మీషో ఈకామర్స్ సంస్థ ఒక రోజు సేల్ ద్వారా 53.5 లక్షల ఆర్డర్లు సాధించి గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్ల వృద్ధి సాధించింది.
సాఫ్ట్‌బ్యాంక్, మెటా కంపెనీల పెట్టుబడులు వెన్నుదన్నుగా ఉన్న ఈ-కామర్స్ స్టార్టప్ మీషో తన వన్-డే సేల్ ఈవెంట్‌లో 5.35 మిలియన్ ఆర్డర్‌లను నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది. మీషో గత సంవత్సరం జూన్ 6న నిర్వహించిన "మహా ఇండియన్ సేవింగ్స్ సేల్" సందర్భంగా 1 మిలియన్ ఆర్డర్‌లను నమోదు చేసింది.
"జూన్ 6, 2021న 1 మిలియన్ ఆర్డర్‌లు నమోదు చేయగా.. జూన్ 5, 2022న 5.35 మిలియన్ ఆర్డర్‌ల నమోదు చేసింది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రతిబంధకంగా ఉన్నప్పటికీ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. దాదాపు 1 లక్ష మంది విక్రేతలు ఇటీవలి సేల్‌లో పాల్గొన్నారు" అని మీషో ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలోని మారుమూలల్లో ఉన్న బటిండా, హల్ద్వానీ, షోలాపూర్, తిరునెల్వేలి వంటి ఇతర ప్రాంతాలతో సహా 75 శాతం మంది అమ్మకందారులు టైర్-2, ఆ వెలుపల ఉన్న ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం.
సేల్ ఈవెంట్‌లో పాల్గొనే విక్రేతలు సాధారణం కంటే దాదాపు 217 శాతం అధిక ఆర్డర్‌లను పొందారు. ఈ సేల్ ఈవెంట్‌లో 26,000 మంది కొత్త విక్రేతలు పాల్గొన్నారని ప్రకటన తెలిపింది. ‘పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్థూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ, మేము 20,000 పిన్ కోడ్‌లకు పైగా ప్రాంతాల్లో సేవలందిస్తూ, వన్-డే సేల్ ఈవెంట్‌లో 5.35 మిలియన్ ఆర్డర్‌లతో సరికొత్త రికార్డును సాధించాం. గత 6 నెలల్లో విక్రేత భాగస్వామ్యంలో మేము దాదాపు 3.75 రెట్లు పెరిగినట్లు చూశాం..’ అని మీషో బిజినెస్ సీఎక్స్ఓ ఉత్కృష్ట కుమార్ చెప్పారు.
మీషో యాప్ డౌన్‌లోడ్‌లు ఏడాది ప్రాతిపదికన దాదాపు 5 రెట్లు పెరిగి జనవరి-మార్చి 2022 కాలంలో 102 మిలియన్లకు పైగా పెరిగాయి. ‘మేం హైపర్‌లోకల్ వ్యాపారాలు, ఉత్పత్తుల ఆవిష్కరణలను పెంచుతూనే ఉంటాం. దేశం నలుమూలల నుండి వినియోగదారులకు ఇ-కామర్స్‌ను అందుబాటులోకి తెస్తాం. వినియోగదారులు ఇష్టపడే ఇ-కామర్స్ గమ్యస్థానంగా మారడానికి కొత్త ఆవిష్కరణలు చేస్తాం’ అని కుమార్ చెప్పారు. భిలాయ్, గుంటూరు, హుబ్లీ, కొల్లాం, మీరట్, పోర్ట్ బ్లెయిర్ వంటి మార్కెట్ల నుండి దాదాపు 78 శాతం డిమాండ్ వచ్చిందని ఆయన చెప్పారు. సేల్‌లో అత్యధిక వృద్ధిని సాధించిన టాప్ కేటగిరీలు దుస్తులు, కిడ్స్ వేర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ డెకర్ అని వివరించారు.