Asianet News TeluguAsianet News Telugu

ఈ–కామర్స్‌లో రూల్స్ రైటే.. కానీ ఇంట్రడక్షన్ స్టైలే: మోహన్‌దాస్‌ పాయ్‌

ఈ- కామర్స్ వ్యాపారం నిబంధనల్లో మార్పు తేవడం సబబేనని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ పేర్కొన్నారు. కానీ వాటిని ప్రవేశపెట్టిన తీరే బాగో లేదన్నారు. 

Mohandas Pai backs new FDI norms for e-commerce
Author
New Delhi, First Published Feb 7, 2019, 12:17 PM IST

విదేశీ పెట్టుబడులు గల ఈ– కామర్స్‌ కంపెనీల విషయమై కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నిబంధనలు సరైనవేనని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. ఈ–కామర్స్‌ సంస్థలు కారు చౌక రేట్లతో స్థానిక వ్యాపార సంస్థలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

భారత్‌లో అంతర్జాతీయ సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తే చూస్తూ కూర్చోవాల్సిన అవసరం లేదని టైకాన్‌ 2019 స్టార్టప్స్‌ సదస్సులో మోహన్ దాస్ పాయ్ చెప్పారు. ఈ–కామర్స్‌ నిబంధనలను ప్రకటించిన తీరు అభ్యంతరకరంగా ఉన్నా, అవి కొంత సముచితమేనన్నారు.

మరోవైపు, ఇందులో వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చే కోణం కన్నా ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోణమే ఎక్కువగా కనిపిస్తోందని సదస్సులో పాల్గొన్న స్టార్టప్‌ సంస్థల లాయర్‌ కరణ్‌ కల్రా పేర్కొన్నారు. ఒక ప్రత్యేక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే ఈ నిబంధనలు ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోందని సీనియర్‌ లాయర్‌ నిశిత్‌ దేశాయ్‌ తెలిపారు.  

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లు ఉన్న ఈ–కామర్స్‌ కంపెనీలు తమ అనుబంధ సంస్థల ఉత్పత్తులను సొంత ప్లాట్‌ఫాంపై విక్రయించరాదని, ధరలను ప్రభావితం చేసేలా ప్రత్యేక మార్కెటింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి చేయరాదని కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ-కామర్స్ నిబంధనలు ఈ నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకు ముందు అమెజాన్‌ ఇండియా ప్లాట్‌ఫాంపై నాలుగు లక్షల పైచిలుకు చిన్న స్థాయి విక్రేతలు ఉండేవారు. తాజా నిబంధనలతో అమెజాన్‌కి చెందిన క్లౌడ్‌టెయిల్, అపారియో సంస్థల కార్యకలాపాలు నిల్చిపోయాయి.  

నిబంధనలు కఠినం చేసినా భారత మార్కెట్‌పై తాము ఆశావహంగానే ఉన్నట్లు అమెరికా దిగ్గజం వాల్‌మార్ట్‌ తెలిపింది. భారత మార్కెట్లో దీర్ఘకాలిక వ్యాపారానికి కట్టుబడి ఉన్నామని వాల్‌మార్ట్‌ ఏషియా రీజనల్‌ సీఈవో డర్క్‌ వాన్‌ డెన్‌ బెర్గీ తెలిపారు.

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉపాధి కల్పన, చిన్న వ్యాపార సంస్థలు రైతులకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా దేశ ఆర్థిక వృద్ధిలో భాగం అవ్వాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios