ఎండా, వానను లెక్కచేయకుండా జీవనోపాధి కోసం వీధి పక్కన క్రయవిక్రయాలు జరిపే వీధి వ్యాపారులకు త్వరలోనే మంచి రోజులు రానున్నాయి.  వీరి కోసం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ‘నేషనల్ అర్బన్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌’ పథకం కింద ‘మొబైల్ షాప్స్‌’ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆదివారం సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. 

దీని కింద వీధిలో వ్యాపారం చేసుకునేందుకు యజమానికి లైసెన్స్‌ను కూడా ఇవ్వనున్నట్లు గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా చెప్పారు. ‘వీధి వ్యాపారులపై ఇటీవల జరిగిన జాతీయ వర్క్ షాపులో చాలా సలహాలు, సూచనలు వచ్చాయి.

అందులో వీధి వ్యాపారుల కోసం ‘మొబైల్ షాప్స్‌’ అనే సూచన కూడా వచ్చింది. దీని అమలుకు కావాల్సిన నిధుల గురించి చర్చించి ఓ పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం పని చేస్తోంది’ అని ఆయన అన్నారు. వీధి వ్యాపారుల చట్టం 2014 కింద  దేశంలోని 2,430 పట్టణాల్లో 18లక్షల మంది వీధి వ్యాపారులను గుర్తించామన్నారు.  

అంతే కాక 2,344 వీధి వ్యాపారుల కమిటీలను  ఏర్పాటు చేయటమేకాక తొమ్మిది లక్షల మందికి గుర్తింపు కార్డులిచ్చామని తెలిపారు. సమాజానికి ఎంతో విలువైన సేవలనందిస్తున్న వీధివ్యాపారులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నదని గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా అన్నారు.

వీధివ్యాపారులపై  ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ తయారుచేసిన నివేదిక ప్రకారం.. వీధి వ్యాపారుల చట్టం 2014 అమలులో 75 పాయింట్లతో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మిజోరం, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్, జార్ఖండ్‌ తరువాతి స్థానాల్లో ఉండగా, తొమ్మిది పాయింట్లతో నాగాలాండ్‌ చివరిస్థానంలో ఉన్నట్లు తేలింది.

వీధి వ్యాపారుల చట్టం అమలు పట్ల నాగాలాండ్ ప్రభుత్వం చాలా పేలవంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శ ఉంది. మణిపూర్, కర్ణాటక, సిక్కిం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు కూడా వీధి వ్యాపారుల చట్టం అమలును పట్టించుకోవడం లేదని సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ రూపొందించిన నివేదిక పేర్కొంది.

నేషనల్ అర్బన్ లైవ్లీ హుడ్స్ మిషన్ (ఎన్‌యూఎల్ఎం) కింద పట్టణాలు, నగరాల్లో ఇల్లులేని నిరుపేదలకు దశల వారీగా ఇంటి వసతి కల్పించడమే లక్ష్యం. ఎన్‌యూఎల్ఎం కింద వీధి వ్యాపారులకు అవసరమైన స్థలం కేటాయించడంతోపాటు సంస్థాగత రుణ పరపతి కల్పించి సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఉన్నది. మార్కెట్లో లభిస్తున్న అవకాశాలకు అనుగుణంగా వీధి వ్యాపారులకు నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే అంశానికి ప్రాధాన్యం ఇస్తోంది.