ఆదాయం పన్నుశాఖ తమను ఏంజిల్‌ టాక్స్‌ పేరిట భయభ్రాంతులకు గురి చేస్తోందని రెండు స్టార్టప్‌లు ట్రావెల్‌ ఖన్నా, బేబీగోగో ఆరోపణలు గుప్పించాయి. ఏంజిల్‌ టాక్స్‌ పేరిట ఆదాయం పన్ను శాఖ తమ కంపెనీల ఖాతాల నుంచి లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపాయి. ఇటువంటి చర్యలు స్టార్టప్‌ల పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశాయి.

ట్రావెల్ ఖన్నా ఖాతాల సీజ్.. రూ.33 లక్షలు జప్తు
ఇటీవల ట్రావెల్‌ ఖన్నాకు చెందిన నాలుగు బ్యాంక్‌ ఖాతాలను ఆదాయం పన్ను శాఖ  సీజ్‌ చేసి 2015-16లో వచ్చిన పెట్టుబడుల కింద రూ.33 లక్షలను పన్ను బకాయిలు కింద స్వాధీనం చేసుకొంది. తర్వాతే సదరు ట్రావెల్ ఖన్నా స్టార్టప్ ఖాతాలపై ఆంక్షలను తొలగించింది. 

ఐటీ శాఖ తీరుపై ట్రావెల్ ఖన్నా నిరసన ట్వీట్
దీనిపై సీనియర్‌ ఐటీ అధికారులు స్పందించినా అప్పీల్‌కు వెళ్లమని సలహా ఇస్తున్నట్లు ట్రావెల్ ఖన్నా సీఈవో పుష్పీందర్‌ సింగ్‌ తెలిపారు. ఈ మేరకు  ట్రావెల్ ఖన్నా సీఈవో పుష్పీందర్‌ సింగ్‌ తన నిరసన వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. అయితే దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వివరణ ఇచ్చింది.

సీబీడీటీ నిబంధనలను ట్రావెల్ ఖన్నా ఉల్లంఘించిందని ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయం పన్నుశాఖ చట్టం 1961లోని 68 సెక్షన్ ప్రకారం గుర్తు తెలియని నగదు జమ జరిగిందని ఇది నిబందనల ఉల్లంఘనేనని పేర్కొంది. షేర్ల ప్రీమియం కింద ఇదే చట్టంలోని 56(2) (వీఐఐబీ) సెక్షన్ పరిధిలోకి ఈ నిధులు రావని స్పష్టం చేసింది. 

అప్పుల్లో ఉన్న బేబీగోగో స్టార్టప్ నుంచి టాక్స్ వసూలు యత్నాలు 
బేబీగోగో స్టార్టప్‌ కూడా ఇలాంటి అనుభవాన్నే ట్వీట్‌చేసింది. ఈ నెల ఆరో తేదీన తమ ఖాతా నుంచి ఆదాయం పన్ను అధికారులు  డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. అప్పటికే తమ ఖాతాలో డబ్బులేక పోగా రూ.72లక్షలు అప్పు ఉందని పేర్కొంది. ‘వ్యాపార అనుకూల విధానాలతో లక్షల్లో ఉద్యోగాల కల్పన జరిగింది’అని ప్రధాని పార్లమెంట్‌లో పేర్కొన్న 24 గంటల్లోనే ఈ ఆరోపణలు రావడం గమనార్హం.

స్టార్టప్‌లను ప్రోత్సహించాలన్న సురేశ్ ప్రభు
ఇదిలా ఉంటే యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువైన పరిస్థితులను సృష్టించాల్సిన అవసరం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. కొత్తవారిని ప్రోత్సహించడానికి పాత నిబంధనలను మార్చాల్సి ఉన్నదని శనివారం ట్వీట్ చేశారు.

దేశంలో స్టార్టప్‌లు విస్తరిస్తున్నాయని, యువ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని వీరికి అనువైన పరిస్థితులను ఏర్పరుచటానికి ఇప్పుడున్న నిబంధనల స్థానంలో కొత్త నిబంధనలను తేవాలన్నారు.

స్టార్టప్ లకు పన్నులపై మినహాయింపులు
కాగా, పన్నుల విషయంలో స్టార్టప్‌లకు మినహాయింపులనిస్తున్నామని కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. తద్వారా ఆయన.. పెట్టుబడులకు విస్తృత అవకాశాలను కల్పిస్తున్నామని చెప్పారు. పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి తగు నిర్ణయాలు, సంస్కరణలు చేపడుతున్నట్లు వివరించారు. 

రూ.10 కోట్ల వరకు ఏంజిల్ ఇన్వస్ట్ మెంట్‌పై రాయితీలు
ఏంజిల్ ఇన్వెస్టర్ల ద్వారా వచ్చిన నిధులతోసహా మొత్తం పెట్టుబడులు రూ.10 కోట్లు మించని స్టార్టప్‌లకు గతేడాది పన్ను రాయితీలను అందించినట్లు కేంద్రమంత్రి సురేశ్ ప్రభు గుర్తుచేశారు. అయితే మొత్తం ఈ పన్ను నుంచి మినహాయింపును స్టార్టప్‌లు కోరుతున్నాయన్న ఆయన ప్రభుత్వం కూడా రూ.25-50 కోట్లదాకా మినహాయింపును పరిశీలిస్తున్నట్లు చెప్పారు.