ముంబై: నిధుల కటకట, రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఊపిరిలూదే ప్రయత్నాన్ని ఎతిహాద్‌ ప్రారంభించింది. ఇందులో భాగంగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్లతో సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి ఎస్బీఐ అధికారులతో ఎతిహాద్ ప్రతినిధులు సమర్పించారని సమాచారం. జెట్ ఎయిర్వేస్ 400 మిలియన్ల డాలర్ల బకాయిలు ఉన్నారని బ్యాంకర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.  

నిధుల కొరత సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్‌ వ్యాపార ప్రణాళిక రూపకల్పన దిశగా రెండు సంస్థల అధికారులు కొన్ని రోజులుగా చర్చిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు వెల్లడించారు. అబుదాబీ విమానయాన సంస్థ ఎతిహాద్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు 2013లో కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించేందుకే ఈ 24 శాతం వాటాను ఎతిహాద్‌ కొనుగోలు చేసింది. అయితే కంపెనీ పరిస్థితి అప్పుడున్నంత సాఫీగా ఇప్పుడు లేదు. 

అలిటాలియా, ఎయిర్‌ బెర్లిన్‌లో పెట్టుబడులు పెట్టి ఎతిహాద్‌ బాగానే నష్టపోయింది. దీనికి తోడు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంక్షోభంలో చిక్కుకోవడం ఎతిహాద్‌ ఆర్థిక పరిస్థితిపైనా ప్రభావం చూపింది. అయినా జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఒడ్డున పడేసే ప్రయత్నాలను ఎతిహాద్‌ చేస్తుండటం గమనార్హం. 

ఒకవేళ భవిష్యత్‌ ప్రణాళికకు జెట్‌ ఎయిర్‌వేస్‌ అంగీకరిస్తే కొత్తగా మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశాన్ని ఎతిహాద్‌ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాల కథనం. అయితే ఇంతవరకు ఈ అంశంపై ఎలాంటి తుది నిర్ణయాన్ని ఇరు సంస్థలు తీసుకోలేదని అవి పేర్కొన్నాయి. ఈ పరిణామంపై రెండు విమాన సంస్థలు ఇప్పటివరకూ అధికారికంగా స్పందించలేదు.

విమానయాన రంగంలో దేశంలోనే సింహ భాగం మార్కెట్‌ వాటా కలిగి ఉన్న జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకున్న సంగతి తెలిసిందే. సంస్థ ఉన్నత అధికారులు, పైలట్లు సహా సిబ్బందికి నెలల తరబడి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకొనేందుకు లాభం తక్కువగా ఉన్న మార్గాల్లో విమాన సర్వీసులను నిలిపివేశారు. 

డాలర్‌పై రూపాయి మారకం విలువ, ఇంధన ధరలు పెరగడం వంటి పరిణామాలు భారత విమానయాన రంగంలో ఏ ఆర్థిక సమస్యలు లేని ఇండిగో ఎయిర్‌లైన్స్‌ వంటి సంస్థలకు సైతం కొంత అడ్డంకిగా మారాయి. ఈ పరిణామాలే జెట్‌ ఎయిర్‌వేస్‌ నష్టాల బాటకు ప్రధాన కారణం అయ్యాయి.

దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల టికెట్టు కనీస ధరను (బేస్‌ ప్రైస్‌) 30 శాతం వరకు జెట్‌ ఎయిర్‌వేస్‌ తగ్గించింది. బిజినెస్‌, ఎకానమీ క్లాసుల బుకింగ్‌లతో పాటు పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌ తన భాగస్వామి విమానయాన సంస్థలతో (కోడ్‌షేర్‌ పార్ట్‌నర్స్‌) కలిసి నడిపే సర్వీసులకు కూడా ఇది వర్తిస్తుంది. వారం పాటు అందుబాటులో ఉండే ఈ ఆఫర్‌ నిన్నటి నుంచే ప్రారంభమైంది. 

డిసెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణానికి తీసుకునే టికెట్లపై ఈ 30 శాతం తగ్గింపును పొందొచ్చు. అయితే ఇది ఆయా గమ్యస్థానాల ఆధారంగా మారుతూ ఉంటుంది. కోడ్‌ షేర్‌ పార్ట్‌నర్స్‌ ఎయిర్‌ ఫ్రాన్స్‌, రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వామ్యంతో నడిపే విమానాల్లో ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణంపై బిజినెస్‌, ఎకానమీ క్లాసులో ప్రత్యేక ఆఫర్‌ కింద 30 శాతం వరకు తగ్గింపు ఉంటుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది.

సింగపూర్ నుంచి భారత్‌, గల్ఫ్‌, సార్క్‌ దేశాలు, అమెస్టర్‌డామ్‌, లండన్‌, మాంచెస్టర్‌, ప్యారిస్‌లకు జెట్‌ ఎయిర్‌వేస్‌ నడిపే విమాన సర్వీసులపైనా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది. హాంకాంగ్‌, సార్క్‌, గల్ఫ్‌, అమెస్టర్‌డామ్‌, లండన్‌, మాంచెస్టర్‌, ప్యారిస్‌ నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులు తిరుగు ప్రయాణం కనీస ధరలో 25 శాతం వరకు తగ్గింపు పొందొచ్చని వివరించింది. 

ఈ నెల ప్రారంభం నుంచి ముంబై, ఢిల్లీ నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాలకు అదనంగా 65 సర్వీసులను జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రారంభించింది. డిసెంబర్ నెలతో కలిపి ఐదు నెలలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసుల షెడ్యూల్‌కు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆమోదం తెలిపింది. గత నెల మధ్యలో ఈ అనుమతులు ఇచ్చారని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.