న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో పసిడి, వెండి ధరలు మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారం బంగారం, వెండి ధరలు గరిష్ఠ స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల పుత్తడి రూ.239, కిలో వెండిపై రూ.845 వృద్ధి చెందాయి.

ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.239 పెరిగి రూ. 49,058కి చేరింది. కిలో వెండిపై గరిష్ఠ స్థాయిలో రూ.845 పెరిగి.. రూ. 49,300కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి రేటు ఔన్సుకు 1,764 అమెరికా డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర రూ. 17.81 యూఎస్​ డాలర్లుగా ఉంది.

అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించకపోవడం కూడా పుత్తడి ధరలు పెరిగి పోవడానికి కారణం. వచ్చే కొన్ని నెలల్లో అంటే దంతేరాస్.. దీపావళి నాటికి తులం బంగారం ధర రూ.52 వేలకు చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

also read కుప్పకూలిన ఐ‌ఆర్‌సిటిసి షేర్లు..ఆగస్ట్‌ 12 వరకూ రైళ్లు రద్దు... ...

ప్రస్తుత ధోరణులతో వచ్చే రెండేళ్లలో తులం బంగారం చారిత్రక స్థాయికి చేరుకుని రూ.65 వేల వద్ద స్థిర పడుతుందని అంచనా వేస్తున్నారు. భారతదేశ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర నూతన రికార్డు నెలకొల్పినా ఎంసీఎక్స్ లో మాత్రం ఆగస్టు కాంట్రాక్ట్ ధర రూ.48,589 వద్ద స్థిరపడింది. ఇంతకుముందు క్లోజింగ్ ధర రూ.48,057తో పోలిస్తే కరెక్షన్ జరిగింది.

డీవీపీ ఫర్ కమోడిటీస్ అండ్ కరెన్సీస్ రీసెర్చ్ @ ఏంజిల్ బ్రోకింగ్ ప్రతినిధి అనూజ్ గుప్త మాట్లాడుతూ స్వల్ప కాల వ్యవధిలో తులం బంగారం రూ.48-49 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నాం. దీపావళి నాటికి రూ.51,000-రూ.52,000లకు అంచనా వేస్తున్నాం’ అని తెలిపారు. 

జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమోడిటీ హెడ్ వీ హరీశ్ మాట్లాడుతూ, ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో పసిడి ప్రత్యామ్నాయ స్వర్గధామంగా మారిందని చెప్పారు. భౌగోళిక రాజకీయ అస్థిరతలు పెరిగే కొద్దీ, డాలర్ విలువ తగ్గిపోయి పసిడి పట్ల సెంటిమెంట్లు పెంచుతాయన్నారు.