అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అనే థీం పేరిట చెన్నైలో ఏపీ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులోఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఏపీ పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు హాజరు అయ్యారు.

ఏపీలోని విశాఖపట్నంలో మార్చి 3, 4 న జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కోసం ఏపీ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో సన్నాహక సదస్సులను ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే బెంగళూరులో ఏపీ ప్రభుత్వం ఓ సదస్సును నిర్వహించింది. తాజాగా చెన్నై వేదికగా కూడా ఓ సదస్సును నిర్వహించారు ఇందులో ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహం కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ వరుసగా తొలి స్థానంలోనే నిలుస్తూ వస్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అనే థీం పేరిట చెన్నైలో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులోఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ఏపీ పరిశ్రమల శాఖ అధికారులు, ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు హాజరు అయ్యారు. ఇందులో ప్రధానంగా ఏపీలోని ఓడరేవుల గురించి ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యంగా ఏపీలోని పలు పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అలాగే పారిశ్రామిక కారిడార్ ల నిర్మాణం, పారిశ్రామిక మౌలిక వసతులు, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భూముల లభ్యత సహా ఇతర అనేక అంశాలను ఈ సదస్సులో అధికారులు ఆహ్వానితులకు వివరించారు. ఏపీలో సువిశాలమైన సముద్ర తీరం ఉందని, దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని పెట్టుబడులు పెట్టవచ్చని, అందుకే ఏపీ ప్రభుత్వం ఎక్కువగా పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బుగ్గన వివరించారు. అలాగే ఏపీ మారిటైం బోర్డ్ అధికారులు సైతం ఏపీలో ప్రస్తుతం 3 ఓడరేవులను నిర్మిస్తున్నామని తెలిపారు. అందులో ఒకటి ప్రభుత్వ రంగంలో, మరో పోర్టు ప్రైవేటు రంగంలో నిర్మిస్తున్నామని తెలిపారు. అంతేకాదు ఏపీలో పెద్దఎత్తున ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని ఇవి ఏపీ ఆక్వారంగంలో కీలకంగా మారబోతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే రాబోయే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ నుంచి ఏ మేర పెట్టుబడులు వస్తున్నాయో బుగ్గన వివరించలేదు. తాము ఆకాశమే హద్దుగా విస్తరిస్తున్నామని అందుకే ఎంత మొత్తంలో పెట్టుబడులు వస్తాయనే ఫిగర్ ను తాము చెప్పలేకపోతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని సహజవనరులు, అలాగే సువిశాల తీరప్రాంతం ఆధారంగా తాము పెట్టుబడులను ఆశిస్తున్నామని బుగ్గన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చెన్నైలోని పెట్టుబడిదారులను ఉద్దేశించి బుగ్గన మాట్లాడుతూ, చెన్నై పోర్టుకు 200 కి.మీ కంటే తక్కువ దూరంలోనే కృష్ణపట్నం ఓడరేవు ఉందని గుర్తు చేశారు. అలాగే దాని చుట్టూ ప్రభుత్వం పారిశ్రామిక కార్యకలాపాలను ప్లాన్ చేసినట్లు తెలిపారు.

చిత్తూరు, కృష్ణపట్నంలలో ప్రపంచ స్థాయి పెద్ద పారిశ్రామిక పార్కులు అభివృద్ధి చెందాయని, చెన్నైకి సమీపంలో ఉన్న రెండు ప్రాంతాల్లో ఆటో, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, మెషినరీతో సహా అనేక రంగాలలో అనేక పెట్టుబడి అవకాశాలను అందిస్తాయని ఆయన అన్నారు.