Asianet News TeluguAsianet News Telugu

కుర్రాళ్లకు ఐటీ, టెలికంపైనే గురి.. వ్యవసాయ ‘నో’ ఇంటరెస్ట్!

భారత ప్రగతికి యువతే ప్రధానం. పొరుగుదేశం చైనా ఉత్పాదక రంగంతో పురోగమిస్తూ ఉంటే, భారత్ మాత్రం సేవా రంగంతోనే ముందుకు వెళతానంటుంది. ఈ క్రమంలో సేవారంగానికి ప్రాధాన్యం ఇస్తూనే వ్యవసాయం, ఉత్పాదక రంగాలు ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Indian youth interested on IT and Telecom
Author
New Delhi, First Published Jul 28, 2019, 11:53 AM IST

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనది. చైనా ఇంతకుముందు ఈ కోవలో ఉండేది. చైనా పురోగతిలో తయారీ రంగానిది కీలక పాత్ర అయితే.. మనదేశంలో ప్రధాన భూమిక సేవా రంగానిదే. 

మనదేశానికి మరో అదనపు బలం యువతరం. మరి ఈ యువతలో ఎక్కువ మంది సేవా రంగం వైపు అడుగులు వేస్తే భారత వృద్ధి పరుగుకు బ్రేకులనేవి ఉంటాయా? కేవలం ఒక్క సేవా రంగ వృద్ధిపై ఆధారపడటంతోనే భారత్‌ ప్రపంచాన్ని జయించగలదా..?

ప్రపంచంలో అధిక జనాభా ఉన్న దేశాలేవీ అంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేర్లు చైనా, భారత్‌ అని. అత్యధిక జనాభాను కలిగి ఉండటం ఈ రెండు దేశాలకు ఓ ప్రధాన సమస్యైనా.. వీటి వృద్ధికి సానుకూల అంశం కూడా ఇదే. కార్మిక వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండటమే దీనికి కారణం.

‌భారత్‌లో తయారీ రంగం చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి చెందలేదనే చెప్పాలి. దీనికి విధానాల్లో అవరోధాలు, సరఫరా సమస్యలు ప్రధాన కారణం. అందుకే ఇప్పటికీ వ్యవసాయ రంగమే చాలా మందికి జీవనాధారం. అయితే ప్రపంచీకరణ దరిమిలా టెక్నాలజీ, కమ్యూనికేషన్ సెక్టార్లు ప్రాచుర్యంలోకి రావడంతో భారత్‌లో పరిస్థితులు మారాయి.

దేశ ఆర్థిక వ్యవస్థలో సేవా రంగ ప్రాధాన్యం పెరిగింది. క్రమంగా వ్యవసాయ, తయారీ రంగాలను వెనక్కినెట్టి ఈ రంగం అగ్ర తాంబూలాన్ని చేజిక్కించుకుంది. పైగా సేవా రంగంలోనే అత్యధిక ఉద్యోగాల సృష్టి జరుగుతుండటం, వేతనాలూ అధికంగా ఉండటంతో వ్యవసాయ, తయారీ ఉద్యోగాలపై యువత ఆసక్తి పెద్దగా చూపడంలేదు. 

ప్రస్తుతం ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న ఉద్యోగాల్లో ఐటీ సేవలు ముందు వరుసలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బ్యాంకింగ్‌ సేవలు, ఆరోగ్య సంరక్షణ, టెలికాం, కమ్యూనికేషన్ల ఉద్యోగాలకు ప్రాధాన్యమిచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 

ప్రపంచంలోనే దిగ్గజ ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరించాలంటే.. సేవా రంగంలో ప్రస్తుత ప్రగతి ఏమాత్రం సరిపోదని కొందరి విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ప్రపంచ విపణుల్లో గట్టిగా పోటీపడేలా దేశీయ సేవా రంగ సామర్థ్యాన్ని పెంపొందించకుంటే జనాభాపరంగా అత్యధిక యువతను భారత్‌ కలిగి ఉన్నా నిరూపయోగమే అవుతుంది. యువ శక్తిని సరిగ్గా వాడుకుంటేనే భారత్‌ ప్రపంచ శక్తిగా అవతరిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. 

భారత్‌లో ప్రస్తుతం 30 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నట్లు అంచనా. మధ్యతరగతి ప్రజల ఆదాయ స్థాయి పెరిగింది. ఇవ్వన్నీ కూడా స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు మార్గం చూపాయి. ఆన్‌లైన్‌లో ఆర్థిక సేవల దగ్గర నుంచి రిటైల్‌ వరకు పలు రకాల సేవలను అందించే సంస్థలు ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చాయి. 

వినియోగదార్ల నుంచి కూడా వీటికి బాగానే ఆదరణ లభించింది. దీంతో ఆయా సేవా రంగాల్లో ఉద్యోగాల సృష్టి పెరిగింది. సేవా రంగం ద్వారా పరోక్షంగా ప్రయోజనం పొందే విభాగాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ యువత జీవనోపాధి పొందేందుకు ఈ రంగం విశేషరీతిలో దోహద పడుతోంది. 

దాంతో వ్యవసాయ రంగ ఉద్యోగాలకు ప్రాధాన్యమిచ్చే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే సేవా రంగాన్ని ప్రోత్సహించేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తూనే.. తయారీ, వ్యవసాయ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

భారత్‌లో పనిచేసే వయసున్న వ్యక్తుల సంఖ్య కంటే, ఒకరిపై ఆధారపడి జీవించే పిల్లలు, వృద్ధుల సంఖ్య తక్కువగా ఉంది. 2005-2006 నుంచి ఈ ధోరణి కొనసాగుతోంది. 2055-56 వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అంచనా. అంటే రాబోయే ఐదు దశాబ్దాల్లో భారత్‌ను యువశక్తి నడిపించనుందన్న మాట. 

వాస్తవంగా జనాభా పరంగా ఇలాంటి అనుకూలతలు ప్రపంచంలో మరే దేశానికి లేవు. దేశ జనాభాల్లో 14 ఏళ్ల లోపు వయస్కులు 30 శాతం మంది అయితే 60 ఏళ్లు దాటిన వారు ఎనిమిది శాతమే. పనిచేసే వయసున్న వాళ్ల సంఖ్య 62.5%గా ఉంది. ఇక 2036 కల్లా మొత్తం జనాభాల్లో  పనిచేసే వయసున్న వారి సంఖ్య 65%గా ఉంటుందని అంచనా. 
 

Follow Us:
Download App:
  • android
  • ios