వాషింగ్టన్: ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్ అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన టాబ్లాయిడ్ ‘నేషనల్‌ ఎంక్వైరర్’‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నదని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు, నేషనల్ ఎంక్వైరర్ పబ్లిషర్ డేవిడ్ పెకర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

జెఫ్‌ బెజోస్‌కు టీవీ వ్యాఖ్యాత లారెన్‌ శాన్‌షీతో ఉన్న సంబంధాన్ని ఎంక్వైరర్‌ వర్గాలు బయటికి వెల్లడించాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన బెజోస్‌ వ్యక్తిగత విషయాలు బయటకు ఎలా తెలిశాయన్న దానిపై విచారణ జరపాలంటూ తన సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించారు.

అయితే దీనిపై విచారణ నిలిపివేయాలని నేషనల్‌ ఎంక్వైరర్‌ వర్గాలు తనపై ఒత్తిడి తెస్తున్నాయని బెజోస్‌ తెలిపారు. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందని వస్తున్న ఆరోపణలకు తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని ప్రకటించాలని బలవంతపెడుతున్నారన్నారు. లేదంటే మరిన్ని వ్యక్తిగత విషయాలను బయటికి వదులుతామంటూ బెదిరిస్తున్నారన్నారు. 

అందులో భాగంగా తన సెక్యూరిటీ కన్సల్టెంట్‌ డీ బెక్కర్‌కు ఎంక్వైరర్‌ వర్గాలు పంపిన అనేక మెయిల్స్‌ను  ‘ఏ సిరీస్‌ ఆఫ్‌ మెయిల్స్‌’పేరిట ప్రముఖ ఆన్‌లైన్‌ ప్రచురణ సంస్థ ‘మీడియం’ ద్వారా జెఫ్ బెజోస్ తెలిపారు. మెయిల్స్‌ పంపిన వారిలో ఎడిటర్‌ హొవర్డ్‌ సైతం ఉన్నారని తెలిపారు. వార్తా సేకరణలో భాగంగానే బెజోస్‌కు చెందిన కొన్ని ఫొటోలు దొరికాయని హొవర్డ్‌ అందులో రాసుకు వచ్చారన్నారు. 

తన లాంటి వారికే  ఇలాంటి బెదిరింపులు వస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఎంటని జెఫ్‌ ప్రశ్నించారు. తన భార్య మెకంజీతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇప్పటికే ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో ఇవే అత్యంత ఖరీదైన విడాకులంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.

జెప్ బెజోస్ ఆరోపణలపై స్పందించిన నేషనల్ ఎంక్వైరర్ తన వైఖరిని సమర్థించుకున్నది. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జెఫ్ బెజోస్ చేస్తున్న ఆరోపణలు న్యాయపరమైన సమస్యలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ ఎంక్వైరర్ చర్యలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా మీడియా సంస్థ (ఏఎంఐ)కి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య సన్నిహిత సంబంధాలు అందరికీ తెలిసిందే. జెఫ్ బెజోస్ కు సంబంధించిన వార్త ప్రచురణపై చట్టబద్ధంగా వ్యవహరిస్తామని ఏఎంసీ, నేషనల్ ఎంక్వైరర్ పేర్కొన్నాయి. 

గత నెలలో భార్య మెకంజీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు జెఫ్ బెజోస్ ప్రకటించిన వెంటనే లారెన్‌ శాన్‌షీతో ఆయన టెక్ట్స్ మెసేజ్‌లను నేషనల్ ఎంక్వైరర్ ప్రచురించింది. ప్రస్తుతం లారెన్‌ శాన్‌షీతో డేటింగ్‌లో ఉన్న జెఫ్ బెజోస్ తన సీక్రేట్ ఫొటోలు, మెసేజ్‌లు ఎలా బయటకు వచ్చాయో దర్యాప్తు చేయాలని సుదీర్ఘ కాల సెక్యూరిటీ కన్సల్టెంట్ గావిన్ డి బెకర్‌ను ఆదేశించారు. డీ బెకర్ కూడా ఇదంతా రాజకీయ ప్రేరేపితమేనని పేర్కొన్నారు. 

ట్రంప్‌తో సంబంధాలు ఉన్నాయని కరెన్ మెక్ డౌగల్ చేసిన ఆరోపణలనకు సంబంధించి గతేడాది 1.50 లక్షల డాలర్లు చెల్లించి ఏఎంఐతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా ప్రాసిక్యూటర్లు పరిశీలిస్తున్నారు.  ట్రంప్‌తో గల సంబంధాల ద్రుష్ట్యా 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కథనాన్ని ప్రచురించకుండా ఏఎంఐ తొక్కి పట్టింది.