ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడిగా మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగా నియమితులవ్వడానికి అడుగు దూరంలో నిలిచారు. ఆయనను అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ నామినేట్ చేశారు.
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన అజయ్ బంగాను నామినేట్ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ మేరకు గురువారం వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది. అంతా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడిగా అజయ్ బంగా బాధ్యతలు చేపడతారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక పరిస్ధితులు క్లిష్టంగా వున్న సమయంలో ప్రపంచ బ్యాంక్‌కు సారథ్యం వహించేందుకు అజయ్ బంగా లాంటి వారే సమర్ధులని జో బైడెన్ పేర్కొన్నారు. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో అజయ్ పలు కంపెనీలను ప్రారంభించి, నిర్వహించారని ఆయన అన్నారు.
ఇదిలావుండగా..ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా వున్న డెవిల్ మాల్పాస్ గత వారం తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో మే నాటికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సి వుంది. అయితే అమెరికా అధినాయకత్వం, ఉన్నతాధికారులు జో బైడెన్‌ను ఈ పదవికి నామినేట్ చేయాలని నిర్ణయించారు.
ఇకపోతే..భారత్‌లో జన్మించిన అజయ్ బంగా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఐఐఎం అహ్మదాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. తర్వాత సిటీ గ్రూప్, నెస్లేలో పదేళ్ల పాటు పనిచేశారు. అనంతరం పెప్సికో, మాస్టర్ కార్డ్ వంటి దిగ్గజ సంస్థల్లో విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కి వైస్ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు అజయ్ బంగా.
