మనదేశంలో ఇల్లు, పెళ్లి, వ్యాపారం వంటి వాటికోసం ఎక్కువగా పర్సనల్ లోన్లు వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలా మారిపోయింది. అలాంటి అత్యవసర వస్తువుల కోసం కాకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం కోసం పర్సనల్ లోన్లు అధికంగా వాడుతున్నారు.

ఒకప్పటి పరిస్థితి వేరు... ఉద్యోగంలోనూ, వ్యాపారంలోని స్థిరపడిన తర్వాత మంచి, ఇల్లు, కారు, పెళ్లి వంటి కలలు ఉంటాయి. వాటికోసం బ్యాంకు లోన్లు తీసుకొని మరీ సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు ఆధునిక యుగంలో అంతా మారిపోయింది. ఇప్పటి యువత ‘జిందగీ నా మిలేగి దోబారా’ అని అంటున్నారు. అందుకే ఇంటి కోసం, కారు కోసం, పెళ్లిళ్ల కోసం డబ్బులు ఖర్చుపెట్టే కన్నా జీవితాన్ని ఎంజాయ్ చేయడం కోసం తమ డబ్బును వాడాలని నిర్ణయించుకున్నారు.

షికారుల కోసం పర్సనల్ లోన్

గత ఆరు నెలల్లో ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు సెలవుల్లో తమకి ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి ఎంజాయ్ చేసేందుకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నట్టు ఒక నివేదిక చెబుతోంది. 2023లో కూడా ఈ ట్రెండ్ ఉంది. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా పెరిగిపోయింది. అందమైన నగరాల్లో, ప్రదేశాల్లో ప్రయాణించేందుకు రుణం తీసుకొని మరీ ఇప్పటి యువత ఎంజాయ్ చేస్తోంది.

నగరాల విషయానికి వస్తే ఢిల్లీకి వెళ్లేందుకు 35 శాతం మంది రుణాన్ని తీసుకుంటున్నారట. అక్కడ రకరకాల ప్రదేశాలను చూసేందుకు, తమకు నచ్చిన హోటల్లో ఉంచేందుకు ఆ వ్యక్తిగత రుణాన్ని వినియోగిస్తున్నారు. ఢిల్లీ తరువాత హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాలు ఉన్నాయి. ఈ నగరాల్లో తిరిగేందుకే ఎక్కువగా యువత పర్సనల్ లోన్లు తీసుకుంటున్నట్టు నివేదిక చెబుతోంది.

చిన్న పట్టణాల నుంచే...

మెట్రో నగరాల్లో ఎంజాయ్ చేయాలంటే ఖర్చు ఎక్కువే అవుతుంది. అక్కడికి ఎక్కడికి వెళ్లాలన్నా క్యాబ్ బుక్ చేసుకోవాలి. పబ్బులు ఖర్చు కూడా తక్కువేం కాదు. అందుకే ట్రావెల్ లోన్ కూడా తీసుకునేవారు పెరిగిపోయారు. ఇలా పర్సనల్ లోన్ తీసుకొని మరీ తిరుగుతున్న వారి సంఖ్య మెట్రో నగరాల్లో ఎక్కువ అని అనుకుంటారు. నిజానికి టైర్ 2, టైర్ 3 నగరాలైన లక్నో, ఆగ్రా, జైపూర్ వంటి వారి నగరాల నుంచి ఎక్కువగా లోన్ తీసుకొని మరీ బయట నగరాలకు వెళ్లి ఎంజాయ్ చేసి వస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అంటే చిన్న నగరాల్లో నివసించే వారికి పెద్ద నగరాల్లో తిరగాలన్న కోరిక అధికంగా ఉంటుంది. వారు తమ ఆర్థిక స్వేచ్ఛను వినియోగించుకొని తమకి ఇష్టమైన ప్రయాణాలను చేస్తున్నారు.

ఏ వయసు వారు రుణాలు తీసుకుంటున్నారు?

ప్రయాణాల కోసం రుణాలు తీసుకునే వారిలో 65 శాతం మంది ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారే ఉన్నారు. అలాగే మిగతా 17 శాతం మంది వ్యాపారవేత్తలు. ఇక వయసు వారీగా చూస్తే 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నట్టు తేలింది. ఆ తర్వాత 20 నుంచి 30 సంవత్సరాల మధ్య గల జనరేషన్ జెడ్ యువత కూడా ఈ రుణాలను తీసుకుంటుంది. ప్రతి ఏటా ఇలా రుణాలు తీసుకొని ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.

గోవాకు వెళ్లేందుకు లోన్లు

ఎక్కువమంది గోవాకు వెళ్లేందుకు లేదా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి వాటికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొదటి స్థానంలో అయితే గోవానే ఉంది. ఇక విదేశీ పర్యటనల్లో భాగంగా ఆగ్నేయాసియాకు 44 శాతం మంది వెళుతున్నట్టు తెలుస్తోంది. ఇక ట్రావెల్ లోన్ లేదా పర్సనల్ లోన్ తీసుకొని మరి ఎంజాయ్ చేస్తున్న వారిలో 30 శాతం మంది లక్ష నుంచి మూడు లక్షల మధ్య రుణాన్ని తీసుకుంటున్నారు. ఇక 20 శాతం మంది మాత్రం 50 వేల నుంచి లక్ష మధ్య రుణాన్ని తీసుకుంటున్నారు. కానీ 19 శాతం మంది మాత్రం మూడు లక్షల నుండి 5 లక్షల వరకు రుణం తీసుకొని ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల్లోనే 50 వేల కంటే తక్కువ రుణం తీసుకునే వారి సంఖ్య ఏడు రెట్లు పెరిగిపోయింది.

ఇక గృహ పునరుద్ధరణ కోసం రుణాలు తీసుకునే వారు కూడా అధికంగానే ఉన్నారు. దాదాపు 31 శాతం మంది తమ ఉంటున్న ఇంటిని అందంగా మార్చుకోవడం కోసం లోన్లు వాడారు. పైసా బజార్ సీఈవో అయినా సంతోష అగర్వాల్ మాట్లాడుతూ ప్రజల తీరుతెన్నులు మారిపోయాయని, తమ జీవనశైలిని మార్చుకుని అవసరాలను, కోరికలను తీర్చుకోవడానికి రుణాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఇలాగే రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగితే బ్యాంకుల పంట పండినట్లే.