రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) విధానం ద్వారా ఏటీఎంల్లో నగదు తీసుకునే ఏర్పాటు చేయనున్నారు.
ఇండియా ఎకానమీ మరింత వేగంగా డిజిటలైజ్ అవుతోంది. ఇప్పటికే యూపీఐ లావాదేవీలు (UPI Transactions) రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. విదేశాలకూ ఈ సేవలు విస్తరిస్తున్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలలో కార్డు లెస్ విత్‌డ్రావల్ (Cardless withdrwal facility in atms) సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. అంటే ఇకపై డెబిట్ (Debit card), క్రెడిట్ కార్డులు (Credit card) లేకుండానే నేరుగా ఏటీఎం యంత్రాల (ATMs) నుంచి డబ్బు తీసుకోవచ్చు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (RBI MPC) సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shastikanta das) ఈ ప్రతిపాదన చేశారు.
ప్రస్తుతం కొన్ని ఏటీఎంలలో మాత్రమే కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకొనే సౌకర్యం ఉంది. ఇప్పుడు దీనిని అన్ని ఏటీఎంలకు విస్తరించాలని ఆర్‌బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. సూపర్ హిట్టైన యూపీఐ ఐడీ ఉపయోగించుకొనే ఈ సేవలు వినియోగించుకోవచ్చు. కరోనా సమయంలో ముట్టుకోకుండానే డబ్బు విత్‌డ్రా చేసుకొనే సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఏటీఎంలలో యూపీఐ సౌకర్యం వల్ల డెబిట్, క్రెడిట్ కార్డు క్లోనింగ్‌ను అడ్డుకోవచ్చు. కార్డు స్కాములు జరగకుండా చూడొచ్చు. త్వరలోనే కార్డు రహిత నగదు ఉపసంహరణ సేవలు అందించేందుకు ఎన్‌పీసీఐ, ఏటీఎం నెట్‌వర్క్, బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు ఇవ్వనుంది.
ప్రస్తుతం కార్డు రహిత లావాదేవీలు ఎలా జరుగుతున్నాయంటే..?
- ప్రస్తుతం మొబైల్ ఫోన్ నంబర్‌ను ఉపయోగించుకొని ఇండియాలో ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు డబ్బును కార్డు లేకుండానే పంపుకోవచ్చు.
- డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండా యూజర్ నగదును ఏటీఎం నుంచి తీసుకోవచ్చు.
- నగదు బదిలీ చేయాలంటే మాత్రం పేయీ మొబైల్ నంబర్ అవసరం.
- మొబైల్ నంబర్‌తో పాటు నాలుగు, ఆరు అంకెల వెరిఫికేషన్ కోడ్స్ ఎంటర్ చేయాలి.
- రోజుకు రూ.100 నుంచి రూ.10,000 వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒక నెల మొత్తానికి రూ.25,000 మాత్రమే విత్‌డ్రా చేసుకొనే అవకాశం ఇస్తున్నారు.
శక్తికాంత దాస్ ఏం చెప్పారంటే?
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయం తీసుకుంది. రెపో రేటును (Repo rate) 4 శాతం, రివర్స్ రెపోరేటును (Reverse repo rate) 3.35 శాతం ఉంచింది. కీలక రేట్లలో మార్పులు చేయకూడదని ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయించిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta das) మీడియాకు తెలిపారు.
2022-23కు ద్రవ్యోల్బణం రేను 5.7 శాతంగా ఎంపీసీ అంచనా వేసింది. అంతకు ముందున్న అంచనా రేటు 4.5 శాతాన్ని సవరించింది. గతంలో 7.8 శాతంగా అంచనా వేసిన భారత జీడీపీ (GDP) వృద్ధిరేటును 2023గాను 7.2 శాతానికి తగ్గించింది. 2022, ఏప్రిల్ 1 నాటికి ఫారెక్స్ నిల్వలు 606.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని శక్తికాంత దాస్ తెలిపారు. 2021-22లో ఇండియా ఎగుమతులు వేగంగా పెరిగాయని పేర్కొన్నారు. 400 బిలియన్ డాలర్లుగా పెట్టుకున్న లక్ష్యాన్ని అధిగమించాయని వెల్లడించారు.
