస్‌(ఐటీఎస్‌) అధికారులు. ఐటీఎస్‌ అధికారులకు వీఆర్‌ఎస్‌ ఇవ్వాల్సిన అవసరంలేదు. ఇతర ప్రభుత్వ శాఖల్లోకి పంపిస్తే సరి. సంస్థ స్వయంగా రిక్రూట్‌ చేసుకున్న ఉద్యోగులు మొత్తం సిబ్బందిలో 10శాతం మాత్రమే, వారి జీతభత్యాలూ తక్కువ స్థాయిలో ఉంటాయి. 

కాగా, ఇతర శాఖల నుంచి వచ్చిచేరిన ఉద్యోగులకు మాత్రమే కంపల్సరీ రిటైర్‌మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా సంస్థ మూసివేతకు నిధులను కుదించుకునే కాపట్యాన్ని సర్కారు ప్రదర్శిస్తున్నది. ఈ పద్ధతిలో సిబ్బందిని విడగొడితే.. రూ. 95వేల కోట్ల కంటే తక్కువ నిధులే ఖర్చవుతాయని భావిస్తున్నది. అంతేకాదు, ఈ విభాగాల కింద ఎంత మంది సిబ్బంది ఉన్నారో తెలుపాల్సిందిగా కంపెనీలను సర్కారు ఇదివరకే పురమాయించినట్టు సమాచారం.

డీఓటీ ప్రతిపాదించిన సంస్కరణలను వెంటనే అమలు చేయాలని ప్రధాని మోడీని కార్మికులు కోరారు. డీఓటీ ప్రతిపాదించిన బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీతో బీఎస్‌ఎన్‌ఎల్‌ మూడు, నాలుగేండ్లలో తప్పకుండా గాడిన పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సంచార్‌ నిగమ్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీ కె సెబాస్టియన్‌ ప్రధానికి రాసిన లేఖలో రివైవల్‌ ప్యాకేజీని ఆమోదించాలని సర్కారును కోరారు. బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీపై బీఎస్‌ఎన్‌ఎల్‌లోని సీనియర్‌ అధికారుల్లో ఏకాభిప్రాయం లేదేమో కానీ, ఉద్యోగులందరికీ బలమైన నమ్మకమున్నదని వివరించారు.

మోడీ సర్కారు మరో మూడు ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ)ను అమ్మేసేందుకు సిద్ధమైంది. పెట్టుబడుల ఉపసంహరణ విధానంలో వాటాల అమ్మకాలకు రంగం సిద్ధం చేసింది. కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కంకార్‌), నార్త్‌ ఈస్ట్రన్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఈఈపీసీఓ), తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీహెచ్‌డీసీ) లిమిటెడ్‌ సంస్థల నుంచి వాటాల ఉపసంహరణ ప్రక్రియలో సలహాదారుల కోసం బిడ్‌లను ఆహ్వానించింది. 

కంకార్‌ నుంచి 30శాతం వాటాలను అమ్మేసేందుకు ఇటీవలే కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 54.80శాతం వాటా ఉన్న ఈ సంస్థ నుంచి వాటాలు అమ్మేస్తే.. దాని నిర్వహణాధికారాన్ని కేంద్రం కోల్పోతుంది. ఎన్‌ఈఈపీసీఓ, టీహెచ్‌డీసీల నుంచీ పెట్టుబడుల ఉపసంహరణకూ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఈ రెండు కంపెనీల నుంచి వాటాల విక్రయ ప్రక్రియలో సలహాలు, మార్గనిర్దేశనం చేసేందుకు లావాదేవీల సలహాదారు, లీగల్‌ సలహాదారు, అస్సెట్‌ వ్యాల్యూ యర్‌ల కోసం అర్హత, అనుభవమున్న కంపెనీలు వచ్చేనెల 4లోపు ప్రతిపా దనలు పంపించాలని సర్కార్ కోరింది. రెండు దశల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని తెలిసింది. నాలుగైదు నెలల్లో ఈ ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేస్తున్నది. 

ఈ మూడు సంస్థలే కాదు.. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లోని మొత్తం 53.29 శాతం వాటాలను, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌సీఐ)లోని 63.75శాతం వాటాలను అమ్మేసేందుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేయడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా కేంద్రం దాదాపు రూ. 12,357.49 కోట్లను రాబట్టినట్టు డిపం సైట్‌ వెల్లడిస్తున్నది.
Follow Us:
Download App:
  • android
  • ios