పెట్రోల్ పంపులు లాభదాయకమైన వ్యాపారాలలో ఒకటిగా పేరు తెచ్చుకున్నాయి. ఎంతోమంది పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయాలని అనుకుంటారు.. కానీ వారికి దానికి ఎంత ఖర్చవుతుందో? ఎలాంటి అర్హతలు కావాలో తెలియదు. ఆ సమాచారాన్ని ఇక్కడ మేము అందించాము.
మనదేశంలో పెట్రోల్ పంపు ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు అధికంగానే ఉంటుంది. ముఖ్యంగా మీరు పెట్టే ప్రాంతాన్ని బట్టి ఆ ఖర్చు ఆధారపడి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో పెడితే ఒకలా, అదే మెట్రో నగరాల్లో పెడితే మరొకలా, గ్రామీణ ప్రాంతాలకు దగ్గరలో పెడితే మరింత తక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆదిత్యా బిర్లా క్యాపిటల్ చెబుతున్న ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పెట్టే పెట్రోల్ పంపులకు 50 లక్షల రూపాయలు నుండి కోటి రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అదే మరింత రద్దీ ప్రాంతాలలో పెడితే రెండు కోట్ల రూపాయల వరకు ఆ ఖర్చు పెరిగే అవకాశం ఉంది.
పెట్రోల్ పంపులో పెద్ద ఖర్చు
పెట్రోల్ పంపుకు ముఖ్యమైనది భూమి కొనుగోలు లేదా లీజుకే అతి పెద్ద ఖర్చు అవుతుంది. ఇక అందులో సేల్స్ ఆఫీసు, స్టోర్ రూమ్, టాయిలెట్లు, భూగర్భ ఇంధన నిల్వ ట్యాంకులు వంటివి నిర్మించాలి. వీటన్నింటికీ అయ్యే ఖర్చు అధికంగానే ఉంటుంది. ఇక పరికరాలు కూడా అవసరం. పెట్రోల్, డీజిల్ పంపులు, ఆటోమేషన్ సిస్టంలు, ఎయిర్ ఫిల్లింగ్ మెషిన్లు, జనరేటర్లు వంటివి కూడా అవసరం పడతాయి. కొన్నిసార్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలో కొన్ని పరికరాలను అందించే అవకాశం ఉంది.
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ భూమి అవసరం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఖర్చు అధికంగా ఉండవచ్చు. హైవేపై పెట్రోల్ పంపులుకు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇంధనం కొనుగోలు చేయడం, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం వంటివి ప్రతినెలా భరించాలి. కాబట్టి పెట్రోల్ పంపులు పెట్టడానికి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువ మొత్తంలో అవసరం పడుతుంది.
ఈ లైసెన్సులు అవసరం
ఇక స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుండి అగ్నిమాపక భద్రత విభాగం నుండి అనేక రకాల లైసెన్సులు కూడా అవసర పడతాయి. పెట్రోల్ పంపుకు కావలసిన అనుమతులన్నీ తీసుకోవాల్సి వస్తుంది. ఇక కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రత్యేక రుణాలను కూడా అందిస్తాయి. పెట్రోల్ పంపు వ్యాపారం కోసం ప్రత్యేకంగా రుణాలు అందించే సంస్థలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా డీలర్లకు ఆర్థిక సహాయాన్ని పథకాలను అందిస్తాయి. మీరు ఎంపిక చేసుకున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీని బట్టి అవి ఆధారపడి ఉంటాయి. పెట్రోల్ పంపు యజమానులు తమ విక్రయించే ప్రతి లీటరు ఇంధనంపై కూడా కమిషన్ పొందుతారు. అయితే అది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మార్జిన్ లను బట్టి ఉంటాయి.
అర్హతలు ఇవే
పెట్రోల్ పంపు పెట్టేందుకు మీరు భారతీయ పౌరుడు అయి ఉండాలి. అలాగే గత ఆర్థిక సంవత్సరంలో 182 రోజులు భారతదేశంలోని నివసించి ఉండాలి. అలాగే వయస్సు 21 సంవత్సరాలకు కన్నా ఎక్కువ, 55 సంవత్సరాలు కన్నా తక్కువ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పంపు పెట్టాలనుకుంటే ఇంటర్ పాసైన అర్హత ఉంటే సరిపోతుంది. ఇక ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైతే పదో తరగతి పూర్తి చెయ్యాలి. అదే ఓపెన్ కేటగిరికి వస్తే డిగ్రీ ఉండాలి.
ఎంత భూమి కావాలి?
పెట్రోల్ పంపు పెట్టేందుకు పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది వందల చదరపు మీటర్ల నుండి 1200 చదరపు మీటర్ల భూమి అవసరం పడుతుంది. అదే గ్రామీణ ప్రాంతాలకు దగ్గరలో లేదా హైవే ప్రాంతాల్లో అయితే 18 చదరపు మీటర్ల నుండి 2000 చదరపు మీటర్ల భూమి అత్యవసరం.
పెట్రోల్ బంక్ ఫ్రాంచైజీని ప్రారంభించడానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి. దీనికి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక భూమి లీజు లేదా భూమి కొనుగోలు వంటివి చేస్తే 50 లక్షల రూపాయలు నుంచి కోటి రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ పంపు డీలర్ షిప్ ఖర్చు కూడా 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. ఇతర ఖర్చులు కూడా ఐదు లక్షల రూపాయలకు పైన ఉండే అవకాశం ఉంది. కాబట్టి పెట్రోల్ పంపులు మంచి ప్రదేశంలో పెట్టాలనుకుంటే రెండున్నర కోట్ల నుంచి మూడున్నర కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది.
ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి
మీరు బిపిసిఎల్, హెచ్‌పీసీఎల్ ఇలా చమురు కంపెనీలకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఎంపిక చేసుకోండి. వాటి వెబ్సైట్లో దరఖాస్తు ఫారంను పూరించాలి. మీ వ్యక్తికి సమాచారంతోపాటు ఆర్థిక నేపథ్యము, పెట్రోల్ పంపు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో భూమి గురించి కూడా వివరాలు అందించాలి. ఈ దరఖాస్తు రుసుము 15000 రూపాయల నుంచి 20వేల వరకు ఉంటుంది. అది చెల్లించాలి. ఆ తర్వాత కంపెనీలు మీ అర్హతను ధ్రువీకరించేందుకు స్క్రీనింగ్ నిర్వహిస్తుంది. ఇందులో మీ వయసు, విద్యార్హతలు, ఆర్థిక సామర్థ్యం, భూమి వివరాలు వంటివి తనిఖీ చేస్తుంది. ఆ తర్వాత మీ పేరును షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈమెయిల్ ద్వారా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. అప్పుడు ఇంటర్వ్యూకి మీరు సిద్ధమవ్వాలి.
వ్యక్తిగత ఇంటర్వ్యూలో పెట్రోల్ పంపు వ్యాపార ప్రణాళిక, మీ ఆర్థిక స్థిరత్వం, పెట్రోల్ పంపు వ్యాపారం పై మీకు ఎంత అవగాహన ఉందో అంచనా వేస్తారు. అలాగే ఇంటర్వ్యూలు కూడా మీరు విజయం సాధిస్తే మీ భూమిని చూసేందుకు వస్తారు. అక్కడ తనిఖీలు చేశాక మీతో డీలర్ షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. సెక్యూరిటీ డిపాజిట్ గా మీరు ఐదు లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి రావచ్చు.
