Asianet News TeluguAsianet News Telugu

Mahindra XUV700: పారా ఒలింపియన్ ఇంటికి చేరిన ఎక్స్‌యూవీ 700

ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. స్ఫూర్తినిచ్చే వ్యక్తులను పరిచయం చేయడం.. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు నడపడంలో ఆయన ఎప్పుడూ సాయపడుతుంటారు.

Anand Mahindra keeps his promise
Author
Hyderabad, First Published Jan 22, 2022, 11:23 AM IST

ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. స్ఫూర్తినిచ్చే వ్యక్తులను పరిచయం చేయడం.. వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు నడపడంలో ఆయన ఎప్పుడూ సాయపడుతుంటారు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఓ క్రీడాకారిణికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గతేడాది జరిగిన టోక్యో పారా ఒలింపిక్స్ లో అవని లేఖరా 10 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో స్వర్ణ పతకం సాధించింది. అదేవిధంగా  50 మీటర్ల రైఫిల్‌ షూటింగ్‌ విభాగంలో రజత పతకం సొంతం చేసుకుని విశ్వ వేదికపై మువ్వన్నెల జెండాని రెపరెపలాడించింది. ఈ సందర్భంగా అవని లేఖరాను ప్రశంసించిన ఆనంద్ మహీంద్రా  ఆమె శరీర తత్వానికి వీలుగా సులభంగా ప్రయాణించేందుకు  సరికొత్త మహీంద్రా తయారుచేసిస్తానంటూ ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట‌ని నెరవేర్చారు.

ఆనంద్‌ మహీంద్రా  అలా మాట ఇచ్చారో లేదా ప్రత్యేక వాహనం తయారీ పనులు  వెనువెంటనే జరిగిపోయాయి. మహీంద్రా గ్రూపు చీఫ్‌ డిజైనర్‌ ప్రతాప్‌ బోస్‌ ఆధ్వర్యంలో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్‌లో పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగా డ్రైవర్‌ సీటు పక్కన ఉండే కో డ్రైవర్‌ సీటు బయటకి వచ్చేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల దివ్యాంగులు సులభంగా కారులోకి ఎక్కడం, దిగడం చేయవచ్చు. కాగా దివ్యాంగులకు ఉండే ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిన ఈ కారును ఇటీవల అవని లేఖరాకు  అందించారు మహీంద్రా. ఈ సందర్భంగా తనకు బహుమతిగా వచ్చిన కారుని చూసిన పారా ఒలింపియన్  మురిసిపోయింది. ‘థ్యాంక్యూ  ఆనంద్‌ మహీంద్రా అండ్‌ టీమ్‌’ అంటూ తాను కారులో కూర్చున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఇవి కాస్తా వైరల్ గా మారాయి.

కాగా ఎక్స్ యూవీ 700 గోల్డ్ ఎడిషన్ కార్లను గతంలో పలువురికి బహుమతిగా అందించారు ఆనంద్ మహీంద్రా. ఇందులో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లుంటాయి. మొత్తం 7 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్,  ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లేన్ కీస్ అసిస్ట్, ఆటో హెడ్ లైట్ బూస్టర్, తదితర అత్యాధునిక సదుపాయాలుంటాయి. 2020 టోక్యోలో జరిగిన‌ పారా ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1) విభాగంలో భారత్ నుంచి ఇండియన్ షూటర్ అవనీ లేఖరా (Avani Lekhara) ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి భారత్‌కు బంగారు పతకాన్ని సాధించిపెట్టిన విష‌యం తెలిసిందే. ఈ ఫైనల్‌లో అవనీ లేఖరా 249.6 రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios