మీరు ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు కొనే ఇంటి ధర 50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా టీడీఎస్ చెల్లించాలి. అలా చెల్లించకపోతే లక్షల నష్టం కలుగుతుంది.
ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీరు కూడా ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనాలని ప్లాన్ చేస్తుంటే కొన్ని విషయాలను ముందుగా తెలుసుకోండి. ఇల్లు రిజిస్ట్రేషన్ కు ముందే టీడీఎస్ చెల్లించడం చాలా ముఖ్యం. మీ ఇంటి ధర 50 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ టీడీఎస్ ను ముందుగానే చెల్లించాలి. లేకపోతే మీ ఆస్తి రిజిస్ట్రేషన్ దగ్గరే ఆగిపోతుంది. అలాగే భారీ జరిమానాలు కూడా కట్టవచ్చు. మీకు ఆదాయపు నుండి నోటీసులు కూడా రావచ్చు.
ఎంత టీడీఎస్ కట్టాలి?
చాలామందికి ఈ విషయం తెలియదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు వెళ్ళాక అక్కడ ఇరుక్కుపోతూ ఉంటారు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఒక వ్యక్తి 50 లక్షల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విలువ గల స్థిరాస్తిని కొనుగోలు చేస్తే అమ్మకపు ధరలో ఒక శాతం టిడిఎస్ చెల్లించాలి. ఈ బాధ్యత కొనుగోలుదారుడుదే.ఫ్లాట్ అమ్మే వ్యక్తికి లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఎలాంటి సంబంధం ఉండదు.
కట్టకపోతే ఏమవుతుంది?
దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇళ్లను కొనేవారు టీడీఎస్ చెల్లించినట్టు ప్రూఫ్ ను చూపిస్తేనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఫ్లాట్ ను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఒక శాతం టీడీఎస్ ను జమ చేయకపోతే రిజిస్ట్రేషన్ ను ఆపివేసే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను శాఖకు ఈ విషయం తెలిసిందంటే మీపై వడ్డీలు, జరిమానాలు పడతాయి.
ఎక్కడ చెల్లించాలి?
టీడీఎస్ వివరాల కోసం మీరు ఆదాయపు పన్ను శాఖ వెబ్ సైట్లోకి వెళ్ళండి. అందులో ఆన్లైన్ ఫారం 26QB ఉంటుంది. దానిని పూరించి అందులో మీకు అమ్ముతున్న వ్యక్తి పాన్ నెంబరు, ఆ ఫ్లాట్ ఎక్కడ ఉంది, ఎంత మొత్తానికి కొంటున్నారు, ఎంత చెల్లించారు? వంటి సమాచారాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో టిడిఎస్ చెల్లించాలి. లేదా చలానా ద్వారా బ్యాంకుకు వెళ్లి కూడా డిపాజిట్ చేయవచ్చు. ఈ ప్రక్రియ జరిగిన వారం రోజుల తర్వాత ఫారం 16b వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఫ్లాట్ అమ్మే వ్యక్తికి అందజేయాలి.
మీరు అపార్ట్మెంట్ అమ్ముతున్న వ్యక్తికి డబ్బు చెల్లించిన రోజు నుండి 30 రోజుల్లోపు టీడీఎస్ చెల్లించడం చాలా ముఖ్యం. మీరు ఉదాహరణకు జూలై 10న ఫ్లాట్ కొనుక్కోవడానికి డబ్బులు చెల్లిస్తే ఆగస్టు 10 లోపు టీడీఎస్ చెల్లించాలి. ఆలస్యం అయితే వడ్డీ జరిమానా పడుతుంది.
50 లక్షల రూపాయలకు పైగా ఖరీదు చేసే ఆస్తిని కొనడం అనేది ఒక పెద్ద నిర్ణయం. దీనిలో చట్టబద్ధమైన నియమాలను పాటిస్తేనే మంచిది. చెల్లింపు అనేది చిన్న ప్రక్రియ... కానీ దీన్ని మీరు పక్కన పెడితే మాత్రం భారీ నష్టాలు వస్తాయి. కాబట్టి మీకు మరింత వివరాల కోసం చార్టెడ్ అకౌంట్ లేదా లాయర్లను కలిసి పూర్తి వివరాలను పొందవచ్చు.
