Asianet News TeluguAsianet News Telugu

వడ్డీ రేట్ల తగ్గింపు: చౌకగా గృహ, వాహన రుణాలు, కొత్తరేట్లు ఇవే..!!

ఇటు కేంద్ర ప్రభుత్వం.. అటు కార్పొరేట్ రంగం ఎదురుచూస్తున్న వేళ ఆర్బీఐ ప్రజలకు ప్రత్యేకించి ఇళ్ల కొనుగోలుదారులకు తీపి కబురందించింది. పావుశాతం రెపోరేట్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల వడ్డీరేట్లు కూడా తగ్గుతాయి. ఫలితంగా ఇండ్ల, వాహన రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి

RBI rate cut: If your bank is happy, so is your lending rates on home, personal, car loan - A case for your EMIs
Author
New Delhi, First Published Feb 8, 2019, 12:45 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దాదాపు 18 నెలల తర్వాత ఆర్బీఐ రుణగ్రహీతలకు తీపి కబురందించింది. 2017 ఆగస్టు రెండో తేదీన పావుశాతం కోత తర్వాత ఇప్పటి వరకూ ఆర్బీఐ రెండు సార్లు రెపో రేటు పావుశాతం చొప్పున పెంచింది. కానీ అనూహ్యంగా ఈసారి పావుశాతం తగ్గించి అందరికీ ఉపశమనం కలిగించింది.

అయితే ఈ తగ్గిన వడ్డీ రేటు తమకు వర్తిస్తుందా? రుణ భారం ఎంత తగ్గుతుంది.. గృహ రుణంలాంటి దీర్ఘకాలిక అప్పులు తీసుకున్న వారికి సందేహాలు సహజంగా వస్తాయి. ప్రస్తుతం రెపొరేట్ తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు వర్తింపజేస్తేనే లాభం కలుగుతుంది. లేకపోతేఇప్పుడున్న భారం తప్పదు. 

రెపో రేటు తగ్గగానే రుణాల రేటు కూడా తగ్గుతుందని భావించడం సహజమైనా బ్యాంకులు ముందుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్ల తగ్గింపునకే ప్రాధాన్యం ఇస్తాయి. రుణాలపై వడ్డీ రేట్ల విషయానికి వచ్చేసరికి కొంచెం వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా గృహ రుణాల విషయంలో కాస్త ఆలస్యంగానే స్పందిస్తుంటాయి.

బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు (రెపో)ను 6.50శాతం నుంచి 6.25శాతానికి తగ్గించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది కూడా. ఈ తగ్గింపును బ్యాంకులు ఎప్పుడు తమ ఖాతాదారులకు బదిలీ చేస్తాయనేదే సందేహంగా ఉంది. 

2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెడింగ్‌ రేట్‌) విధానంలోనే గృహరుణాలను మంజూరు చేస్తున్నాయి. అంతకుముందు ఇది బేస్‌ రేటులో రుణం తీసుకున్న వారు ఈ విధానంలోకి మారేందుకు కొంత రుసుము వసూలు చేసి, ఎంసీఎల్‌ఆర్‌లోకి మార్చేశాయి.

గతంలో బేస్‌ రేటులో ఉన్నప్పుడు అది మారినప్పుడల్లా రుణగ్రహీతలు ఉన్న అప్పుపై 0.5%వరకూ చెల్లించి, తగ్గిన వడ్డీ రేటులోకి మారాల్సి వచ్చేది. ఎంసీఎల్‌ఆర్‌ ఈ కష్టాన్ని తప్పించింది. 

ఈ పద్ధతిలోనూ కొన్ని చిక్కులు ఉన్నాయనీ ఆర్‌బీఐ తేల్చింది. రెపో రేటు పెరిగినప్పుడు నిధుల సమీకరణ భారం పెరిగిందని వడ్డీ పెంచే బ్యాంకులు, రేటు తగ్గినప్పుడు మాత్రం ఖాతాదారులకు ఆ ప్రయోజనాలను బదిలీ చేయడం లేదు. తమ ఎంసీఎల్‌ఆర్‌ మారలేదని, వడ్డీ రేట్లు తగ్గించేది లేదని వాదించేవి.

బ్యాంకర్ల వాదనను అధ్యయనం చేసిన ఆర్బీఐ.. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లను ప్రామాణికంగా తీసుకోవాలని గత సమీక్షలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈసారి వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో బ్యాంకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది స్పష్టత రావాల్సి ఉంది. 

ఉదాహరణకు ఎస్‌బీఐనే పరిగణనలోనికి తీసుకుంటే.. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.55% ఉండగా.. దీనిపై అదనంగా 25-35 బేసిస్‌ పాయింట్లను అదనంగా వసూలు చేస్తోంది. చలన వడ్డీ రేటుకు తీసుకున్న గృహరుణాలపై వడ్డీ రేటు 8.80-8.90శాతం (మహిళలకు 8.75-8.85%)ని విధిస్తోంది. 

గతంలో రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదిలీ చేయలేదు. కీలక వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఆ తగ్గింపును బ్యాంకులు తమ రుణ గ్రహీతలకు బదిలీ చేసేలా చూడాల్సిన బాధ్యత ఆర్బీఐపైనే ఉందని ఒక కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఈ తీర్పు తర్వాత ఇప్పుడే ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గించింది. కొన్ని నిబందనలను సాకుగా చూపించి, బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేందుకు ఇష్టపడవు. గతంలో ఇబ్బడిముబ్బడిగా వచ్చిన డిపాజిట్లపై ప్రత్యేకించి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత రేట్లు తగ్గాయి.

అదే సమయంలో రెపో రేటు తగ్గినా.. రుణం తీసుకునే వారు లేరనీ, వడ్డీ రేట్లు తగ్గిస్తే నష్టపోతామనీ బ్యాంకులు పేర్కొన్నాయి. ఇప్పుడూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభాల నేపథ్యంలో మళ్లీ బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. 

మరోపక్క రుణాలకు డిమాండ్ పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు తగ్గించే విషయంలో వేచి చూసే ధోరణితోనే ఉండవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇప్పుడు సమస్యంతా కొత్తగా రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్న వారికే వస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఎంసీఎల్‌ఆర్‌ విధానానికి బదులుగా ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ సూచీలను తీసుకురావాలని ఆర్‌బీఐ గత సమీక్షలో పేర్కొంది. ఇది వచ్చే ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. 

దీనికి సంబంధించిన మార్గదర్శకాలపై ఆర్బీఐ నుంచి ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఇల్లు కొనాలని ఆలోచిస్తున్న వారు పాత పద్ధతిలోనే రుణం తీసుకోవచ్చు. లేదా కొత్త విధానం వచ్చే వరకూ వేచి చూడొచ్చు. 

మధ్యతరగతి వారు ఇల్లు కొనేలా ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకాన్ని 2020 మార్చి 31 వరకూ పొడిగించినందున కొత్త రుణ విధానం అమల్లోకి వచ్చే వరకూ వేచిచూసినా ఇబ్బందేమీ లేదని నిపుణులంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios