జూలై 31 తర్వాత మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయలేకపోతే, మీరు ఇప్పటికీ ITRని ఫైల్ చేసే చాన్స్ ఉంది. అయితే లేట్ ఫీజుతో ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ 31 డిసెంబర్ 2023. ఈ తేదీ వరకు మీరు మీ ఆలస్య ITRని ఫైల్ చేయవచ్చు.

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR Filing Last Date) దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023, అది ఇప్పుడు ముగిసింది. జూలై 31 అర్థరాత్రి వరకు దాదాపు 6,77,42,303 మంది ఐటీఆర్‌ దాఖలు చేశారు. కానీ ఇప్పటికీ చాలా మంది రిటర్న్ (ITR) దాఖలు చేయలేదు. ఇప్పటి వరకు రిటర్న్‌ దాఖలు చేయని వారు ఇంకా రిటర్న్‌ దాఖలు చేయవచ్చు కానీ ఫైన్ చెల్లించి రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 

నిజానికి ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఫిర్యాదు చేస్తూ పన్ను దాఖలుకు గడువును పొడిగించాలని చాలా మంది సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. అయతే గతేడాదిలా ఈసారి ఐటీఆర్‌ దాఖలు తేదీని పొడిగించలేదు. అయితే ఎవరైతే ఐటీఆర్ దాఖలు చేయలేదో ఇప్పుడు జరిమానా మొత్తాన్ని చెల్లించడం ద్వారా డిసెంబర్ 31, 2023లోపు తమ రిటర్నులను ఫైల్ చేయవచ్చు. ఇప్పుడు కూడా మీ రిటర్న్ ఫైల్ చేయడానికి ఏమి చేయాలో తెలుసుకుందాం. 

రూ.1000 నుంచి 5000 జరిమానా

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(4) ప్రకారం, ఆలస్య రుసుముతో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే తేదీ దాటిన తర్వాత కూడా రిటర్నులు దాఖలు చేయవచ్చు. కాబట్టి మీరు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడానికి 31 జూలై 2023 తేదీని మిస్ అయితే, మీరు ఇప్పటికీ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. దీని కోసం, మీరు రూ. 1000 నుండి రూ. 5000 వరకు ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది.

రూ. 1,000 జరిమానా ఎవరు చెల్లించాలి?

మీ వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల కంటే తక్కువగా ఉంటే , మీరు ఇంకా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనట్లయితే, మీరు రూ. 1000 జరిమానా చెల్లించి మీ ITR ఫైల్ చేయవచ్చు. మీ వార్షిక ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉంటే, అప్పుడు మీరు పెనాల్టీగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఒక వ్యక్తి , వార్షిక ఆదాయం ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే , అతను రిటర్న్ ఫైల్ చేయడానికి చివరి తేదీని మిస్ అయినట్లయితే, అతను ఇప్పుడు రిటర్న్ ఫైల్ చేయడానికి రూ. 5000 ఆలస్య రుసుము చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు వాటిపై చెల్లించాల్సిన పన్ను మొత్తంపై ఆగస్టు 1 నుంచి వడ్డీ లెక్కింపు ప్రారంభమవుతుంది.

ఐటీఆర్‌ను 6,77,42,303 మంది దాఖలు చేశారు

జూలై 31 అర్ధరాత్రి వరకు 6,77,42,303 మంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేశారు. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ ప్రకారం, ఇప్పటివరకు 5,62,59,216 ఐటీఆర్‌లు ధృవీకరించారు. మొత్తం 3,44,16,658 ఐటీఆర్‌లను ప్రాసెస్ చేసింది.