Gold: సింగపూర్‌లోని 'ది రిజర్వ్' అనే రహస్య గోడౌన్ లో రూ.13,000 కోట్ల విలువైన బంగారం నిల్వ ఉందట. దీని భద్రత కోసం 500 సీసీటీవీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ గోల్డ్ అంతా ఎవరిదో తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ గోదాం!
రోజూ బంగారం ధర ఎంత పెరుగుతుందో చూసి ఆశ్చర్యపోతుంటాం కదా.. అలాంటి బంగారం ఒకే చోట కోట్ల రూపాయల విలువైనది ఉందంటే నమ్మగలమా? అవును.. దాదాపు 13 వేల కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కోటీశ్వరులు ఒకే చోట భద్రంగా దాచుకున్నారు.
చిన్న దేశమే అయినా సింగపూర్ అంతర్జాతీయ పర్యాటకులకు కేంద్రంగా మారింది. చాలా మంది దక్షిణ భారతీయులు.. ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. మనతో సన్నిహిత సంబంధం ఉన్న సింగపూర్‌లో ప్రపంచంలోని ధనవంతులు బంగారాన్ని దాచుకున్నారు.
కనువిందు చేసే "ది రిజర్వ్" భవనం
పెద్ద స్టార్ హోటల్ లా కనిపించే ఆ భవనం అందరినీ ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ధనవంతులు కొన్న బంగారం అక్కడే భద్రంగా ఉందని చాలా మందికి తెలియదు. సింగపూర్‌లోని ఆరు అంతస్తుల ఈ రహస్య భవనంలోనే రూ.13,000 కోట్ల విలువైన బంగారం, వెండి వంటి విలువైన లోహాలు భద్రంగా ఉన్నాయి. దీన్ని "ది రిజర్వ్" అంటారు.
జర్మనీ నుండి సింగపూర్‌కు
సాధారణంగా గోడౌన్స్ అంటే బయటకు కనిపించకుండా వస్తువులు దాచుకొనే ప్రదేశం. కానీ, సింగపూర్‌లోని కొత్త బంగారం, విలువైన లోహాల నిల్వ కేంద్రంగా ఉన్న "ది రిజర్వ్" తన బహిరంగంగానే చూపిస్తుంది. జర్మనీలో పుట్టి, ప్రస్తుతం సింగపూర్‌లో నివసిస్తున్న గ్రెగోర్ గ్రెగెర్సన్ ది రిజర్వ్ స్థాపించారు. ఆయన ఎప్పుడూ 12.5 కిలోల బంగారు ఆభరణాలు ధరిస్తారు. వాటి విలువ దాదాపు 1.2 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో అది మూడున్నర కోట్ల రూపాయలు అన్నమాట.
టన్నుల కొద్దీ బంగారం నిల్వ
సింగపూర్ తూర్పు ప్రాంతంలో 17,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ది రిజర్వ్ ఉంది. ఇది 2024లో నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 500 టన్నుల బంగారం, 10,000 టన్నుల వెండి నిల్వ చేయవచ్చు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ నిల్వ సౌకర్యాలను అందించే గోడౌన్స్ లో ఒకటి. సాధారణంగా గోడౌన్స్ లో వస్తువులను భద్రంగా నిల్వ చేస్తారు. కానీ ది రిజర్వ్ భవనంలో బంగారం, వెండిని నిల్వ చేయడమే కాకుండా నిర్వాహకులు వాటిని కొనడం, అమ్మడం కూడా చేస్తారు.
500 సీసీ టీవీలతో నిఘా
సింగపూర్ ఇప్పటికే చాలా భద్రమైన దేశం. అయినా కూడా ది రిజర్వ్ మరింత కఠిన భద్రతా నియమాలను పాటిస్తుంది. గోడలు ఎత్తైనవి, బలమైనవి. ‘మ్యాన్‌ట్రాప్’ అనే రెండు తలుపుల భద్రతా వ్యవస్థ ఉంది. ఒక తలుపు మూసుకున్న తర్వాతే రెండోది తెరుచుకుంటుంది. మోషన్ సెన్సార్, లేజర్, రేంజ్ సెన్సార్, వైర్ సెన్సార్లు, 500 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అవసరమైతే పోలీసులకు కూడా సమాచారం అందుతుంది. ఇవన్నీ చూస్తుంటే ది రిజర్వ్ ప్రపంచవ్యాప్తంగా విలువైన వస్తువుల భద్రపరచడంలో కొత్త ఒరవడిని సృష్టించింది అనడంలో సందేహం లేదు.
