రూపీ బలహీనత, ముడిచమురు ధరల పెరుగుదల, గ్లోబల్ మార్కెట్‌లో అమ్మకాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా గణనీయమైన పతనాన్ని చవిచూశాయి. RBI కీలక వడ్డీ రేట్ల పెంపు కారణంగా, మార్కెట్‌లో జాగ్రత్త ధోరణి కనిపించింది. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు పుంజుకున్నాయి.
ట్రేడర్లు US ద్రవ్యోల్బణం గణాంకాల దృష్టి సారించారు, దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ప్రారంభం నుంచే డౌన్ ట్రెండ్ తో ప్రారంభమయ్యాయి. US ఫెడ్ తీసుకునే చర్యలు సైతం మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 812 పాయింట్ల చొప్పున 1.47 శాతం పడిపోయి 54,507 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 50, అదే సమయంలో 231 పాయింట్లు లేదా 1.4 శాతం క్షీణించి 16,246 వద్దకు చేరుకుంది.
బ్రాడ్ బేస్డ్ సెల్‌ఆఫ్ ట్రేడింగ్ వల్ల ప్రారంభమైన మొదటి ఐదు నిమిషాల్లోనే రూ.2.51 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టేసింది. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ శుక్రవారం రూ.253 లక్షల కోట్లకు పడిపోయింది.
మార్కెట్లను దెబ్బతీస్తున్న ఫ్యాక్టర్స్ ఇవే...
US ద్రవ్యోల్బణం గణాంకాలు
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన US ద్రవ్యోల్బణ గణాంకాలు దాదాపు నాలుగు దశాబ్దాల గరిష్ట స్థాయిలో ఉంటాయని అంచనాలు వెలువడ్డాయి. తద్వారా ఫెడరల్ రిజర్వ్ తీసుకునే కఠినమైన ద్రవ్య విధాన చర్యలను సూచిస్తోంది. ఇది ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది.
ఉక్రెయిన్ సంక్షోభం...
ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో ముడిపడి ఉన్న సప్లై చెయిన్ అంతరాయాలతో పాటు, యూఎస్ సహా పలు ప్రపంచ దేశాల్లో 40 సంవత్సరాల కంటే అత్యధిక ధరలను పెంచాయి.
క్రూడాయిల్ ధరల్లో పెరుగుదల..
క్రూడాయిల్ ధరల పెరుగుదల కారణంగా, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో చమురు కంపెనీల షేర్లలో పెరుగుదల ఉంది. మరోవైపు, ఇతర స్టాక్‌లలో క్షీణత ధోరణి కనిపిస్తోంది.
US ఫ్యూచర్లలో క్షీణత:
మార్కెట్ ప్రారంభానికి ముందు, US స్టాక్‌ల భవిష్యత్ ధరలలో తగ్గుదల ధోరణి ఉంది. నాస్‌డాక్ 100 ఫ్యూచర్స్ ఒక శాతం వరకు క్షీణించింది. అంటే మార్కెట్ ప్రారంభమైనప్పుడు యుఎస్ టెక్ స్టాక్‌లలో అమ్మకాలు జరుగుతాయని ట్రేడర్లు ఆశిస్తున్నారు.
కనిష్ట స్థాయికి రూపాయి
దేశీయ కరెన్సీ శుక్రవారం US డాలర్‌కు ప్రతిగా రూ.77.82 వద్ద సరికొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీల బలహీనత కారణంగా రూపాయి వెనుకడుగు వేసింది. US ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లలో పెరుగుదల కారణంగా డాలర్‌కు మద్దతు లభించింది. ఏది ఏమైనప్పటికీ, బలహీనమైన ఆర్థిక డేటాతో పదునైన అప్‌సైడ్‌లు పరిమితమయ్యాయని ఐసిఐసిఐ డైరెక్ట్ తన మార్నింగ్ నోట్‌లో తెలిపింది.
