Ratan Tata: టాటా పేరు చెబితేనే గుర్తొచ్చేది ఐశ్వర్యం, ఎవరినైనా దీవించాలన్నా చాలా మంది టాటా, బిర్లా అంతటి వాడివి అవ్వాలంటూ పెద్దలు దీవిస్తుంటారు. అలాంటి టాటా బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన వారిలో రతన్ టాటా ఒకరు. కానీ ఆయన మాత్రం సింప్లిసిటీకి మారుపేరుగా నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఎంతో ఇష్టపడే టాటా నానోలో ప్రయాణిస్తూ తళుక్కుమన్నారు.

టాటా ట్రస్ట్ అధినేత రతన్ టాటా, సింప్లిసిటీకి సంబంధించిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోలో, రతన్ టాటా తన కలల కారు అయిన టాటా నానోలో ఎలాంటి భద్రత లేకుండా, అంగరక్షకులు లేకుండా ముంబైలోని తాజ్ హోటల్‌కు చేరుకున్నారు. ఈ వీడియోలో రతన్ టాటా తెల్లటి Nano కారులో తాజ్ హోటల్‌కు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం తెలిపేందుకు, భద్రత కోసం హోటల్ సిబ్బంది మాత్రమే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ను ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో రతన్ టాటా సెక్యూరిటీ లేకుండా తెల్లటి నానో కారులో కూర్చుని తాజ్ హోటల్ చేరుకున్నారు. ఆయనని హోటల్ సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. రతన్ టాటా తలుచుకుంటే తన కార్ల కలెక్షన్ లోని ఓ లగ్జరీ కారులో రావచ్చు, కానీ అత్యంత సింప్లిసిటీతో ఉండే ఈ టాటా స్టైల్‌ని జనాలు బాగా ఇష్టపడుతున్నారు. ఈరోజు తాజ్ హోటల్ ఎంట్రన్స్ బయట రతన్ టాటాని చూశానని సోషల్ మీడియాలో బాబా ఖాన్ అనే నెటిజన్ కూడా ఈ ఘటనను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి ఇప్పటివరకు 124373 లైక్స్ వచ్చాయి.

View post on Instagram

నానో 2008లో విడుదలైంది
టాటా మోటార్స్ నానోను 10 జనవరి 2008న విడుదల చేసింది. కేవలం లక్ష రూపాయలకే సామాన్యుల వద్దకు చేరిన ఈ కారును చూసి ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది రతన్ టాటా కలల ప్రాజెక్టుగా పరిగణిస్తారు. అయితే ఇప్పుడు టాటా నానో కారు రోడ్లపై చాలా అరుదుగా దర్శనమిస్తోంది.