న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్‌ రంగంలో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మోసాల నియంత్రణకు పలు చర్యలు చేపడుతున్నట్టు కేంద్రంలోని మోదీ సర్కార్.. మరోవైపు ఆర్బీఐ ఎంత చెపి్పాన వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే నాలుగు రెట్లు మోసాలు పెరిగాయని ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 

2017 -18లో బ్యాంకింగ్‌ రంగంలో రూ.41,167.7 కోట్ల విలువైన మోసాలు జరిగాయి. అంతకు ముందు 2016-17 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ.23,933 కోట్ల విలువైన మోసాలతో పోలిస్తే ఒక్క ఏడాదిలోనే ఈ తరహా మోసాలు 72 శాతం పెరగడం విశేషం.

వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ, ఆయన మేనమామ మెహుల్‌ ఛోక్సీ తదితరులు కలిసి పంజాబ్‌ నేషనల్ బ్యాంకుకు (పీఎన్బీ)కి రూ.13 వేల కోట్ల పై చిలుకు మోసగించి విదేశాలకు ఫలాయనం చిత్తగించిన సంగతి తెలిసిందే. అందువల్లే 2017-18లో బ్యాంకింగ్‌లో ఇదే అతిపెద్ద మోసంగా నమోదైనట్లు తెలుస్తున్నది.  పీఎన్బీ కుంభకోణం వల్లే 2017-18లో మోసాల విలువ భారీగా పెరిగిందని ఆర్బీఐ తన నివేదికలో విశ్లేషించింది. 

గత వారం ‘ట్రెండ్స్ అండ్ ప్రోగ్రెసివ్ ఆఫ్ బ్యాంకింగ్- 2017-18’ అనే పేరుతో ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. 2016-17లో బ్యాంకింగ్‌ రంగంలో 5,076 మోసం కేసులు నమోదు కాగా,  గత ఆర్థిక సంవత్సరంలో వీటి సంఖ్య 5,917కు పెరిగింది. కాగా అత్యధికంగా రూ. లక్షకు మించి నమోదైన కేసుల్లో 93 శాతం కేసులు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే నమోదు కావడం గమనార్హం. 2014కి ముందుతో పోలిస్తే తర్వాత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకింగ్‌లో మోసాలు నాలుగు రెట్లు పెరిగాయి. 

2013-14లో రూ.10,170 కోట్ల విలువ చేసే మోసాలు జరిగితే 2017-18లో ఈ మోసాలు రూ.41వేల కోట్లకు చేరడం ఆందోళనకరం. 2017-18లో 2,059 సైబర్‌ మోసాల వల్ల బ్యాంకులు రూ.109.6 కోట్లు నష్టపోయాయి. 2016-17లో 1,372 కేసుల్లో రూ.42.3 కోట్లు పోగొట్టుకున్నాయి. మొత్తం మోసాల్లో రూ.50 కోట్ల పైబడినవి 80 శాతం ఉండటం గమనార్హం. మొత్తం మోసాల్లో 90 శాతం రుణాలుగా జారీ చేసినవి కావడం ఆందోళనకరమని ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక తెలిపింది. 

2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంకుల స్థూల మొండి బాకీలు 11.2 శాతం పెరిగి.. దాదాపు రూ.10.39 లక్షల కోట్లకు చేరాయి. అంతకు ముందు ఏడాది బ్యాంకుల జీఎన్‌పీఏ 9.3 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెరిగిన జీఎన్‌పీఏల మొత్తంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.8.95 లక్షల కోట్లని, ఇది 14.6 శాతానికి సమానమని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది.