స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 కోట్లు, అంతకుమించిన టర్మ్‌ డిపాజిట్‌ రేట్లను 40-90 బేసిస్‌ పాయింట్ల (0.4-0.9 శాతం) మేర పెంచినట్లు మంగళవారం ప్రకటించింది. మే 10 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 7- 45 రోజుల్లో మెచ్యూరిటీ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును 3 శాతం వద్దే ఉంచింది. 46-179 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటును 3 శాతం నుంచి 3.5 శాతానికి పెంచింది.  

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ టర్మ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 40 బేసిస్ పాయింట్ల నుండి 90 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన వడ్డీ రేట్లు రూ.2 కోట్లు, అంతకుమించిన మొత్తంపై వర్తిస్తాయని, ఇది మంగళవారం నుండి అంటే మే 10వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు ఎస్బీఐ తెలిపింది. 

ఏడు రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిపై FD వడ్డీ రేటు 3 శాతంగా కొనసాగిస్తున్నారు. 46 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 3 శాతం నుండి 3.50 శాతానికి, 180 రోజుల నుండి 210 రోజుల కాలపరిమితిపై 40 బేసిస్ పాయింట్లు పెంచి 3.50 శాతానికి సవరించింది. 211 రోజుల నుండి ఏడాది లోపు కాలపరిమితిపై 3.3 శాతం ఉండగా, 45 బేసిస్ పాయింట్లు పెంచి 3.75 శాతానికి చేర్చింది.

సీనియర్ సిటిజన్లకు అదనం 

సీనియర్ సిటిజన్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌పైన వడ్డీరేట్లని పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. 7 రోజుల నుండి 45 రోజుల కాలపరిమితిని మినహాయించింది. 46 రోజుల నుండి 179 రోజుల కాలపరిమితిపై 3.5 శాతం నుండి 4 శాతానికి, 180 రోజుల నుండి 210 రోజుల కాలపరిమితిపై 3.6 శాతం నుండి 4 శాతానికి పెంచింది. 211 రోజుల నుండి ఏడాది లోపు కాలపరిమితిపై 3.80 శాతం నుండి 4.25 శాతానికి, ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 4.5 శాతానికి, రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 4.75 శాతానికి, మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 5 శాతానికి, అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 4.1 శాతం నుండి 5 శాతానికి పెంచింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా 

ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) కూడా మంగళవారం రుణాల వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచింది. ఈ నెల 12వ తేదీ నుండి ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేటును 0.1 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

యూనియన్ బ్యాంకు 

రూ.100 కోట్లకు మించిన సేవింగ్స్ డిపాజిట్స్ పైన వడ్డీ రేటును జూన్ 1వ తేదీ నుండి 20 నుండి 65 బేసిస్ పాయింట్ల మేర పెంచనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. రూ.50 లక్షల నుండి రూ.100 కోట్ల వరకు డిపాజిట్స్ పైన వడ్డీ రేటును 2.9 శాతం వద్ద కొనసాగిస్తోంది. రూ.100 నుండి రూ.500 కోట్ల డిపాజిట్స్ పైన 2.90 శాతం నుండి 3.10 శాతానికి రూ.500 నుండి రూ.1000 కోట్ల డిపాజిట్స్ పైన 2.90 శాతం నుండి 3.40 శాతానికి, రూ.1000 కోట్లకు పైన డిపాజిట్ల పైన 2.90 శాతం నుండి 3.55 శాతానికి పెంచింది. రూ.50 లక్షల కంటే తక్కువ సేవింగ్స్ డిపాజిట్స్ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 2.75 శాతానికి పరిమితం చేస్తోంది.