ప్రముఖ విమానాల తయారీ సంస్థ ఎయిర్ బస్ తన ఉత్పత్తుల్లో అత్యుత్తమమైన ‘ఏ380’ సూపర్‌ జంబో విమానాల తయారీని ఆపేయనున్నట్లు ప్రకటించింది. విమానయానాన్ని మరింత సుందరంగా, విలాసవంతంగా మార్చిన ఈ అతిపెద్ద ఎయిర్‌లైనర్‌కు ఇప్పుడు డిమాండ్ తగ్గడం వల్లే ఎయిర్‌బస్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

2021లో చివరి ఏ380 విమానం డెలివరీ ఉంటుందని గురువారం ఐరోపా ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్‌బస్ తెలియజేసింది. బోయింగ్ 747 విమానాలకు ఏ380ను ఎయిర్‌బస్ పోటీగా తెచ్చింది. గతేడాది 10 విమానాలను తయారు చేసిన ఎయిర్‌బస్.. ఈ ఏడాది మరో ఎనిమిది, వచ్చే ఏడాది ఇంకో ఏడింటిని తయారు చేయనున్నట్లు స్పష్టం చేసింది. 

2021లో రెండు విమానాలను తయారు చేస్తామన్న ఎయిర్‌బస్.. అదే ఏ380 విమానాల ఉత్పత్తికి చివరి ఏడాది అని స్పష్టం చేసింది. ఈ మూడేళ్లలో తయారయ్యే 17 ఏ380 విమానాల్లో 14 ఎమిరేట్స్‌కు, మరో మూడు జపాన్‌కు చెందిన ఏఎన్‌ఏ ఎయిర్‌లైన్‌కు అందించనున్నట్లు వెల్లడించింది.

ఏ380 విమాన సేవలు మొదలైన పుష్కర కాలంలోనే వాటి తయారీ నిలిచి పోవడంపై విమానయాన పరిశ్రమ నిపుణులు, విశ్లేషకులు ఒకింత ఆందోళననే వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో విమాన ప్రయాణీకుల రద్దీ గణనీయంగా పెరుగవచ్చన్న అంచనాల నడుమ ఏ380 విమానాల సంఖ్య పరిమితంగా ఉంటే.. లక్షల ప్రయాణీకుల రవాణా పరిస్థితి ఏంటని? ప్రశ్నిస్తున్నారు. 

నిజానికి తరచూ ఏ380 విమానాలపై ఎయిర్‌బస్ గొప్ప రాయితీలనే ప్రకటిస్తూ వచ్చింది. కానీ దీనిపట్ల ఎవరూ ఆసక్తి కనబరుచడం లేదు. ఉత్పాదక వ్యయం కూడా పెరుగడం ఎయిర్‌బస్ తాజా నిర్ణయానికి కారణమైంది.

ఎయిర్‌బస్ ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి ఏ380 నిలిపివేతకు ఎమిరేట్స్ నిర్ణయమే ప్రధాన కారణం. ఏ380 విమానాల కోసం ఎయిర్‌బస్‌కున్న ప్రధాన కస్టమర్ దుబాయ్‌కి చెందిన ఎమిరేట్సే. 123 ‘ఏ380’ విమానాల ఆర్డర్లను ఎయిర్‌బస్‌కు ఎమిరేట్స్ ఇచ్చింది. ఇందులో ఇప్పటిదాకా 109 విమానాలను ఎమిరేట్స్‌కు ఎయిర్‌బస్ అందించింది కూడా. మరో 14 విమానాలను ఇవ్వాల్సి ఉన్నది. 

గ్లోబల్ విమానయాన మార్కెట్‌లో మారిన పరిస్థితులు, వ్యయ నియంత్రణ దృష్ట్యా ఏ380 కొత్త ఆర్డర్లను తగ్గించుకున్న ఎమిరేట్స్.. ఏ320, ఏ350 విమానాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నది. ఈ క్రమంలోనే 70 ఏ320, ఏ350 విమానాల ఆర్డర్లనూ ఇచ్చింది.

దీంతో ఇక ఏ380 తయారీకి గుడ్‌బై చెప్పడమే మంచిదన్న భావనకు ఎయిర్‌బస్ వచ్చింది. ఎమిరేట్స్ కాక ఏ380 ఆర్డర్లనిచ్చే సంస్థలు ప్రస్తుతం లేవు. 2021 తర్వాత ఉత్పత్తికి అవకాశాలు కనిపించడం దని ఎయిర్‌బస్ కాబోయే సీఈవో ఫౌర్ అన్నారు.

సుదూర ప్రాంతాలకు తిరిగే భారీ విమానాల కంటే తక్కువ దూరం కల చాలా ప్రాంతాలకు వెళ్లే మధ్య, చిన్న శ్రేణి విమానాలే నయమన్న భావన పరిశ్రమలో కనిపిస్తున్నది. ఈ తరహా వి మానయాన సేవలే లాభదాయకం అన్న ధోరణి ప్రస్తుత విమానయాన రంగంలో కనిపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ క్రమంలోనే ఏ380కు పెట్టే డబ్బుతో చిన్న విమానాలను భారీ కొనవచ్చని, ఎక్కువ మార్గాల్లో తిప్పవచ్చునన్న ఆలోచనలున్న సంస్థలు పరిశ్రమలో పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఎయిర్‌బస్ సైతం ఇకపై ఏ320 ఇతరత్రా విమానాల తయారీపై దృష్టి పెడుతామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం.

‘ఏ380’ ఓ డబుల్-డెక్కర్ ప్లేన్. రెండంతస్తుల విమానం అన్నమాట.  సాధారణ విమానాలతో పోల్చితే ఇది ఎంతో విశాలంగా ఉంటుంది. ప్రస్తుత ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌ల్లో ఇదే అత్యంత పెద్దది. 500ల నుంచి 850 మందిదాకా ప్రయాణీకులు దీనిలో ప్రయాణించవచ్చు. 

2005 ఏప్రిల్ 27న ఏ380 తొలి విమానాన్ని ఎయిర్‌బస్ తయారుచేసింది. 2007 అక్టోబర్ 25న ఏ380 వాణిజ్య సేవలు మొదలయ్యాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ద్వారా ఈ విమానం మొట్టమొదట ఎగిరింది. ఇప్పటిదాకా మొత్తం 321 ఏ380 విమానాల ఆర్డర్లను ఎయిర్‌బస్ అందుకున్నది.

నాలుగు ఇంజిన్లను కల ఏ380 గరిష్ఠ వేగం గంటకు 903 కిలోమీటర్లు. దీని కనీస ధర 446 మిలియన్ డాలర్లు. తొలినాళ్లలో ఏ3XXగా దీన్ని పిలిచారు. 

ఏ380 విమానాల తయారీని నిలిపివేయాలన్న ఎయిర్‌బస్ ఆలోచన.. ఆ సంస్థలోని 3,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్నది. ఈ భారీ విమానాల ఉత్పత్తి ఆగిపోతే ఆయా విభాగాల్లోని వందల మందికి కొలువులు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వీరందరినీ ఇతర ప్రాజెక్టుల్లోకి మారుస్తామని ఎయిర్‌బస్ వర్గాలు చెబుతున్నా, ఎంతో కొంత ప్రభావం ప్రస్తుత ఉద్యోగులు, కొత్త ఉద్యోగావకాశాలపై ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
ఇప్పటికే గతేడాది దాదాపు 523 మిలియన్ డాలర్ల నష్టాలను సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో కోతలు తప్పేట్టు లేవు. 

ఏ380 ఓ ప్రపంచ శ్రేణి ఇంజినీరింగ్ అద్భుతం. ప్రయాణీకులు అత్యంత ఇష్టపడే విమానం. అలాంటి ఈ విమాన తయారీ నిలిచిపోతుండటం బాధాకరం అని ఏ380 విమానానికి ఇంజిన్లను సమకూరుస్తున్న సంస్థల్లో ఒకటైన రోల్స్-రాయిస్ ప్రతినిధి క్రిస్ కొలెర్టన్ అన్నారు.

ఈ ‘ఎ380’ విమానం 24.1 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది 10 అంతస్తుల భవనాలు, ఐదు జిరాఫీల ఎత్తుకు ఇది సమానం. కాగా ఈ విమానం రెక్కలు 80 మీటర్ల పొడవు ఉంటాయి. ఇది 35 పెద్ద గద్దల రెక్కలతో ఇది సమానం.

లేదంటే రైట్‌ బ్రదర్స్‌ తమ తొలి విమానంలో ప్రయాణించిన దూరానికి ఇది రెట్టింపుగా ఉంటుంది. 580 టన్నుల బరువు గల ఈ విమానం 165 ఏనుగులతో సమానం. ఇక దీని ఖరీదు 446 మిలియన్ల డాలర్లు.. ఒక గ్రీన్లాండ్ వంటి దేశాల జీడీపీతో పోలిస్తే మూడు రెట్లు అదనం.