GST Login: జూలై నెలలో జీఎస్టీ కలెక్షన్స్ అదుర్స్...6వ సారి రూ.1.60 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ కలెక్షన్..
జూలైలో GST వసూళ్లు రూ. 1.65 లక్షల కోట్లకు పెరిగాయి, గత ఏడాది ఇదే నెలలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే జూలై నెలలో జీఎస్టీ ఆదాయం 11 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.1,65,105 కోట్లకు చేరాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. GST పరోక్ష పన్ను విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జీఎస్టీ వసూళ్లు ఐదోసారి రూ.1.6 లక్షల కోట్లు దాటడం విశేషం.
2023 జూలైలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు రూ.1,65,105 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.29,773 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.37,623 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ.85,930 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలైన రూ. 41,239 కోట్లు) ఉన్నాయి. అదనంగా, సెస్ రూ. 11,779 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 840 కోట్లతో కలిపి ఉన్నాయి.
మంత్రిత్వ శాఖ ప్రకారం, జూలై 2023లో రెవెన్యూ వసూళ్లు గత ఏడాది ఇదే నెల కంటే 11 శాతం ఎక్కువగా ఉంది. సమీక్షిస్తున్న నెలలో దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగింది. జూన్ నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1,61,497 కోట్లుగా ఉంది.
మరింత వృద్ధి అంచనా
జీఎస్టీ వసూళ్లు ప్రతి నెలా రూ.1.5 లక్షల కోట్లు దాటుతున్నాయి . దీన్ని బట్టి చూస్తే పండుగల సీజన్‌లో జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. పండుగల సీజన్‌లో హౌసింగ్, కార్, కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హాస్పిటాలిటీ రంగాల్లో ఖర్చు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల నెలవారీ జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. GST కౌన్సిల్, ఆగస్టు 2న తన సమావేశంలో, ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన వర్చువల్ డిజిటల్ ఆస్తులతో కూడిన లావాదేవీలు, చెల్లింపులపై 28 శాతం GST విధించే వీలుంది. GST చట్టానికి ప్రతిపాదిత సవరణ ప్రకారం, వర్చువల్ డిజిటల్ ఆస్తుల రూపంలో లావాదేవీలు, విజయాలపై 28 శాతం GST విధిస్తున్నారు. ఇది కాకుండా, ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను మార్పుపై కూడా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు.