భారతీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీ తనయుడు ఆకాశ్‌ అంబానీ, వజ్రాల కంపెనీ అధినేత రసెల్‌ మెహతా కుమార్తె శ్లోకా మెహతా వివాహం మార్చి తొమ్మిదో తేదీన  ముంబైలో జరగనుందని సమాచారం. ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌ పేర్కొన్న వార్తాకథనం ప్రకారం.. చిన్ననాటి నుంచే స్నేహితులైన ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతా మార్చి 9 నుంచి 3 రోజుల పాటు ముంబైలో జరిగే వివాహ వేడుకతో ఒక్కటి కానున్నారు. 

గతేడాది జూన్‌లోనే శ్లోకా-ఆకాశ్‌లకు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.  మార్చి తొమ్మిదో తేదీన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ సెంటర్‌లో వివాహం జరగనుందని అంటున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు విలాసవంత ఫైవ్ స్టార్‌ హోటల్‌ ట్రైడెంట్‌లో మంగళ్ బారాత్‌ ప్రారంభం అవుతుంది.

అది జియో వరల్డ్‌ సెంటర్‌కు చేరుకున్నాక సాయంత్రం 6.30 గంటలకు అక్కడ అతిథులకు హై టీపార్టీ ఉంటుంది. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వివాహం జరుగుతుంది. మార్చి 10వ తేదీన జియో వరల్డ్‌ సెంటర్‌లోనే అంబానీలు, మెహతాలు కలిసి ఘనంగా విందు నిర్వహిస్తారు.

మంగల్‌ పర్వ్‌ వేడుక ఇదే రోజు ఉంటుంది. ఈ వేడుకలకు వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు అవుతారని భావిస్తున్నారు. మార్చి 11వ తేదీన జియో వరల్డ్‌ సెంటర్‌లోనే వివాహ రిసెప్షన్‌ ఉంటుంది. వివాహానికి ముందుగా ఆకాశ్‌ అంబానీ బ్యాచిలర్‌ పార్టీ ఈనెల 23-25 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోని సెయింట్‌ మోరిజ్‌లో అట్టహాసంగా జరగనుందని వార్తలొస్తున్నాయి.

సినీ ప్రముఖులు కరణ్‌ జోహార్‌, రణ్‌బీర్‌ కపూర్‌ వంటి 500 మంది సన్నిహితులు ఈ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ముంబై నుంచి రెండు ప్రత్యేక విమానాల్లో అతిథులు తరలి వెళ్తారని సమాచారం. అయితే అధికారికంగా ఎవరూ వివరాలు వెల్లడించలేదు. 

తన తల్లితో కలిసి శ్లోకా మెహతా షాపింగ్‌ చేస్తున్న దృశ్యాలను గమనిస్తే, త్వరలోనే వివాహం ఉంటుందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఆకాశ్‌ కవల సోదరి ఈశా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ వివాహాన్ని ముకేశ్‌ అంబానీ- నీతా అంబానీ గత డిసెంబర్ నెలలో అత్యంత వైభవంగా చేసినసంగతి తెలిసిందే.