ముంబై: ఇండియన్ సివిల్ ఏవియేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. అందుకు తగ్గట్లు మానవ వనరులు మాత్రం సమకూరట్లేదు. ప్రస్తుతం ఇండిగో సంస్థ విమానాల రద్దుకు కూడా ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది.

వచ్చే 12 నెలల్లో భారత విమానయాన రంగంలోకి మరో 100 కొత్త విమానాలు చేరనున్నాయి. ప్రస్తుతం ప్రతినెలా కొత్తగా తొమ్మిది విమానాలు చొప్పున వచ్చి చేరుతున్నాయి. ముఖ్యంగా ఇండిగో సంస్థలోనే ఇవి ఎక్కువగా ఉన్నాయి.

ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 1,500 నుంచి 2,000 మంది పైలట్ల అవసరం పడింది. ఈ కొరతతోనే ప్రస్తుతం ఇండిగో భారీగా సర్వీసులను రద్దు చేస్తోంది.

భారతీయ విమానయాన పరిశ్రమలో రెండేళ్లుగా పైలట్ల సంఖ్య పడిపోతూ వస్తోంది. 2016-17తో పోలిస్తే 2017-18లో దాదాపు 10 శాతం పైలట్లు తగ్గిపోయిన విషయం విమానయాన సంస్థలకూ తెలుసు.

కానీ దేశీయంగా పైలట్ల సంఖ్యను పెంచేందుకు సివిల్ ఏవియేషన్ సంస్థలు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోలేకపోయాయి. ప్రస్తుతం దేశీయ పైలట్ల సంఖ్య 7,963 మాత్రమే. 

వచ్చే పదేళ్లలో సివిల్ ఏవియేషన్‌కు దాదాపు 17 వేల మంది పైలట్లు అదనంగా అవసరం. వీరిలో దాదాపు 9000 మంది ఫస్ట్‌ ఆఫీసర్‌ హోదా వారు కావాలి. ఇదే సమయంలో జీతాలు కూడా ఏటా 5-7శాతం పెరిగే అవకాశం ఉంది.

కేవలం భారత్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చైనా, పశ్చిమాసియా దేశాల విమానయాన సంస్థలు  ఎమిరేట్స్‌, ఖతార్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రతిభావంతులైన పైలట్ల కోసం జల్లెడ పడుతున్నాయి. ఒక్క చైనాలోనే ఏటా 5,000 మంది పైలట్లు అవసరం. 

భారత్‌లో పైలట్‌ లైసెన్సుల జారీ క్రమంగా తగ్గిపోతోంది. మరోపక్క దీనికి వ్యతిరేకంగా డిమాండ్‌ పెరుగుతోంది. భారత్‌లో పైలట్‌ శిక్షణ కేంద్రాల కొరత కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమవుతోంది.

ఇండిగో వద్ద ప్రస్తుతం దాదాపు 3,100 మంది పైలట్లు విధుల్లో ఉన్నారు. దేశీయ విమానాల్లోని ఉన్న పైలట్లలో ఇది 38 శాతానికి సమానం. 

ఇదే సమయంలో భారత దేశ మార్కెట్‌లో ఇండిగో కంపెనీ వాటా 41 శాతం. ప్రతి విమానానికి ఐదు లేదా ఆరుగురు కమాండర్లు,, అదే సంఖ్యలో కో-పైలట్లు కావాలి. మొత్తమ్మీద ఒక విమానానికి దాదాపు 12 మంది సిబ్బంది అవసరం ఉంటుంది. ఒక పైలెట్‌ కమాండర్‌ స్థాయికి రావాలంటే దాదాపు నాలుగేళ్ల సమయం పడుతుంది.

ఇదిలా ఉంటే దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోను పైలట్‌ కొరత కష్టాలు వీడడం లేదు. కొన్నిరోజులుగా రోజూ విమాన సర్వీసులను రద్దు చేస్తూ వస్తున్నసంస్థ తాజాగా మరో షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. 

బుధవారం 42 సర్వీసులను రద్దు చేసిన ఇండిగో రోజుకు కనీసం 30 విమాన సేవలు  రద్దు కానున్నాయని ఇండిగో కస్టమర్ల నెత్తిన బాంబు వేసింది. చివరి నిమిషంలో ఇండిగో విమానాలు రద్దు కావడంతోపాటు,  లాస్ట్‌ మినిట్‌ విమాన టికెట్ల బుకింగ్‌ చార్జీలతో ప్రయాణికులకు భారం తడిసి మోపెడవుతోంది. 

మరోవైపు ఈ అసౌకర్యాన్ని నివారించడానికి, ముందే సంబంధిత సర్దుబాట్లు చేస్తున్నామని, ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నామని ఇండిగో చెబుతోంది. సోమవారం 32 విమాన, మంగళవారం మరో 30 విమానాలను రద్దు చేసింది. విమానాల సర్వీసుల కోత కొన్ని రోజులపాటు కొనసాగనుందని తాజాగా ప్రకటించింది. దీనిపై దృష్టి సారించినట్లు డీజీసీఏ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.