India GDP : అగ్రరాజ్యాలు అల్లాడుతుంటే, దూసుకెళ్తోన్న భారత్ .. తొలిసారి 4 ట్రిలియన్ డాలర్లు దాటిన జీడీపీ
అత్యంత వేగంగా భారత్ జీడీపీ పరంగా 4 ట్రిలియన్ డాలర్లను మార్క్‌ను దాటిందంటూ కథనాలు వస్తున్నాయి. భారత్ తొలిసారిగా ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడంతో ఆర్ధికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా భారత్ మాత్రం రాకెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు ఇస్తున్న రేటింగ్స్‌లో ముందు వరుసలో నిలుస్తోంది. ఇక ఇటీవలే బ్రిటన్‌ను వెనక్కినెట్టి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా నిలిచిన ఇండియా అతి త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా అవతరించనుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి తోడు 2024 చివరి నాటికల్లా 4 ట్రిలియన్ డాలర్ల జీడీపీని సాధిస్తుందని పలు ఏజెన్సీలు జోస్యం చెబుతున్నాయి.
అయితే ఆయా సంస్థల జోస్యాన్ని నిజం చేస్తూ.. అత్యంత వేగంగా భారత్ జీడీపీ పరంగా 4 ట్రిలియన్ డాలర్లను మార్క్‌ను దాటిందంటూ కథనాలు వస్తున్నాయి. భారత్ తొలిసారిగా ఈ చారిత్రాత్మక మైలురాయిని చేరుకోవడంతో ఆర్ధికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది భారత బలమైన ఆర్ధిక పథం, ప్రపంచ ఆర్ధిక రంగంలో బలీయమైన శక్తిగా మారుతున్న విధానానికి అద్దం పడుతోంది. వివిధ రంగాలలో దేశ స్థిరమైన ప్రయత్నాలు, వ్యూహాత్మక విధానాలు, వ్యవస్థాపక శక్తితో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా భారతదేశ స్థానాన్ని తాజా ఘటన నొక్కి చెప్పినట్లయ్యింది.
ఎస్ అండ్ పీ గ్లోబల్ తన తాజా నివేదికలో భారతదేశానికి మధ్యస్థకాలంలో గణనీయమైన వృద్ధిని అంచనా వేసింది. ఎఫ్‌వై 24, ఎఫ్‌వై 26 మధ్య వార్షిక జీడీపీ విస్తరణ 6 నుంచి 7.1 శాతం వరకు వుంటుందని పేర్కొంది. 2024-26లో 6 నుంచి 7.1 శాతం మధ్య స్థిరమైన వార్షిక జీడీపీని అంచనా వేస్తూ.. భారత ఆర్ధిక వృద్ధిలో స్థిరమైన వేగాన్ని ఈ నివేదిక నొక్కిచెప్పింది.
అంతేకాకుండా.. ఎస్ అండ్ పీ గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో నాన్ పెర్ఫార్మింగ్ లోన్‌లలో తగ్గింపును అంచనా వేసింది. ఎఫ్‌వై 25 ముగింపు నాటికి స్థూల అడ్వాన్స్‌లలో 3 నుంచి 3.5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ ఆశావాద మార్పు ఆరోగ్యకరమైన కార్పోరేట్ బ్యాలెన్స్ షీట్‌లు, కఠినమైన పూచీకత్తు ప్రమాణాలు, మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్ పద్ధతులకు నిర్మాణాత్మక మెరుగుదలలను ఆపాదిస్తుంది.