టెలికం రంగంలో అడుగు పెట్టడంతోనే ఇతర సంస్థలకు సవాల్ విసిరిన రిలయన్స్ జియో ఇప్పటికీ అదే దూకుడు కొనసాగిస్తోంది.  తాజాగా రిలయన్స్ జియో, ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ మాత్రమే అక్టోబర్ నెలలో నూతన వినియోగదారులను ఆకర్షించగలిగాయి.

మిగిలిన టెల్కోలు, భారతి ఎయిర్టెల్ వోడాఫోన్ ఐడియా, టాటా టెలీసర్వీసెస్, ఎంటీఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కాం) చతికిల పడ్డాయి.ముఖ్యంగా జియో, బీఎస్ఎన్ఎల్ కలిపి కోటికిపైగా కొత్త కస్టమర్లను పొందాయి.

మిగిలిన టెలికాం సంస్థలు కోటికిగా పైగా వినియోగదారులను కోల్పోయాయి. ముఖ్యంగా జియో ఒక్కటే ఏకంగా కోటిమంది మంది వినియోగదారులను తన నెట్వర్క్ పరిధిలో చేర్చుకోవడం ఆసక్తికర పరిణామం.

దీంతో జియో మొత్తం కనెక్షన్ల సంఖ్య 26.28కోట్లకు చేరిందని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) తెలిపింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్తగా 3,63,991మంది వినియోగదారులను చేర్చుకోవడంతో మొత్తం చందాదారుల సంఖ్య 11.34 కోట్లకు చేరింది. 

అయితే 2018 అక్టోబర్ నెలలో వినియోగదారుల సంఖ్య నామ మాత్రంగా పుంజుకుని 119.2 కోట్లకు చేరింది. ఇందులో రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎల్ కలిసి 1.08 కోట్ల కొత్త మొబైల్ ఫోన్ కస్టమర్లు గత నెలలో జత కలవగా  మిగిలిన ఆపరేటర్లు (వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, ఇతర) 1.01 కోట్ల మంది కస్టమర్లను కోల్పోయారు. 

గత అక్టోబర్ నెలాఖరునాటికి 42.76కోట్ల ఖాతాదారులు ఉన్న వోడాఫోన్ ఐడియా 73.61 లక్షలమంది వినియోగదారులను కోల్పోయింది. ఎయిర్టెల్ 18.64 లక్షలమందిని పోగొట్టుకుని 34.17కోట్ల ఖాతాదారులకు పరిమితమైంది. ఇక టాటా టెలీసర్వీసెస్ 9.25 లక్షలు, ఎంటిఎన్ఎల్ 8068, ఆర్కాం 3831వినియోగ దారులను పోగొట్టుకున్నాయి. 

టెలికాం మార్కెట్లో  టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య సెప్టెంబర్ నెలలో 119.14 కోట్లు కాగా అక్టోబర్ నెలలో 119.2 కోట్లకు పెరిగింది. మొబైల్ ఫోన్ సెగ్మెంట్లో ఖాతాదారుల సంఖ్య  సెప్టెంబర్ నెలలో 116.92 కోట్ల  నుంచి అక్టోబర్లో 117 కోట్లకు పెరిగింది. 

జియో ఫెస్టివ్ గిఫ్ట్కార్డ్ బొనాంజా
రిలయన్స్ జియో కస్టమర్లకోసం హ్యాపీ న్యూయర్ బొనాంజా ఆఫర్లు కొనసాగుతున్నాయి. తాజాగా ఫెస్టివ్ గిఫ్ట్ కార్డ్ ఆఫర్ను జియో  ప్రకటించింది. దీని ద్వారా జియో  యూజర్లు  జియో కొత్త ఫోన్తోపాటు, ఆరు నెలలపాటు ఉచిత వాయిస్, డేటా సర్వీసులను పొందవచ్చు. జియో ఫెస్టివ్ గిఫ్ట్ కార్డ్  విలువ రూ.1095.  

రిలయన్స్ జియో గిఫ్ట్ ఆఫర్లు రెండు భాగాలుగా విభజించింది.  రూ. 501, రూ. 594 విలువైన  కూపన్లు లభిస్తాయి.  రూ.501తో  జియో ఫీచర్ ఫోన్తో పాటు నెలకు రూ.99 విలువైన కూపన్లు  ఆరు నెలలకు అన్నమాట. గిఫ్ట్కార్డు కొనుగోలు చేసిన కస్టమర్ దగ్గరలోని జియో స్టోర్లోగానీ, రిలయన్స్ డిజిటల్లోగాని పాత జియో ఫోన్ ఎక్స్చేంజ్  ద్వారా కొత్త  జియో ఫోన్ 2 కోనుగోలు చేయవవచ్చు.