రెండు సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్న స్టీల్ ధరలు తిరిగి తిరోగమన బాట పట్టే అవకాశం ఉందని క్రిసిల్ తాజా నివేదిక అంచనావేసింది. గడచిన ఆర్థిక సంవత్సరం మార్చి చివరినాటికి టన్నుకు గరిష్ట స్థాయిలో రూ.70,000కు చేరిన స్టీల్ ధర, 2023 మార్చి నాటికి రూ.60,000కు దిగిరావచ్చని పేర్కొంది.
వివిధ కారణాల వల్ల ఇటీవల స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. కరోనా తర్వాత నిర్మాణ రంగం క్రమంగా పుంజుకుంటోంది. దాదాపు రెండేళ్ల పాటు ఇంటి నిర్మాణం వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ సిమెంట్, స్టీల్ ధరలు భారీగా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. సిమెంట్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే స్టీల్ ధరలు మాత్రం తగ్గుముఖం పట్టవచ్చునని క్రిసిల్ అంచనా వేసింది.
గత నెలలో టన్ను స్టీల్ ధర రూ.76వేలకు చేరుకుంది. 2023 మార్చి నాటికి ఈ ధర రూ.60 వేలకు దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలు ఇంకా కొనసాగుతుండటం, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం, కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి వివిధ దేశాలు చర్యలు చేపట్టడంతో ముడి సరుకు ధరలు పెరిగాయని క్రిసిల్ తెలిపింది.
వర్షాకాలం సమయంలో నిర్మాణాలు నెమ్మదించి స్టీల్‌కు డిమాండ్ తగ్గుతుందని, స్టీల్ ధరలు తగ్గుముఖం పట్టవచ్చునని పేర్కొంది. దేశీయంగా ఉన్న మిల్లులకు సరిపడా దిగుమతులు కూడా అందుతాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి స్టీల్‌కు డిమాండ్ తగ్గుతుందని క్రిసిల్ పేర్కొంది. నిర్మాణ వ్యయం పెరగడం వల్ల ఇంటి కొనుగోలు లేదా నిర్మాణం విషయంలో వినియోగదారు వాయిదాకు మొగ్గు చూపుతారని, ఇది డిమాండ్ తగ్గడానికి కారణమవుతుందని క్రిసిల్ పేర్కొంది. ఇతర దేశాల్లో కూడా స్టీల్ ధరలు భారీగానే పెరిగినట్లు తెలిపింది.
ప్రస్తుతానికి స్టీల్ ధరలు రికార్డు గరిష్ఠానికి చేరుకున్నాయి. సరఫరా సమస్యలకు తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు పలు దేశాలు తీసుకుంటున్న చర్యల వల్ల ముడి సరుకుల ధరలు ఆకాశాన్నంటడం ఉక్కు ధరల పెరుగుదలకు కారణమని క్రిసిల్ తెలిపింది. కానీ, రానున్న వర్షాకాలంలో నిర్మాణాలు తగ్గుముఖం పడతాయి కాబట్టి స్టీల్ గిరాకీ తగ్గుతుందని, దీనివల్ల ధరలు కూడా దిగొస్తాయని పేర్కొంది.
రానున్న రోజుల్లో పరిస్థితులు సానుకూలంగా ఉండొచ్చని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి స్టీల్ డిమాండ్ గణనీయంగా తగ్గవచ్చని నివేదిక అంచనా వేసింది. నిర్మాణ వ్యయం పెరిగిన కారణంగా ఇళ్ల కొనుగోళ్లు, నిర్మాణాలు వాయిదా పడనున్నాయి. కాబట్టి స్టీల్ డిమాండ్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని క్రిసిల్ వివరించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా స్టీల్ ధరలు ఆకాశాన్నంటాయని, స్టీల్ తయారీలో కీలక ముడి పదార్థమైన కోకింగ్ కోల్ ధరలు 47 శాతం పెరిగాయని క్రిసిల్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి సమయానికి ప్రపంచ మార్కెట్లో టన్ను కోకింగ్ కోల్ ధర 455 డాలర్లు( రూ. 35,400) ఉండగా, మూడు వారాల్లో ఇది 670 డాలర్ల(సుమారు రూ. 52 వేల)కు చేరుకుంది.
