Asianet News TeluguAsianet News Telugu

అంబానీ ఆస్తి రూ.75 వేల కోట్లు హాంఫట్! అదే బాటలో మరో 20 మంది?

స్టాక్ మార్కెట్లు సంపద స్రుష్టించే వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో బాగానే ఉంటాయి. కానీ ఏదైనా ఒడిదొడుకులు వస్తే మాత్రం నిలువరించడం కష్ట సాధ్యమే మరి. ఆగస్టు వరకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ‘సెన్సెక్స్’ రికార్డులు నెలకొల్పింది. ట్రేడ్ వార్, ముడి చమురు ధర ఎఫెక్ట్, రూపాయి పతనం పేరుతో రక్తమోడిన స్టాక్ మార్కెట్లు బిలియనీర్ల ఆస్తుల విలువనూ హరించేశాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 20 మంది బిలియనీర్లు రూ.35 వేల కోట్లు కోల్పోయారు.

Ambani Sr, Damani add billions to wealth after Sept-Oct bloodbath
Author
New Delhi, First Published Dec 5, 2018, 10:26 AM IST

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌లో ఈ ఏడాది తొలి ఎనిమిది నెలల్లో బాగా సంపాదించిన వారు కొంత మంది ఉండొచ్చు. కాకపోతే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చిన దిద్దుబాటు, సర్దుబాట్లలో సంపాదించిన దాంతోపాటు మరింత సొమ్మును వారు కోల్పోయారు. దీనికి అంబానీ, దమానీ వంటి బిలియనీర్లు కూడా అతీతులు కారని తేలింది.

ఎందుకంటే 20 మంది బిలియనీర్లలో 10 మంది సుమారు రూ.7,000- 35,000 కోట్ల వరకు సంపదను కోల్పోయారు. వీరిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ, రిటైల్ నెట్ వర్క్ షోరూమ్ ‘డీ-మార్ట్‌’ యజమాని రాధాకిషన్‌ దమానీ ఉన్నారు. కాకుంటే వీరి సంపద నవంబర్ లో మళ్లీ పెరగడం ఆసక్తికర పరిణామం.

గత ఆగస్టులో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ‘సెన్సెక్స్‌’- 52 వారాల గరిష్ఠ స్థాయి 38,989.65 పాయింట్లుగా నమోదైంది. ఆ సమయంలో రిలయన్స్ షేర్ రూ.1,300 స్థాయిపైన ట్రేడైంది. అయితే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మార్కెట్లలో వచ్చిన దిద్దుబాటుతో అక్టోబరు 26న రూ.1,030 స్థాయికి దిగజారింది. మళ్లీ నవంబర్ నెలలో సెన్సెక్స్‌ 8.56 శాతం లాభపడగా, ఆర్‌ఐఎల్‌ షేరు దాదాపు 12 శాతం పెరిగింది. 

ఆగస్టులో ముకేశ్‌ అంబానీ సంపద 50.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3,55,000 కోట్లు)గా నమోదైంది. కానీ అక్టోబర్ 26 నాటికి 40 బిలియన్ల డాలర్లకు తగ్గింది. అంటే సుమారు రూ.75,000 కోట్లు ఆవిరైంది. నవంబర్లో మళ్లీ ఆర్‌ఐఎల్‌ షేరు పెరగడంతో ఆయన సంపద 45.8 బి.డాలర్లకు పెరిగింది. ముకేశ్‌ నేతృత్వంలోని మరో కంపెనీ రిలయన్స్ కూడా గత నెలలో 6.6 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు చూస్తే మాత్రం అంబానీ సంపద 5.52 బిలియన్ డాలర్లు (సుమారు రూ.40,000 కోట్లు) పెరిగింది. రిలయన్స్ సొంత టెలికం ప్రొవైడర్ సంస్థ జియో వచ్చే ఐదేళ్లలో 100 శాతం ఆదాయం, లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి.

రాధాకిషన్‌ దమానీ నేతృత్వంలోని రిటైల్ నెట్ వర్క్ అవెన్యూ సూపర్ మార్కెట్స్ ‘డీ-మార్ట్‌’ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. ఆగస్టులో షేర్ ధర గరిష్ఠంగా రూ.1,600 వద్ద కదలాడింది. ఆ తరవాత దిద్దుబాటుతో అక్టోబర్ నెలాఖరుకు 21.5 శాతం మెరుగు పడి రూ.1,130 స్థాయికి దిగి వచ్చింది. దీంతో దమానీ సంపద 9.5 బిలియన్‌ డాలర్ల నుంచి 6.17 బిలియన్ల డాలర్లకు తగ్గింది. నవంబర్ నెలలో మళ్లీ షేరు రూ.1,500 స్థాయికి చేరడంతో ఆయన సంపద 8.23 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది జనవరి నుంచి మాత్రం సంపద 1.27 బిలియన్ డాలర్లు (రూ.9,000 కోట్లు) పెరిగింది.

సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సంపద కోల్పోయిన 20 మంది బిలియనీర్లలో నవంబర్ నెలలో తిరిగి ఎంతో కొంత సంపదను జత చేసుకున్న వారిలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అధిపతి ఉదయ్‌ కోటక్‌ (రూ.6,700 కోట్లు), వాడియా గ్రూపు నస్లీ వాడియా (రూ.6,400 కోట్లు), హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అధినేత శివ్‌ నాడార్‌ (రూ.1,500 కోట్లు) ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios