Asianet News TeluguAsianet News Telugu

సమతాతో కలిసి ‘మోర్’ అమెజాన్ కబ్జా.. డీల్‌కు బిర్లా ఓకే

క్రమంగా మల్టీబ్రాండ్ రిటైల్ మార్కెట్ విదేశీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నది. ఇంతకుముందు దేశీయ ఆన్ లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొన్నాక దాని ప్రత్యర్థి అమెజాన్ కూడా స్పీడ్ పెంచింది.

Samara-Amazon to acquire ABRLs More
Author
Mumbai, First Published Sep 20, 2018, 8:55 AM IST

దేశీయ రిటైల్‌ రంగంలో భారీ కొనుగోలుకు తెర లేచింది. దేశీయ ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్ వాటాల కొనుగోలు తర్వాత ప్రత్యర్థి సంస్థ అమెజాన్ ప్రత్యామ్నాయాల కోసం ఎదురుచూసింది. భారత్‌కే చెందిన సమరా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అనుబంధ విట్ జిగ్ అడ్వైజర్ సర్వీసెస్‌లో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఇంతకుముందే వొడాఫోన్‌తో తన సంస్థ ఐడియాను విలీనం చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ మరో విక్రయానికి ఒప్పందం కుదుర్చుకుంది.

తాజాగా తన ‘మోర్‌’ ఆహార, సరుకుల రిటైల్‌ చైన్‌ను సమరా ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ అనుబంధ సంస్థ విట్‌జిగ్‌ అడ్వైజర్‌ సర్వీసెస్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా రిటైల్ ‌(ఏబీఆర్‌ఎల్‌)లో పూర్తి వాటాను ఈ కంపెనీ కొనుగోలు చేయనున్నది. కనిష్ఠ ఫైనాన్స్‌తో కలిసి తమకు ఏబీఆర్‌ఎల్‌లో ఉన్న 99.99 శాతం వాటాను విట్‌జిగ్‌కు విక్రయించడానికి ఒక షేర్ల కొనుగోలు ఒప్పందం (ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు ఎక్స్చేంజ్‌లకు సమాచారం అందజేసింది. 

ఏబీఆర్‌ఎల్‌లో తనకు మొత్తం 62.19% వాటాను విట్‌జిగ్‌కు విక్రయించడానికి బుధవారం జరిగిన సమావేశంలో బోర్డు డైరెక్టర్లు అనుమతులు ఇచ్చారని తెలిపింది. అదే సమయంలో కనిష్ఠ ఫైనాన్స్‌, ఏబీఆర్‌ఎల్‌లతో కలిసి విట్‌జిగ్‌తో ఒక ఎస్‌పీఏను కుదుర్చుకుంది. కాగా, ‘ఏబీఆర్‌ఎల్‌ షేర్ల విక్రయానికి నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది’ అని ఆర్‌కేఎన్‌ రిటైల్‌ పేర్కొంది. 

ఒప్పందం విలువను తెలపడానికి ఆదిత్య బిర్లా గ్రూప్‌ నిరాకరించింది. అయితే దీని విలువ రూ.4,200 కోట్లు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏబీఆర్‌ఎల్‌లోని వాటాను ఆర్‌కేఎన్‌ రిటైల్‌, కనిష్ఠ ఫైనాన్స్‌లు విట్‌జిగ్‌కు విక్రయించిన తర్వాత విట్‌జిగ్‌లో యాజమాన్య వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఏబీఆర్‌ఎల్‌లో అమెజాన్‌ 49 శాతం వాటా కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. దీని ప్రకారం ఏబీఆర్‌ఎల్‌లో విట్‌జిగ్‌కు 51%, అమెజాన్‌కు 49% వాటా లభిస్తుంది. 

Samara-Amazon to acquire ABRLs More

సమరా ద్వారా మోర్ యాజమాన్య సంస్థ ఏబీఆర్ఎల్ లో వాటాల కొనుగోలుపై అమెజాన్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన కానీ, స్పందన కానీ వెలువడలేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనల ప్రకారం మల్టీ బ్రాండ్‌ రిటైల్‌లో 51 శాతం ఎఫ్‌డీఐకి భారత్‌ అనుమతులిచ్చింది. ఇక క్యాష్‌ అండ్‌ క్యారీ హోల్‌సేల్‌ వెంచర్లకు 100 శాతం ఎఫ్‌డీఐకి ఆమోదం ఉంది.

సమరా దేశీయ కంపెనీ కాగా.. అమెజాన్‌కు 49 శాతం వాటా మాత్రమే ఉండడంతో ఎఫ్‌డీఐ నిబంధనల విషయంలో ఎటువంటి సమస్య రాదని పరిశ్రమకు చెందిన ఒక సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏబీఆర్‌ఎల్‌ మోర్‌ స్టోర్లను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడివిడిగా ఎటువంటి అనుమతులు పొందనవసరం లేదు. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ ఎఫ్‌డీఐ కింద అయితే అలా అనుమతులు పొందాల్సి వచ్చేంది.

ఏబీఆర్‌ఎల్‌తో జూన్‌లో ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నా.. గత నెల వరకు కూడా అమెజాన్‌, గోల్డ్‌మాన్‌ శాక్స్‌లతో సమరా క్యాపిటల్‌ చర్చిస్తూనే వచ్చింది. చివరకు గోల్డ్‌మాన్‌ శాక్స్‌ ఈ కొనుగోలుకు దూరమైంది. అమెజాన్‌ ఆసక్తిగా ముందుకు రావడానికి కారణాలు లేకపోలేదు.

భారతదేశ రిటైల్ మార్కెట్‌లోకి అడుగు పెట్టాలన్న అమెజాన్‌ వ్యూహానికి మోర్‌ స్టోర్లు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. మంచి గిరాకీ ఉండే ఆహార, సరుకుల రిటైల్‌ విభాగంలో మరింత వేగంగా వృద్ధి చెందాలని భావిస్తున్న తరుణంలో మోర్‌ రూపంలో అమెజాన్‌కు అవకాశం వచ్చినట్లైంది. కాగా, అమెజాన్‌కు ఇది రెండో ప్రత్యక్ష పెట్టుబడి. గతేడాది సెప్టెంబర్‌లోనూ షాపర్స్‌ స్టాప్‌లో 5% వాటాను కొనుగోలు చేసిందీ సంస్థ.

కాగా, సమరా క్యాపిటల్‌ దేశీయ కంపెనే. సమరా ఏఐఎఫ్‌ ద్వారా పెట్టుబడులు పెట్టనుంది. దీనికి చాలా విదేశీ పెట్టుబడిదార్ల మద్దతు కూడా ఉంది. విదేశీ నిధుల వాటా ఎక్కువైనా సమరా ఏఐఎఫ్‌ భారతీయుల ప్రాయోజితం ద్వారా నడుస్తోంది కాబట్టి చట్ట ప్రకారం దేశీయ సంస్థ కిందకే వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఒప్పందానికి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) అనుమతులు లభించాల్సి ఉంటుంది. 

కొనుగోలు చేసిన కంపెనీకి ఏ పేరు పెడతారన్నది ఇంకా తెలియరాలేదు. ఏబీఆర్ఎల్, సమరా సంస్థల మధ్య ఒప్పందం విలువ రూ.4,200 కోట్లు. దీంతో ఏబీఆర్‌ఎల్‌ పుస్తకంలో ఉండే రూ.4,000 కోట్ల రుణాలు మాయం కానున్నాయి. భారత్‌లో ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన బిగ్‌ బజార్‌, రిలయన్స్‌ రిటైల్‌, డిమార్ట్‌ తర్వాత నాలుగో అతిపెద్ద సూపర్‌ మార్కెట్‌ సంస్థ మోర్‌ కావడం విశేషం. 

Samara-Amazon to acquire ABRLs More

వివిధ రిటైల్ సంస్థలను కొనుగోలు చేసిన ఏబీఆర్ఎల్.. తన మోర్ సంస్థ షేర్లను సమతాకు విక్రయిస్తూ చేసుకున్న ఒప్పందం నేపథ్యంలో మోర్‌కు అప్పుల భారం ఎలా వచ్చిందన్న ప్రశ్నలు ఉన్నాయి. పదేళ్ల క్రితం  త్రినేత్ర, ఫ్యాబ్‌మాల్‌లను, రెండేళ్ల క్రితం జుబిలెంట్‌కు చెందిన టోటల్‌ సూపర్‌ స్టోర్‌లను ఆదిత్య బిర్లా గ్రూప్ కొనుగోలు చేయడం వల్ల ప్రధానంగా ఈ రుణాలు ఎక్కువయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొండి బాకీల వసూళ్లకు దివాలా చట్టాన్ని తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో విమర్శలకు తావు లేకుండా ఉండేందుకు ఆదిత్యా బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తన గ్రూప్ సంస్థల షేర్లను ఇతర సంస్థలకు విక్రయించడం ద్వారా రుణాల భారం తొలగించుకోవాలని తలపోస్తున్నారని వినికిడి.

గతంలో ఒక టెల్కోల్లో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆర్బీఐలో డైరెక్టర్ల మండలిలో సభ్యత్వాన్ని కూడా వదులుకునేందుకు ఆయన వెనుకాడలేదు. తాజాగా వొడాఫోన్‌లో ఐడియా విలీనం తర్వాత గత జూలైలో అలెరిస్ కార్ప్‌ను హిందాల్కో ఇండస్ట్రీస్‌  బినానీ సిమెంట్ సంస్థను ఆల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయనున్నది.

కుమార్‌ మంగళం బిర్లా, కుటుంబానికి ఆర్‌కేఎన్‌ రిటైల్‌, కనిష్ఠ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌లు హోల్డింగ్‌ కంపెనీలు. వీటికి ఆదిత్య బిర్లా గ్రూప్‌లో వరుసగా 62%; 37% చొప్పున వాటాలు ఉన్నాయి. ఈ కంపెనీకి మోర్‌ బ్రాండ్‌ కింద దేశవ్యాప్తంగా 509 సూపర్‌మార్కెట్లు, 20 హైపర్‌మార్కెట్లు ఉన్నాయి. ఇంకా వావ్‌, ప్రామిస్‌, ఫీస్టర్స్‌ వంటి సొంత లేబుల్స్‌ కూడా ఉన్నాయి. ప్రార్థన, మోర్‌ ఛాయిస్‌, మోర్‌ డైలీ, మోర్‌ లైఫ్‌, బ్లూఎర్త్‌, క్రఫ్‌, ఇంచీల్స్‌, చాటర్‌ కిడ్స్‌, యో వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios