అభం శుభం తెలియని ఆరునెలల పసికందుని.. గుర్తుతెలియని వ్యక్తులు నీటి సంపులో పడేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ సంఘటన చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పిల్లగుండ్లపల్లె ఒంటిల్లులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..పిల్లగుండల్లపల్లె గ్రామానికి చెందిన భువనేశ్వరి.. అదే మండలానికి చెందిన వినోద్ కుమార్ ని మూడేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరి ప్రేమను భువనేశ్వరి ఇంట్లో అంగీకరించగా.. వినోద్ ఇంట్లో నిరాకరించారు. దీంతో.. వీరు పెద్దలకు దూరంగా బతుకుతున్నారు. 

 వినోద్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇటీవల భువనేశ్వరి తన పిల్లలతో సహా పుట్టింటికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం చిన్న కుమారుడిని ఉయ్యాలలో పడుకోబెట్టి.. పెద్ద కుమారితో మరో గదిలో ఆమె నిద్రించింది. ఆమె నిద్రలేచి చూసేసరికి ఉయ్యాలలో పసికందు కనపించలేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. 

చివరకు నీటి డ్రమ్ములో శవమై కనిపించాడు. దీంతో.. బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దారుణానికి ఎవరు పాలుపడ్డారో తెలయరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.