Asianet News TeluguAsianet News Telugu

మేకిన్‌ఇండియాకు షాక్: ఇంపోర్ట్ డ్యూటీతో టీవీ ఉత్పత్తికి శాంసంగ్ రాంరాం?

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియా నినాదానికి తాము జత కలుస్తామని నమ్మ బలికిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ ఇటీవలే నొయిడాలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించింది. కానీ దిగుమతి సుంకం విధించినందుకు భారతదేశంలో టీవీల ఉత్పత్తిని నిలిపివేయనున్నదని సమాచారం. 
 

Samsung may stop TV production in India
Author
Delhi, First Published Sep 4, 2018, 7:53 AM IST

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకున్నది. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మక ‘మేకిన్ ఇండియా’ పథకంలో భాగస్వామి అవుతానని ప్రకటించిన శాంసంగ్.. చెన్నైలోని టీవీ ఉత్పత్తిని నిలిపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

టీవీల తయారీలో వినియోగించే ‘ఓపెన్ సెల్’పై ప్రభుత్వం విధిస్తున్న దిగుమతి సుంకం భారీగా ఉన్నదని శాంసంగ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది టీవీలోని కీలక పరికరాల్లో ఒకటి. గత ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ‘ఓపెన్ సెల్’పై ఎకాఎకీన 10 శాతం దిగుమతి సుంకం విధించడంతో టీవీల తయారీకి శాంసంగ్ ప్రత్యామ్నాయ ఉత్పత్తి కేంద్రం కోసం ఎదురుచూస్తోందని సమాచారం. అయితే తర్వాత ఒకింత సుంకం తగ్గించినా సరిపోలేదని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. 

గమ్మత్తేమిటంటే శాంసంగ్ ఇటీవలే నోయిడాలో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్‌ను ఆవిష్కరించిన కొన్ని నెలల్లోనే శాంసంగ్‌ భారతదేశంలో టీవీ ఉత్పత్తులను నిలిపివేయాలని శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. చెన్నైలో ఉన్న తన ఒకేఒక్క టీవీల ఉత్పత్తి సౌకర్యాన్ని వేరే ప్రాంతానికి తరలించాలని శాంసంగ్‌ ప్రణాళికలు రచిస్తున్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. 

వియత్నాంలో ఉన్న టీవీల ఉత్పత్తి సౌకర్యం శాంసంగ్‌ అత్యంత పెద్ద ప్రొడక్షన్‌ హబ్‌. ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ స్థానికంగా ఉన్న సప్లయర్స్‌ను అలర్ట్‌ చేసినట్టు తెలిసింది. వియత్నాంలో సంపాదించిన ఆదాయం కంటే 2016-17లో భారతదేశంలో సాధించిన ఆదాయం 8 బిలియన్ల డాలర్ల ఆదాయం ఎక్కువ సంపాదించింది. టీవీల ఉత్పత్తిని వియత్నాంకు మార్చనున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యం ఇదేనని తెలుస్తోంది. 

అయితే ఇప్పటి వరకు చెన్నైలో ఉన్న టీవీల తయారీ ప్లాంట్‌ ఏడాదికి 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసేది. అయితే టీవీల ఉత్పత్తిని శాంసంగ్‌ ఆపివేస్తుందని వస్తున్న నివేదికలపై ఆ కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ దేశీయంగా టీవీలను తయారు చేసేందుకే తాము కట్టుబడి ఉన్నామని, టీవీల యూనిట్ల ప్రొడక్షన్‌ను తరలించే ప్లాన్లపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios