న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ నిర్వహణ సంస్థ ‘స్విగ్గీ’ వేగం పెంచింది. పోటీ సంస్థలను దీటుగా ఎదుర్కోవడం కోసం వ్యాపార సేవలను విస్తృతం చేసింది. ఇప్పటివరకు కేవలం ఆహారపదార్థాలను మాత్రమే సరఫరా చేసే సంస్థగా ఉన్న స్విగ్గి.. ఇకపై నిత్యావసర సరకులను కూడా వినియోగదారులకు డోర్ డెలివరీ చేయనుంది. 

ఇందుకు‘స్విగ్గీ స్టోర్స్‌’లను మంగళవారం కంపెనీ ప్రారంభించింది. వీటి నుంచి పండ్లు, కూరగాయలు, కిరాణా సామగ్రి, బేబీకేర్‌, హెల్త్‌కేర్‌ వస్తువులతోపాటు ఇతర నిత్యావసర సరకులను ఇంటి వద్దకే సరఫరా చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

తొలుత ఈ సేవలను హర్యానాలోని గురుగ్రామ్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రారంభించింది. గుర్గావ్ నగర పరిధిలో 3,500 స్టోర్స్‌ను యాప్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించింది. వీటిని మరికొన్ని నెలల్లోనే దేశంలోని మెట్రోనగరాలకు విస్తరించనున్నది. 

ఈ కొత్త సేవలతో స్విగ్గీ ఇక బిగ్‌బాస్కెట్‌, గ్రోఫెర్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌నౌ, ఫ్లిప్‌కార్ట్‌ సూపర్‌ మార్ట్‌లతో పోటీపడనున్నది. ఈ సేవలను యాప్‌ వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది.

స్విగ్గి సీఈఓ, సహ వ్యవస్థాపకులు శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ ‘ప్రతి స్టోర్‌కు మా సేవల అనుసంధానంతోపాటు ప్రత్యేక ఎఫ్‌ఎంసీజీ ప్లాట్‌ఫాంను ప్రారంభించాం. స్విగ్గీ యాప్‌లోనే ఈ ప్రత్యేక సేవ ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, పూలు, పెట్‌ కేర్‌ వంటి 200 ప్రత్యేక స్టోర్లను ఇప్పటికే యాప్‌తో అనుసంధానించాం’అని తెలిపారు.

‘ఆహారపదార్థాలను డెలివరీ చేయటంలో వినియోగదారులకు మంచి అనుభూతిని పంచిన స్విగ్గీ ఇకపై అటువంటి అనుభూతినే నిత్యావసరాలను సరఫరా చేయటంలో కూడా అందిస్తుందని ఆశిస్తున్నాం’ అని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మాజేటీ అన్నారు. 
పట్టణ వినియోగదారుల జీవన నాణ్యతను పెంచటంలో స్విగ్గీ తొలి మైలురాయిను దాటిందని ఆయన చెప్పారు. 

దేశంలోని వివిధ మెట్రో నగరాల్లోని వివిధ స్టోర్లను కస్టమర్ల ముంగిటికే తీసుకెళ్లే యాప్‌ ఆధారిత సేవల కంపెనీగా మారాలన్నది తమ లక్ష్యమని శ్రీహర్ష మాజేటి తెలిపారు. 2014లో స్థాపించిన ‘స్విగ్గీ’కి దేశవ్యాప్తంగా 80కి పైబడి పట్టణాల్లో తనకు ఉన్న 60,000 రెస్టారెంట్‌ల భాగస్వాములతో వినియోగదారులను అనుసంధానం చేస్తోంది.