దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు.. ఎల్​పీజీ (వంట గ్యాస్​), ఏటీఎఫ్​ (ఏవియేషన్ టర్బైన్​ ఫ్యూయల్​) రేట్లు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఏటీఎఫ్​ ధర కిలో లీటర్​కు 0.2 2 శాతం పెరిగింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్​ ధర ప్రియమైంది. 

దేశంలో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఇంధన ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎల్పీజీ వంట గ్యాస్, కమర్షియల్ సిలిండర్ల రేట్లను సైతం చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. అనేక నగరాల్లో 110 నుంచి 120 రూపాయల మధ్య ఉంటోంది. డీజిల్ పరిస్థితీ దాదాపు ఇంతే. 100 నుంచి 110 రూపాయల మేర పలుకుతోంది. ఈ పెంపుదల పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. 17 రోజుల వ్యవధిలో 14 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి.

ఇప్పుడు తాజాగా ఏవియేషన్ టర్బైన్​ ఫ్యూయల్​ (ఏటీఎఫ్) రేట్లు కూడా పెరిగాయి. శ‌నివారం 0.2 శాతం మేర వాటి రేట్లను పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఫలితంగా- విమాన ఛార్జీలు మరింత భారంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఏటీఎఫ్ రేట్లు పెరగడం ఈ సంవత్సరంలో ఇది ఎనిమిదో సారి. ఇవ్వాళ్టి పెంపుతో ఏటీఎఫ్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. ఇదివరకెప్పుడూ లేని రేటును అందుకున్నాయి. మొత్తంగా ఈ సంవత్సరంలోనే కిలో లీటర్‌పై అదనంగా పడిన భారం రూ.39,180.42 పైసలు.

దేశ రాజధానిలో జెట్ ఫ్యూయల్ లీటర్ ఒక్కింటికి రూ. 277.50 పైసల మేర పెరిగింది. 1,000 లీటర్ల (కిలో లీటర్) ఏటీఎఫ్ ధర రూ.1,13,202.33 పైసలకు చేరింది. విమానయాన సంస్థలన్నీ ఇంధనాన్ని కిలో లీటర్ల ప్రాతిపదికన కొనుగోలు చేస్తుంటాయి. ముంబైలో ఏటీఎఫ్ ధర కిలో లీటర్ మీద 1,11,981.99, కోల్‌కతలో 1,17,753, చెన్నైలో 1,16,933 రూపాయలు పలుకుతోంది. విమానయాన సంస్థలు భరించే ఖర్చుల్లో 40 శాతం వాటా జెట్ ఫ్యూయల్‌దే. ఈ స్థాయిలో జెట్ ఫ్యూయల్ రేట్లు పెరగడం వల్ల విమానయాన సంస్థలు ప్రయాణ ఛార్జీలను పెంచే విషయంపై దృష్టి సారించాయి. ఫ్లెక్సిబుల్ టికెటింగ్ సిస్టమ్‌లో బేస్ ప్రైస్‌ను భారీగా పెంచడానికి చర్యలు తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. బేసిక్ టికెట్ ప్రైస్‌ను పెంచడం వల్ల డిమాండ్‌కు అనుగుణంగా వాటి రేట్లు వేల రూపాయలకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. దూర ప్రయాణాలు చేసే వారిపై ఇది అదనపు భారంలా మారుతుంది.