Asianet News TeluguAsianet News Telugu

మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా అరుదైన ఫీట్.. 90 విమానాలను పూర్తి మహిళా సిబ్బందితో నడిపి రికార్డు..

ఎయిర్ ఇండియా  అత్యధిక మహిళా పైలట్లను కలిగి ఉన్న అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. మహిళా పైలట్ల విషయంలోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం మహిళా సిబ్బందితో 90కి పైగా విమానాలను నడుపుతున్నాయి.

A rare feat of Air India on the occasion of Women's Day a record of flying 90 flights with an all-female crew MKA
Author
First Published Mar 8, 2023, 7:54 PM IST

మహిళా దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా మహిళలను  ప్రత్యేకంగా గౌరవించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో దేశంలోని పలు సంస్థలు  మహిళా కార్మికులను సత్కరించి, వారి స్ఫూర్తికి వందనం చేశాయి. తాజాగా విమానయాన రంగానికి సంబంధించి ఎయిర్ ఇండియా తన 1,825 మంది పైలట్‌లలో 15 శాతం మంది మహిళలేనని బుధవారం తెలిపింది. దీంతో మహిళా పైలట్ల పరంగా అతిపెద్ద విమానయాన సంస్థగా ఆవిర్భవించింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్,  ఎయిర్ ఏషియా ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూర్తిగా మహిళా సిబ్బందితో  90 విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది.  

ఎయిర్ ఇండియా దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడిపే విమానాల్లో మొత్తం 1,825 మంది పైలట్‌లలో, 275 మంది మహిళలు ఉన్నారు. అలాగే మొత్తం సిబ్బందిలో 15 శాతం మంది మహిళలే  ఉన్నారు. ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రొఫెషనల్ మహిళా పైలట్లు భారత్‌లో ఉన్నారని తెలిపారు. ఎయిర్ ఇండియాలో తమతో పాటు పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను చూసి గర్వపడుతోందని తెలిపారు. మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరనే సందేశాన్ని ప్రచారం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు.

ఎయిర్ ఇండియా గత వారం 6,500 మంది కొత్త పైలట్లను నియమించుకున్నట్లు ప్రకటించింది. ఒక్కో పైలట్ కు కోటి రూపాయల ప్యాకేజీ ఇస్తానంటోంది. ఇందులో మహిళలకు కూడా అవకాశాలు కల్పించనున్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్, ఎయిర్‌బస్ నుండి 470 విమానాలను ఆర్డర్ చేసింది. ఈ విమానాలను నడపడానికి కంపెనీ వివిధ పోస్టుల్లో ఖాళీలను తీసుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ వద్ద దాదాపు 140 విమానాలు ఉన్నాయి. మీడియా కథనం ప్రకారం, ఎయిర్ ఇండియా 'B777 కెప్టెన్' కోసం వెతుకుతోంది. దీని కోసం రూ. 2 కోట్ల వరకు వేతన ప్యాకేజీ అందించే వీలుంది. కంపెనీ B777 ఫ్లీట్ కోసం హై-ఎండ్ B737 NG/MAX రకం రేటింగ్ ఉన్న పైలట్‌ల నుండి ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తోంది. వారికి నెలకు 21,000 డాలర్లు అంటే రూ.17,39,118 వరకు చెల్లిస్తుంది.  వార్షిక ప్రాతిపదికన చూస్తే సుమారు రూ. 2,08,69,416 చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. 

అలాగే ఎయిర్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరించేందుకు మొత్తం 840 విమానాల కోసం ఆర్డర్లు చేసింది. ఇందులో 370 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక ఎయిర్‌లైన్స్ చేసిన అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా తన 113 విమానాలను నిర్వహించడానికి దాదాపు 1,600 మంది పైలట్‌లను కలిగి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios