ముంబయి నగరాన్ని వర్షాలు ముంచెత్తతున్నాయి. జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విమాన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్నారు. ఇంతలా అందరూ ఇబ్బంది పడుతున్నా... కొందరు మాత్రం తమ పనిని హీరోల్లా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తున్నారని బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా అన్నారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా  రియల్ హీరోలపై ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఆ రియల్ హీరోలు ఎవరో తెలుసా..? న్యూస్ పేపర్ బాయ్స్ . ఇంటి బయట డతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా.. సమయానికల్లా తన టేబుల్‌పై దర్శనమిచ్చిన వార్తాపత్రికలపై ఆయన పెట్టిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

‘‘ముంబై ఎయిర్‌పోర్టు రన్‌వే మూగబోయింది. స్కూళ్లూ మూతపడ్డాయి. రైల్వే స్టేషన్లను వరదలు ముంచెత్తాయి. అయినా దినపత్రికలు మాత్రం సమయానికల్లా మా ఇంటికొచ్చాయి. అందునా తడవకుండా! కుండపోత వర్షాన్ని సైతం ఎదిరించి.. ఇది ‘సాధారణ రోజే’ అని మేము భావించేలా మౌనంగా సేవలు అందిస్తున్న తెరవెనుక హీరోలకు నేను సెల్యూట్ చెయ్యాలి..’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.