గోధుమల ధరలు గత కొన్ని రోజులుగా ఆకాశాన్నంటుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో కిలో గోధుమల ధర సగటున రూ. 32.38 కి పెరిగింది. 2010 జనవరి తర్వాత గోధుమల ధరలు ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంటే గత పన్నెండేళ్లలో గోధుమ ధరలు ఇంత గరిష్ట స్థాయికి చేరడం ఇదే ప్రప్రథమం అన్నమాట. 

బ్రెడ్, బిస్కెట్, రోటీల ధరలు వచ్చే నెలల నుంచి పెరగనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్(ఓఎంఎస్ఎస్)ను ఇంకా ప్రకటించలేదు. ఓఎంఎస్ స్కీమ్ కింద రెగ్యులర్ బేసిస్‌లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) గోధుమలను మార్కెట్లో విక్రయిస్తోంది. దీని ద్వారా సరఫరాను పెంచి, ఆహార ధాన్యాలు సమృద్ధిగా లభించేలా చేస్తుంది. గోధుమల లీన్ సీజన్‌లో ఓపెన్ మార్కెట్ ధరలను నియంత్రించేందుకు ఓఎంఎస్ఎస్ ‌ను ప్రభుత్వం వాడుతోంది.

అయితే ఈ ఏడాది ఎఫ్‌సీఐ గోధుమల కోసం ఓఎంఎస్ఎస్‌ను ప్రకటించలేదు. దీంతో కన్జూమర్లు, కంపెనీలు వీటి ధరలు మరింత పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. ధరల పెంపు జూన్ నుంచి ఉంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. రుతుపవనాల కాలంలో స్నాక్స్ వంటి వాటికి డిమాండ్ ఉండటంతో.. ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి గల కారణం రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయంలో విద్యా సంస్థలు కూడా ప్రారంభమవుతాయి. ఆ సమయంలో బ్రెడ్, బిస్కెట్ వంటి స్నాక్స్ ఐటమ్స్‌కు డిమాండ్ పెరుగుతుంది.

గత కొన్నేళ్లుగా ఎఫ్‌సీఐ గోధుమలపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ వచ్చింది. సరఫరా ఎక్కువగా ఉండటంతో.. డిస్కౌంట్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కంపెనీలు కూడా బాగా లబ్ది పొందాయి. గతేడాది ప్రభుత్వం నుంచి గోధుమలు ప్రాసెసింగ్ ఇండస్ట్రీ 70 లక్షల టన్నుల గోధుమలను సేకరించింది. ఇప్పటి వరకు ఓఎంఎస్ఎస్‌పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో.. కంపెనీలు ధరలను పెంచనున్నాయి.

అన్ని రాష్ట్రాల్లోని పౌరసరఫరాల శాఖల వద్ద నుంచి కేంద్ర ప్రభుత్వంలోని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణి శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం మే 7న దేశవ్యాప్తంగా కిలో గోధుమ పిండి ధర రూ. 32.78 గా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఉన్న రూ. 30.03 తో పోల్చుకుంటే ఇప్పుడున్న ధర 9.15 శాతం అధికం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 156 కేంద్రాల గణాంకాలను పరిశీలిస్తే.. మే 7న పోర్ట్ బ్లెయిర్‌లో అత్యధికంగా రూ.59 పలికింది. అలాగే అత్యల్పంగా పశ్చిమ బెంగాల్లోని పురులియాలో కిలో గోధుమ పిండి ధర రూ. 22 గా ఉంది. వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే ఉత్పత్తుల ధరలే ఆకాశాన్నంటుతున్నాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు.

2022 మార్చి నెలలో వినియోగదారుల ధర సూచికల ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్టానికి చేరి 6.95 శాతంగా నమోదైంది. దీంతో గోధుమలతో పాటు గోధుమ ఆధారిత ఆహార ఉత్పత్తుల ధరలు సైతం 15-20 శాతం పెరిగాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లోనైతే గోధుమల ధరలు 14 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి.