రేమండ్స్ ఫైర్: తండ్రీకొడుకుల ఆధిపత్య పోరు.. పెత్తనమే అసలు సమస్య?

First Published 3, Jan 2019, 12:20 PM IST
How Family Feud Marred Raymond Group as Father-Son Battle Over Billion-dollar Textile Empire
Highlights

భారతీయ టెక్స్ టైల్ రంగంలో దిగ్గజంగా పేరెన్నికగన్న రేమండ్స్ గ్రూప్ ఇప్పుడు సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ పథ్ సింఘానియా, ఆయన తనయుడు సంస్థ చైర్మన్ గౌతం సింఘానియా మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది.

ఒకనాడు చిన్న సంస్థగా మొదలై.. ఈనాడు భారతీయ టెక్స్‌టైల్ రంగంలోనే దిగ్గజ సంస్థగా పేరొందింది రేమాండ్ గ్రూప్‌.. కానీ అదే గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న సింఘానియా కుటుంబం మధ్య.. తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్‌పథ్ సింఘానియా, ఆయన కుమారుడు గౌతమ్ సింఘానియా మధ్య ఆధిపత్య పోరు రాజుకున్నది. మూడేళ్ల క్రితం గౌతమ్‌కు రేమాండ్ పగ్గాలను అప్పగించిన విజయ్‌పథ్.. ఆ తర్వాత తనను గౌతమ్ సరిగ్గా చూసుకోవడం లేదని, కుటుంబానికి చెందిన అపార్టుమెంట్ నుంచి గెంటేశాడని, కంపెనీ కార్యాలయాల నుంచీ బయటకు పంపాడని ప్రస్తుతం ఆరోపిస్తున్నారు.

80 ఏండ్ల విజయ్‌పథ్.. ఓ చిన్న వస్త్ర వ్యాపారాన్ని దేశంలోనే గొప్ప సంస్థగా మార్చిన విషయం తెలిసిందే. 2015లో తనకున్న 37 శాతం వాటాను గౌతమ్‌కు ఇచ్చేశారు. దీంతో విజయ్‌పథ్ కష్టాలు మొదలవగా, అప్పుడు చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. 

రెండేళ్లుగా కొడుకుతో మాట్లాడని విజయ్‌పథ్.. ఇటీవలి కోర్టు తీర్పుతో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మళ్లీ తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2007లో చేసిన ఓ చట్టం కింద తల్లిదండ్రుల కనీస అవసరాలనూ పిల్లలు తీర్చకపోతే వారికిచ్చిన ఆస్తులను తిరిగి తీసుకోవచ్చు. దీంతో విజయ్‌పథ్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 

తల్లిదండ్రులు తాము సంపాదించిన సొమ్మంతా పిల్లలకు ధారదత్తం చేయొద్దని విజయ్ పథ్ సింఘానియా సూచిస్తున్నారు. తండ్రీ కొడుకులు మధ్య వివాదం సాగుతున్నా.. సంస్థ పనితీరులో ఎటువంటి మార్పు లేకపోవడం ఆసక్తి కర పరిణామంగా చెప్పుకోవచ్చు.

కానీ రేమాండ్ గ్రూప్ చైర్మన్‌గా, ఓ కొడుకుగా తన బాధ్యతలు వేర్వేరుగా ఉంటాయంటున్న గౌతమ్ సింఘానియా తానే తప్పు చేయలేదని చెప్పుకొస్తున్నారు. 55కుపైగా దేశాలకు ఎగుమతులు చేస్తున్న రేమాండ్ గ్రూప్.. ఈమధ్యే ఇథియోపియాలోనూ ఓ భారీ ఫ్యాక్టరీని ప్రారంభించింది. 2018 ద్వితీయ త్రైమాసికంలో సంస్థ లాభాలు 50 శాతం పెరిగాయి.

దేశీయ కార్పొరేట్ రంగంలో చోటుచేసుకుంటున్న కుటుంబ విభేదాలపై పరిశ్రమ వర్గాలు, నిపుణులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ మధ్య కూడా గతంలో తగాదాలు ఏర్పడిన విషయం తెలిసిందే.  

తాజాగా ఔషధ రంగంలో పేరొందిన ఫోర్టిస్ బ్రదర్స్ మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ మధ్య కూడా గొడవలు జరుగుతున్న సంగతీ విదితమే. ఇక 2012లో తమ కంపెనీపై పోరులో భాగంగా లిక్కర్, ప్రాపర్టీ వ్యాపారులు పోంటీ చద్దా, హర్దీప్ చద్దా ఒకరినొకరు కాల్చుకుని చనిపోయారు.

తాజాగా రేమాండ్ గ్రూప్ వ్యవహారం ప్రాధాన్యం  సంతరించుకుంది. కుటుంబ వ్యాపారాల పంపకాలు, వాటి నిర్వహణ అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

సాంస్క్రుతికంగా కూడా యువతరంలో సహనం, ఓపిక ఉండటం లేదని మానసిక, ఆర్థిక, సామాజిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య రంగంలో అంతర్జాతీయంగా అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులు మనదేశంలో ఇంకా పూర్తిగా అమలులోకి రావడం లేదని పేర్కొంటున్నారు.

ప్రత్యేకించి మేనేజ్మెంట్ నుంచి యాజమానాన్ని విడదీసే విషయంలోనే సమస్యలు ఉన్నాయని తెలిపారు. మేనేజ్మెంట్ విధానాల్లో నూతన పద్ధతులు అవలంభించంతోనే సమస్యలు, విభేదాలు మొదలయ్యయాని గౌతం సింఘానియా పేర్కొంటున్నారు.

సంస్థ ప్రగతి దిశగా తాను పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రేమండ్స్ చైర్మన్ గౌతం సింఘానియా తెలిపారు. తన తండ్రి వాటాను పొందినప్పటి నుంచే సమస్య మొదలైందని అంగీకరించారు. 
 

loader