ప్రతిపక్షనేత, వైపీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించుకున్న తన ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించిన ఈ ఇంట్లోకి ఉదయం 8.19 గంటలకు వైఎస్ జగన్, భారతి దంపతులు అడుగుపెట్టారు.

ఈ కార్యక్రమానికి జగన్ మాతృమూర్తి విజయమ్మ, సోదరి షర్మిల, అనిల్ కుమార్‌తో పాటు వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డితో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు హాజరయ్యారు. అంతకు ముందు కొత్త ఇంటిలో సర్వ మత ప్రార్థనలు జరిగాయి.

ఈ సందర్భంగా వైసీపీ మహిళా నేత, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాజధానికి జగన్ వ్యతిరేకమన్న వారికి అమరావతిలో గృహప్రవేశం చేసి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారన్నారు.

చంద్రబాబు ఇప్పటి వరకు ఇక్కడ సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని, అలాగే అసెంబ్లీ, సచివాలయం, సీఎం నివాసం తాత్కాలికమని రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంటి గృహ ప్రవేశానికి ఎవ్వరిని పిలవలేదన్నారు. జగన్ అప్‌కమింగ్ సీఎం అని, చంద్రబాబు ఔట్‌గోయింగ్ సీఎం అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.