పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలు సామాన్యుల కోసమే ఏర్పాటు చేసినవి. వీటిలో సులభమైన, సురక్షితమైన పొదుపు మార్గాల్లో డబ్బును ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎలాంటి పథకాల ద్వారా వడ్డీ ఆదాయం, పన్ను ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఆర్థిక భద్రత పొందవచ్చో తెలుసుకోండి.
సామాన్యుల కోసం పోస్టాఫీసు పథకాలు ఎన్నో ఉన్నాయి. కానీ వారికి వాటిపై అవగాహన లేక పొదుపు చేయడం లేదు. నిజానికి పొదుపు చేసేందుకు సురక్షితమైన మార్గాల్లో పోస్టాఫీసు పథకం కూడా ఒకటి. పొదుపు మొదలుపెట్టడానికి పోస్టాఫీసు పథకాలు నమ్మకమైనవని ప్రభుత్వాలు, ఇన్వెస్టెర్లు చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వ హామీతో, పెట్టుబడిపై ఎలాంటి రిస్క్ లేకుండా మంచి వడ్డీ ఇచ్చే పథకాలు గురించి ఇక్కడ ఇచ్చాము. 2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులేదు.
ప్రస్తుతం SCSS (సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్) , SSY (సుకన్య సమృద్ధి యోజన) పథకాలకు 8.2% వడ్డీ లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా PPF (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) 7.1%, NSC (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్) 7.7% వడ్డీనిస్తున్నాయి. నెలవారీ ఆదాయం కావాలనుకునేవారికి POMIS (పోస్టా ఆఫీసు మంత్లీ ఇంకమ్ స్కీమ్) 7.4% వడ్డీ ఇస్తుంది. మీకు నచ్చిన వాటిలో పోదుపు ఖాతాలను తెరవచ్చు.
ఆధార్ e-KYC ద్వారా RD, PPF ఖాతాలు సంతకం లేకుండానే మీకు తెరిచే అవకాశం ఉంది. కావాల్సినప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. SSY, PPF, NSC వంటి పథకాలు గడువు ముగిసిన తర్వాత 3 ఏళ్లలోపు రెన్యువల్ చేసుకోవాలి. లేకప్తే ఆ ఖాతాలు ఫ్రీజ్ అయిపోయే అవకాశం ఉంది.
మహిళల కోసం MSSC (మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్) పథకంలో కొత్త పెట్టుబడులు మార్చి 2025 నుంచి ఆగిపోయాయి. కానీ పాత పెట్టుబడిదారులు ECS ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు పొందవచ్చు. ఇది ఎంతో అనుకూలమైన పద్ధతి కూడా.
ముఖ్యమైన పథకాలలో సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లల పొదుపుకు ఉత్తమమైన పథకం. దీనిపై 80C పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై పన్ను కూడా ఉండదు. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్ స్కీమ్ కూడా రిటైర్డ్ అయిన వారికి కచ్చితమైన త్రైమాసిక ఆదాయాన్నిస్తుంది. PPF, NSC దీర్ఘకాలంలో సంపద సృష్టించడానికి సహాయపడతాయి.
ఇక నెలనెలా ఆదాయం కావాలనుకునే కుటుంబాలు మాత్రం POMISని ఎంపిక చేసుకోవాలి. తక్కువ కాలం డబ్బులు తిరిగి కావాలనుకుంటే మాత్రం RD, TD పథకాలు 6.7% నుండి 7.5% వరకు వడ్డీని అందిస్తున్నాయి. అత్యవసర అవసరాలకు 4 శాతం వడ్డీతో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఉపయోగపడుతుంది.
పన్ను ఆదా, పిల్లల చదువు, రిటైర్మెంట్ ప్లానింగ్, నెలవారీ ఆదాయం.. దేనికైనా పోస్ట్ ఆఫీస్ పథకాలు సులభమైన, సురక్షితమైన, ప్రభుత్వ హామీతో కూడిన మార్గాలుగానే చెప్పుకోవాలి. మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టే ముందు మీ వయస్సు, లక్ష్యం, కాలాన్ని బట్టి పథకాన్ని ఎంచుకుంటేనే అధిక ప్రయోజనాలు కలుగుతాయి.
పైన చెప్పనవన్నీ కూడా సామాన్య ప్రజానీకం కోసం సిద్ధం చేసిన పథకాలే. ఇందులో మీరు ఎంత తక్కువ మొత్తంలోనైనా పొదుపు చేసుకోవచ్చు. కాబట్టి రేపటి కోసం ఈ రోజే పొదుపు చేయడం మొదలుపెట్టండి. భవిష్యత్తులో ఆర్దిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్త పడండి.
