వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో.. నెల్లూరు వైసీపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్‌‌స్టేషన్‌లో అధికారులను బెదిరించారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కేసు నమోదైంది. 

కాగా.. ప్రశ్నించేందుకు వెళ్తే నాపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొంటున్నారు. పోలీసులంటే నాకు గౌరవం ఉందని ఆయన అన్నారు. కాగా... త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై పోలీస్ కేసు నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగా.. ఆయన అరెస్టుని నిరసిస్తూ.. కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.  పోలీసుల తీరుని నిరసిస్తూ.. రోడ్డు పై బైఠాయించారు. అయితే.. ఈ ఉద్రిక్తత కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు తగినన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలు చోట్ల బందోబస్తు  ఏర్పాటు చేశారు.