Asianet News TeluguAsianet News Telugu

Gold Rate: మహిళలకు కన్నీళ్లు పెట్టిస్తున్న బంగారం..తులం పసిడి రూ.62 వేలు దాటే చాన్స్...

10 గ్రాముల బంగారం ధర  రూ.60,000. దాటింది. దీంతో ఆల్ టైమ్ హై రేటును నమోదు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం బంగారం ధర రూ. 60,000. సరిహద్దు దాటింది.

Gold Rate Chance to cross Rs 62 thousand per 10 grams MKA
Author
First Published Mar 20, 2023, 6:11 PM IST

బంగారం ధర ఆకాశమే హద్దుగా పెరుగుతోంది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర  రూ.60,000. దాటడంతో ఇది ఆల్ టైమ్ హై నమోదు చేసింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో సోమవారం బంగారం ధర రూ. 60,000. సరిహద్దు దాటింది. MCX గోల్డ్ ఫ్యూచర్ ఈరోజు 1.5 శాతం లాభపడింది, 10 గ్రాముల ధర 60,274 రూపాయల వరకూ పెరగడం గమనార్హం. భారత మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర 0.57 శాతం పెరిగి 2,000 డాలర్ల మార్క్‌ను దాటి ఔన్స్‌(28 గ్రాములు)కు 2,001 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

అమెరికన్ బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం తర్వాత, బంగారం మార్కెట్ ఆల్ టైమ్ పెరుగుదలను చూసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు దివాళాతో ప్రారంభమైన ప్రపంచ బ్యాంకింగ్ సంక్షోభం నెమ్మదిగా, ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. గ్లోబల్ బ్యాంకింగ్ సంక్షోభం అమెరికాతో పాటు ప్రస్తుతం యూరప్ లోని లీడింగ్ బ్యాంకు అయిన క్రెడిట్ సూయిస్ బ్యాంకును సైతం చుట్టుముట్టింది.

దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లు నష్టాల వైపు నడుస్తున్నాయి. అలాగే బ్యాంకుల్లో డిపాజిట్లు సైతం సంక్షోభంలో పడుతున్నాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. 

మరోవైపు US బాండ్ రేట్లు బాగా తగ్గాయి, అటు డాలర్ విలువ కూడా భారీగా పడిపోయింది. అదే సమయంలో బంగారం ధర పెరిగింది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం నేపథ్యంలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ మార్చి 22న సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో తీసుకున్న విధానాలు బంగారం మార్కెట్‌పై మరింత ప్రభావం చూపనున్నాయని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి అభిప్రాయపడ్డారు.

అమెరికన్ బ్యాంకులు అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలాయి. మరోవైపు స్విట్జర్లాండ్‌కు చెందిన క్రెడిట్ సూయిస్ బ్యాంక్, అమెరికాకు చెందిన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకులు కూడా కష్టాల్లో కూరుకుపోయి మనుగడ కోసం అల్లాడిపోతున్నాయి. అటువంటి పరిస్థితిలో, పెట్టుబడిదారులకు బంగారం సురక్షితమైన ఎంపికగా మారే చాన్స్ ఉంది.  

మరింత పెరిగే అవకాశం ఉందా?
గతేడాది అక్టోబర్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1636 డాలర్లు అంటే 28 గ్రాములకు పడిపోయింది. కానీ, ప్రస్తుతం 1880 డాలర్లకు ఎగబాకింది. రానున్న రోజుల్లో 2,000 డాలర్లకు పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయి. బంగారం ధర 2,078 డాలర్లకు పెరిగే అవకాశం ఉందని మరికొన్ని నివేదికలు తెలిపాయి. ఇదిలావుంటే భారత మార్కెట్లో బంగారం ధర రూ.62,000 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios