కర్నూలు: పార్టీ వీడడానికి సిద్ధమైన గౌరు చరితారెడ్డి దంపతులను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బుజ్జగిస్తున్నారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఢిల్లీ నుంచి వచ్చారని, మాట్లాడుదామని, మంచే జరుగుతుందని వారు గౌరు చరితారెడ్డి దంపతులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 వైసీపీ రాష్ట్ర నాయకులు విజయసాయిరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు గౌరు చరితారెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే పాణ్యం టికెట్‌ ఇవ్వకపోతే పార్టీలో ఉండలేమని, ఆత్మగౌరవాన్ని చంపుకుని కొనసాగలేమని గౌరు దంపతులు కచ్చితంగా చెబుతున్నట్లు తెలుస్తోంది.

పాణ్యం వైసీపీ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి ఖరారు చేశారని వైసిపి నాయకులు అంటున్నారు. దీంతో సీటు ఆశిస్తున్న ఎమ్మెల్యే గౌరు చరిత, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి దంపతులు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
 
వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు గౌరు దంపతులు సిద్ధపడినట్లు చెబుతున్నారు. దీంతో లండన్‌ నుంచి అమరావతికి చేరుకున్న జగన్‌ దృష్టికి గౌరు చరితారెడ్డి దంపతుల వ్యవహారాన్ని తీసుకుని వెళ్లినట్లు సమాచారం.

 అయినా పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదని అంటున్నారు. మార్చి 3న అమరావతిలోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరుతారని అంటున్నారు. గౌరు దంపతులు రెండో రోజు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని కల్లూరు అర్బన్‌ వార్డులు, పాణ్యం మండలానికి చెందిన కీలక నాయకులు, ముఖ్య అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు.