Asianet News TeluguAsianet News Telugu

Explainer: 6G టెక్నాలజీ అంటే ఏంటి..? ఇది ఎలా పనిచేస్తుంది..6G విజన్ డాక్యుమెంట్‌లో ఏముంది..?

ప్రస్తుతం మార్కెట్లో 5G టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. అయితే త్వరలోనే 6జీ టెక్నాలజీ దిశగా కూడా దేశం వడివడిగా అడుగులు వేస్తోంది. మరి ఈ 6G టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. 

Explainer What is 6G technology How it works What is in the 6G vision document MKA
Author
First Published Mar 27, 2023, 11:36 AM IST

2030 నాటికి భారతదేశంలో 6G కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం 6G మిషన్‌లో భాగంగా. పరిశ్రమ, విద్యాసంస్థలు, సర్వీస్ ప్రువైడర్ సహా ఇతర  వాటాదారులను చేర్చుకోవడం ద్వారా 6జీ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం, దాదాపు 30 కోట్ల భారతీయ కుటుంబాల్లో 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని ఈ విజన్ డాక్యుమెంట్ తెలిపింది. అంతేకాదు ప్రతి కుటుంబం సగటున ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ద్విచక్ర వాహనాలతో సమానంగా భారతీయులు స్మార్ట్ ఫోన్ లపై ఖర్చు చేయడం విశేషం. సగటు భారతీయుడు వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌ను వ్యక్తిగత వాహనంతో సమానంగా పరిగణించడం విశేషం. 

6G అంటే ఏమిటి?
సాంకేతికంగా, 6G ఇంకి ఉనికిలోకి రానప్పటికీ, ఇది 5G కంటే 100 రెట్లు వేగంగా ఇంటర్నెట్ వేగాన్ని అందించే అత్యంత అధునాతన సాంకేతికతగా నిపుణులు చెబుతున్నారు. 2022 అక్టోబర్‌లో 5జీ సేవలను అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ, వచ్చే 10 ఏళ్లలో 6జీ సేవలను ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని ఆ సమయంలో చెప్పారు. సెకనుకు 10 గిగాబిట్ల వరకు ఇంటర్నెట్ వేగాన్ని  5G అందిస్తోంది. అయితే 6G సెకనుకు 1 టెరాబిట్ వేగంతో అల్ట్రా-ఫాస్ట్ వేగాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. విజన్ డాక్యుమెంట్ ప్రకారం, 6G టెక్నాలజీ ద్వారా రిమోట్-కంట్రోల్డ్ ఫ్యాక్టరీలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, మానవ శరీర భాగాల నుంచి నేరుగా ఇన్‌పుట్ తీసుకునే స్మార్ట్ వేరబుల్స్ పనిచేయనున్నాయి. అంతే కాదు 6జీ కొత్త డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

భారతదేశం 6G రోడ్‌మ్యాప్ ఏంటి ?
6G ప్రాజెక్ట్ రెండు దశల్లో అమలు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షించడానికి ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనుంది. పరిశోధన, అభివృద్ధి కోసం నిధులు, స్పెక్ట్రమ్ గుర్తింపు, 6G విస్తరణ, పరికరాలు, అలాగే ఎకోసిస్టం  రూపొందించడంపై దృష్టి సారిస్తుంది. 6G డిమాండ్‌ని ఉత్పత్తి చేయడానికి కొన్ని కొత్త బ్యాండ్‌లను తెరిచే అవకాశం ఉంది. అవి 450-470 MHz, 526-612 MHz, 31-31.3 GHz బ్యాండ్ విడ్త్ కలిగి ఉండనున్నాయి. 6G అవసరాలను తీర్చడానికి నూతన టెక్నాలజీని విస్తరించవలసి ఉంటుందని డాక్యమెంట్ పేర్కొంది. అలాగే  6Gపై పరిశోధన, ఆవిష్కరణలకు నిధులు సమకూర్చడానికి తదుపరి 10 సంవత్సరాలకు గ్రాంట్ల రూపంలో రూ. 10,000 కోట్ల నిధులు ఇవ్వాలని డాక్యుమెంట్ సిఫారసు చేసింది.  3GPP, ITU, IEC, IEEE వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయాలని ఈ డాక్యుమెంట్ పేర్కొంది. 

6G రోల్‌అవుట్  ఇతర దేశాల్లో ఎలా జరుగుతోంది.. 
దక్షిణ కొరియా మొదటి దశలో రూ. 1,200 కోట్ల పెట్టుబడితో 6G పరిశోధన, అభివృద్ధి ప్రణాళికను రూపొందించింది, ఇది 2025 వరకు కొనసాగనుంది. అలాగే జపాన్‌లో, ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్, వైర్‌లెస్ నెట్‌వర్క్ (IOWN) ఫోరమ్ 6G కోసం దాని విజన్ 2030 వైట్ పేపర్‌ను ప్రచురించింది,  చైనాలో కూడా 6జీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios