బ్యాంకు లాకర్లను వాడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఒక కీ కస్టమర్ దగ్గర ఉంటే మరొక తాళంచెవి బ్యాంకు వద్ద ఉంచుతారు. అయితే బ్యాంకు లాకర్లోని బంగారం పోతే ఏం చేస్తారు? 

బెంగళూరుకు చెందిన ఒక మహిళ ఒక ప్రముఖ బ్యాంకులో లాకర్ సర్వీసును తీసుకుంది. అందులో 145 గ్రాముల బంగారము, అలాగే వజ్రాల ఆభరణాలను ఉంచింది. ఓసారి బ్యాంకు లాకర్ను ఓపెన్ చేస్తే ఈ 145 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఆమె సరిగా వెతక్కుండా బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసింది. తిరిగి లాకర్న్ తెరిచి అన్ని వస్తువులను బయట పెడితే అడుగున ఈ ఆభరణాలు కనిపించాయి. అయితే నిజంగానే ఆమె బంగారు ఆభరణాలు పోయి ఉంటే బ్యాంకు దానికి తగిన పరిహారాన్ని చెల్లించేదా? బ్యాంకు లాకరులో ఎంత భద్రత ఉంటుంది? ఒకవేళ అనుకోకుండా ఆ బంగారు ఆభరణాలు బ్యాంక్ లోనే దొంగతనానికి గురైతే ఆ బ్యాంకు ఎంతవరకు బాధ్యత వహిస్తుంది?

బ్యాంకు లాకర్ చట్టాలు, నియమాలు ఇవిగో

బ్యాంకు లాకర్ సౌకర్యాలకు సంబంధించి కొన్ని చట్టాలు, నియమాలు ఉన్నాయి. వీటిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బ్యాంకు లాకర్లు... భారతీయ రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు, అలాగే బ్యాంకుల నియమాల ప్రకారమే పనిచేస్తాయి. 2021 లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిబంధనను జారీ చేసింది. బ్యాంకులో కస్టమర్ల లాకర్లలో నిల్వ చేసిన వస్తువుల రికార్డులను ఉంచకూడదని, లోపల ఏం ఉంచారో అడిగే హక్కు కూడా బ్యాంకులకు ఉండదని ఆర్బీఐ చెప్పింది. అయితే ట్యాంపరింగ్, దొంగతనం జరిగిన సందర్భాల్లో మాత్రం బ్యాంక్ బాధ్యత వహించాలని ఆర్బిఐ నిర్ణయించింది. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల లేదా బ్యాంక్ అధికారుల తప్పుల వల్ల ఏదైనా నష్టం జరిగితే కస్టమర్ కు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకుకే ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది.

ఎంత పరిహారం వస్తుంది?

బ్యాంకు నిర్లక్ష్యం కారణంగా లాకర్లో ఉన్న వస్తువులు పోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం బ్యాంకు వార్షిక లాకర్ అద్దెకు వంద రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఏడాదికి లాకర్ కోసం 3000 రూపాయలు కడుతుంటే బ్యాంకు మూడు లక్షల రూపాయల వరకు మీకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది బ్యాంకు లాకర్లో పెట్టిన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఏమాత్రం తులతూగదు.

బంగారం పోతే ఏం చేయాలి?

లాకరు నుండి దొంగతనం జరిగిన తరువాత బ్యాంకు తప్పు నిరూపణ కాకపోయినా బ్యాంకు ఎలాంటి బాధ్యత వహించదు. బ్యాంకులో నుంచి భారీగా బంగారు వజ్రాభరణాలు దోపిడీకి, దొంగతనానికి గురైతే వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అలాగే బ్యాంకుకు లిఖితపూర్వక ఫిర్యాదును కూడా మీరు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు సరిగా స్పందించకపోతే మీ ఫిర్యాదును ఆర్బిఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ వరకు తీసుకెళ్లవచ్చు.

లాకర్ తాళాలు రెండు ఉంటాయి. అందులో ఒకటి కస్టమర్ దగ్గర ఉంటే, మరొక తాళం చెవి బ్యాంకు దగ్గర ఉంటుంది. అంటే మీరు లాకర్ తెరవాలంటే మీ దగ్గర ఉన్న తాళంచెవి, బ్యాంకు దగ్గర ఉన్న కీ రెండూ అవసరం పడతాయి.

ప్రకృతి వైపరీత్యాలు కారణంగా బ్యాంకు దెబ్బతింటే అంటే వరదలు లేదా అగ్ని ప్రమాదాలు జరిగితే మాత్రం దానికి ఎలాంటి బాధ్యత వహించదు. కస్టమర్ కీను పోగొట్టుకున్నా కూడా బ్యాంకుకు ఎలాంటి సంబంధం ఉండదు. బ్యాంకు లాకర్లోని వస్తువుకు ఎలాంటి ఇన్సూరెన్స్ బ్యాంకులు ఇవ్వవు. వ్యక్తిగత ఇన్సూరెన్స్లను తీసుకోవాల్సి వస్తుంది.