న్యూఢిల్లీ: భారత దేశంలో డిజిటల్ చెల్లింపులతోపాటు ఏటీఎం సెంటర్ల ద్వారా లావాదేవీలు జరిపే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత రెండేళ్లుగా ఏటీఎంల వినియోగం మరింతగా పెరిగిందని స్పష్టమైంది. 2016 నవంబర్ ఎనిమిదో తేదీన ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ 2017 మార్చి నెలాఖరుతో ముగిసిన సంగతి తెలిసిందే.

సగటున 105కు పెరిగిన ఏటీఎం లావాదేవీలు
2017 ఏప్రిల్ నాటికి సగటున ఒక ఏటీఎం సెంటర్‌లో లావాదేవీలు 105కి పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఈ సంఖ్య 130కి పెరిగింది. బ్యాంకులు డెబిట్ కార్డులను విరివిగా వినియోగదారులకు అందించడమే అందుకు కారణంగా తెలిసింది. 2017 ఏప్రిల్ నాటికి 78కోట్ల డెబిట్ కార్డులు వినియోగంలో ఉంటే ఏప్రిల్ 2019 నాటికి ఈ సంఖ్య 88 కోట్లకు చేరింది.

ద్వితీయ, త్రుతీయ శ్రేణి పట్టణాల్లో ఏటీఎం వాడకం రైస్
2019 జూన్ 14 నాటికి నగదు లావాదేవీల సంఖ్య 13 శాతం పెరిగి రూ.22.19 లక్షల కోట్ల వద్ద స్థిర పడ్డాయి. ఇదే 2017 ఏప్రిల్ నెలలో నగదు లావాదేవీలు కేవలం రూ.14.17 లక్షల కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాల పరిధిలో ఏటీఎంల వాడకం పెరిగింది. తక్కువ అద్దెలు ఉన్న ప్రాంతాల్లో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫలితంగా ఏటీఎంల వాడకం ఎక్కువైంది. 

జన్ ధన్ ఖాతాలతో పుంజుకున్న లావాదేవీలు
మూడేళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద తెరిచిన ఖాతాల్లో ప్రస్తుతం మూడు నెలలకోసారి పీఎం కిస్సాన్ స్కీమ్ కింద రూ.2000 జమ అవుతున్నాయి. నెలవారీగా ఏటీఎంల విత్ డ్రాయల్స్ తక్కువగానే ఉన్నా.. కార్డుపై సగటు రూ.80.9 విత్ డ్రాయల్ చేస్తున్నారు. నెలవారీ ఖాతాల విత్ డ్రాయల్స్ రూ.3,214 వద్ద స్థిరంగా ఉంది. సగటు ఏటీఎం వాడకం దారుల వయస్సు 22గా ఉంది. 

బ్యాంకుల నిరాసక్తతకు ఇలా చెక్
మొన్నమొన్నటి వరకు బ్యాంకులు ఏటీఎంలను ఏర్పాటు చేసే విషయమై నిరాసక్తంగా ఉన్నాయి. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఎటీఎంలు ఖాళీగా ఉంటే బ్యాంకులపై జరిమానా విధిస్తామని ఆర్బీఐ హెచ్చరించడంతో ఎటీఎంల్లో బ్యాంకులు నగదు నిల్వలు నింపేందుకు సిద్దం అవుతున్నాయి. 

పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు
దేశంలో డిజిటల్‌ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయని వీసా సంస్థ తెలిపింది. భారత్‌లో ప్రస్తుతం 97.1 కోట్ల క్రెడిట్, డెబిట్‌ కార్డులు ఉన్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో చెప్పుకోతగ్గ భారీ సంఖ్యలో కార్డులు గత మూడేళ్ల కాలంలో జారీ అయినవేనని తెలిపింది. 

అసాధారణ రీతిలో డిజిటల్ పేమెంట్స్
డెబిట్‌ కార్డుల వినియోగ పరిస్థితుల్లో మార్పులపై వీసా గ్రూపు భారత మేనేజర్‌ టీఆర్‌ రామచంద్రన్‌ మాట్లాడుతూ.. ‘డిజిటల్‌ దేశంగా మారుతున్న భారత్‌లో డెబిట్‌ కార్డులు అసాధారణ స్థాయిలో ఉన్నాయి. గత 12 నెలల్లో డెబిట్‌ కార్డు లావాదేవీలు 23 శాతం పెరిగాయి. ప్రజలు తమ కార్డులను తరచుగా వినియోగిస్తుండడం ఉత్సాహాన్చిచ్చే సంకేతం. మరింత భద్రతతో కూడిన చెల్లింపుల అనుభవం దిశగా పనిచేసేందుకు మాకు ఇది ప్రోత్సాహాన్నిస్తుంది’అని పేర్కొన్నారు.

అన్ని లావాదేవీలు ఉచితమే: పేటీఎం
డిజిటల్‌ వ్యాలెట్‌ దిగ్గజం పేటీఎం వినియోగదారుల ఆర్థిక లావాదేవీలపై అదనపు చార్జీలను వసూలు చేస్తోందంటూ వస్తున్న వదంతులకు తెరపడింది. సోషల్‌ మీడియాలో వేదికగా వస్తున్న ఇలాంటి వదంతులను ఆ కంపెనీ ఖండించింది. లావాదేవీలపై తాము ఎటువంటి చార్జీలనూ వసూలు చేయడం లేదని, భవిషత్తులో కూడా చేయబోమని స్పష్టం చేసింది. 


సోషల్ మీడియాలో వార్తలకు ఇలా వివరణ
పేటీఎం గేట్‌వే, పేటీఎం యాప్‌ ద్వారా కార్డులు, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, వ్యాలెట్‌ ఇలా ఏ రూపంలో వినియోగదారులు లావాదేవీలూ జరిపినా చార్జీలు వసూలు చేయబోమని కంపెనీ ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై ఒక శాతం, డెబిట్‌ కార్డులపై 0.9 శాతం, నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ లావాదేవీలపై రూ.12 నుంచి 15 వసూలు చేసేందుకు పేటీఎం సిద్ధమవుతోందంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో పేటీఎం ఈ విధంగా స్పందించింది.